తెలంగాణ ఆకాంక్షను అణిచివేసింది కాంగ్రెస్సే

ఎట్టికైనా, మట్టికైనా మనోడో కావాలె
దొంగ రేవంత్‌రెడ్డిని నమ్మితే ఇక అంతే

తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో, మోదీకో ఉండదని, ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ…నల్లగొండ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచేది పైళ్ల శేఖర్‌ రెడ్డి అని కేటీఆర్‌ తెలిపారు. సొంతింటికి తిరిగి వొచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. దారి తప్పిన కొడుకు ఇంటికి తిరిగొచ్చినట్టుందని, ఈనగాసి నక్కలపాలు చేయొద్దని కలిసి వొస్తున్నారని కెటిఆర్‌ వ్యాఖ్యానించారు. రూ. 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌ రెడ్డి అని, సోనియా గాంధీని బలి దేవత అన్నది రేవంత్‌ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఉద్యమంలో బిడ్డలు అమరులు కావడానికి కాంగ్రెస్‌ కారణమని, సోనియమ్మ దయతలచి తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ లేకుంటే టీపీసీసీ, టీబీజేపీ ఉండేవా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. తాము ఎవరికి ఏ టీం, బీ టీం కాదని, తెలంగాణ ప్రజల టీమ్‌ అని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీని ముద్దపప్పు అన్నది రేవంత్‌ రెడ్డేనని, రేవంత్‌ అవసరానికి కండువా మార్చుకుంటే తామంతా మారాలా..అంటూ కెటిఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఆకాంక్షలను మొదటి నుంచి అణిచివేసింది కాంగ్రెస్సేనని, బీసీ జన గణన చేయాలని అడిగితే మోదీ పెడచెవిన పెట్టారని, తెలంగాణ ప్రజల్ని గుజరాతీ విముక్తి చేస్తాడని మోదీ అన్నారని ఆయన గుర్తుచేశృారు. తెలంగాణలో తాము ఏం చేయలేదని ఓడిస్తారని కెటిఆర్‌ ప్రశ్నించారు. సాగు, తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి ఇస్తున్నామని, అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని, అన్ని కులవృత్తుల వారిని అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణలో ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్నామని అన్నారు. ముదిరాజ్‌ బిడ్డలకు గౌరవం ఇచ్చింది సీఎం కేసీఆరేనని, కేసీఆర్‌ ఏకు మేకు అయితడని కాంగ్రెస్‌, బీజేపీకి భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్‌కు ఐదారుగురు ముఖ్యమంత్రులు దొరికినా, వోటర్లు దొరకడం లేదని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అయితడని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page