తూరుపు వెలుగు

స్వేచ్ఛా విహంగాలకు ఎగిరే
పరిధులు గీయగలమా ?
మనిషి విశాల ఆలోచనలకు
బంధాల అడ్డుకట్టలేయగలమా?

హద్దులు సరిహద్దులు
మానవతకు సంకెళ్లను వేస్తూ
మనుషులు తవ్వుకున్న
లోతైన కందకాలు !

పచ్చని వీచే పైరగాలి
రాత్రులను వెలిగించే వెన్నెల
మట్టిని పులకింపచేసే వాన
జీవరాశిని మేల్కొలిపే ఎండ
ఏ  హద్దులు సరిహద్దులు
ఎలా ఆపగలవు ?

మెదళ్లను కదిలించే మాట
ఎదలను కలవరపెట్టే పాట
దావానలమై దహిస్తూ
శత్రువు గుండెను గురిపెట్టి
వదిలిన బాణమైన అక్షరాన్ని
ఏ శక్తులు ఆపగలవు ?

అన్యాయాన్ని నిలదీస్తూ
ప్రశ్నించే గొంతుకలను
పరమ పిరికి రాజ్యం
నిర్లజ్జగా నిర్బంధించినందుకు
రక్తాశృవులు చిందే రుద్ర నేత్రాలను..
అలజడి చేస్తూ ఎత్తిన పిడికిళ్లను
ఆపాలనుకునే అవివేకులను
తుదముట్టించ రగిలే
యువ శక్తులకిదే ఆహ్వానం !

నేటి  రాత్రి రాకాసి చీకటి
నేల రాలకు తప్పదు
వెలుగు తారకలు మెరవక మానవు
రేపటికి తూరుపు వాకిట
ఉషోదయం జగతిన
పొడవక ఆగదు !
(ప్రశ్నించే శక్తులపై అధికార అహంకారం
విపరీతంగా అణచివేత, కూల్చివేతలు
కొనసాగింపుకు నిరసనగా)
– డా. కె. దివాకరా చారి, 9391018972

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page