- ఆలయం వెలుపలకు ఉగ్ర శ్రీనివాసుడు
- కైశిక ద్వాదశితో ఏటా బయటకు రాక
తిరుమల, నవంబర్ 5 : తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఇవాళ ఉగ్ర శ్రీనివాసుడు వెలుపలకు వచ్చారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిస్తారు. కైశిక ద్వాదశి నాడు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది. ఇవాళ కైశిక ద్వాదశి కావడంతో తెళ్లవారుజామున తిరువీధి ఉత్సవంగా వచ్చారు శ్రీనివాసుడు. అది కూడా సూర్యోదయం ముందే ఆలయం నుండి వెలుపలికి వచ్చి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నాలుగున్నరకు ఆలయం నుంచి బయటకు ఊరేగింపుగా వచ్చిన స్వామివారు.. ఐదున్నరకు ఆలయంలోకి చేరుకున్నారు.
భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు. మళ్లీ వచ్చే ఏడాది కైశిక ద్వాదశి నాడే ఉగ్ర శ్రీనివాసుడు ఆలయం వెలుపలికి వస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 63,670 మంది భక్తులుదర్శించుకోగా 30,475 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.79 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.