తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర!

ఆమె మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం
 నేడు సుష్మా స్వరాజ్‌ జయంతి

తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్‌  కీలకపాత్ర పోషించారు. ఆమె జన్మదిన సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం…
2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు.  తెలంగాణ బిల్లుకు సభలో మూడిరట రెండొంతుల మెజార్టీ కావాలి. దీనికి ఓటింగ్‌ కూడా జరపాల్సి ఉంటుంది. దీంతో సెక్రటరీ జనరల్‌ నిబంధనలు వివరిస్తూ.. సభకు నిరాటంకంగా అంతరాయాలు కలుగుతున్నప్పుడు, అధికార, ప్రతిపక్ష పార్టీలు అంగీకరిస్తే హెడ్‌ కౌంట్‌ (ఎంపీలను నిలబెట్టి, లెక్కించడం) సరిపోతుందని చెప్పారు. దీంతో సుష్మా స్వరాజ్‌ నిర్ణయం కీలకమైంది. ఆమె అంగీకరిస్తేనే స్పీకర్‌ మీరాకుమార్‌ ఈ పద్ధతికి ఒప్పుకునేలా కనిపించారు. సుష్మా స్వరాజ్‌ దానికి అంగీకరించారు. ‘మీరు బిల్లు పెట్టండి. నేను లేచి నిలబడి మాట్లాడతాను. తర్వాత హోం మంత్రిని ఒక్కొక్క క్లాజు చదువుకుంటూ వెళ్లమనండి. అలాగే ఓటింగ్‌ కూడా పెట్టండి’ అని సూచించారు. దీనికి అంతా అంగీకరించారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకురాలి హోదాలో సుష్మా స్వరాజ్‌ ప్రసంగించగా, కాంగ్రెస్‌ పార్టీ తరపున జైపాల్‌ రెడ్డి ప్రసంగించారు. బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో కలిపి చర్చలో ప్రసంగించింది మొత్తం ముగ్గురు మాత్రమే.

ఈ సందర్భంగా ఆ నాడు  తెలంగాణ బిల్లపై సుష్మా స్వరాజ్‌ ప్రసంగం  ఇలా ఉంది..
‘‘ధన్యవాదాలు అధ్యక్ష జీ. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌నిర్మాణ బిల్లును ఆమోదం కోసం ఇప్పుడే హోం మంత్రి ప్రవేశపెట్టారు. మా పార్టీ తరపు నుంచి ఆ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు నేను నిలబడ్డాను. ఈ బిల్లుకు మేం మద్దతు ఇవ్వటమే కాదు. ఇది పాసయ్యేలా ఓట్లు కూడా వేస్తాం. ఎందుకంటే ఇది మా విశ్వసనీయతతో ముడిపడిన విషయం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు బిల్లును తీసుకొస్తే, బీజేపీ మద్దతు ఇచ్చి దాన్ని ఆమోదించేలా చేస్తుందని పార్లమెంటు బయట, పార్లమెంటు లోపల, తెలంగాణలోను, తెలంగాణ వెలుపల కూడా మేం ఎన్నోసార్లు డిమాండ్‌ చేశాం.   అంతే కాదు, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక బిల్లును తీసుకురాకపోతే, మా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో తెలంగాణను ఏర్పాటు చేస్తాం అని కూడా హామీ ఇచ్చాం. అధ్యక్ష జీ.. మీరే సాక్షి. మీరు ఇదే స్థానంలో కూర్చున్నారు. నేను ఇక్కడి నుంచే మాట్లాడాను. తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుంటున్న పిల్లలకు విజ్ఞప్తి చేస్తూ తెలుగులో చెప్పాను. ‘తెలంగాణ కోసం బలిదానం వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి. బతకాలి’ అని. ఇప్పుడు ఈ బిల్లు వారి స్వప్నాలను సాకారం చేసేందుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించి ఆ పిల్లల పట్ల విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడతాం?

కాబట్టే, మొత్తం విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ మేం నిలబడి ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం.  నా తొలి ఫిర్యాదు మీమీదే సోనియా జీ. తెలంగాణ ఇస్తామని 2004లో మీరు వాగ్ధానం చేశారు. 2014 వచ్చింది. మీ ప్రభుత్వం తొలి దఫా(2004-2009)లో ఏమీ చేయలేదు. రెండో దఫా (2009-2014)లో సైతం, 15వ లోక్‌సభ చివరి సమావేశం, చివరి వారంలో మీరు బిల్లును తీసుకొచ్చారు. 21వ తేదీన సమావేశాలు ముగుస్తాయి. ఈరోజు 18. కేవలం మూడు రోజులే మిగిలి ఉన్నాయి. ప్రధానమంత్రి సభలో కూర్చుని ఉన్నారు. ఆయన మంత్రిమండలిలోని సభ్యుడు వెల్‌లో నిలబడ్డారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సభలో కూర్చుని ఉన్నారు. అయినా ఫర్వాలేదంటూ ఆ పార్టీ సభ్యులు వెల్‌లోకి వచ్చి నిలబడ్డారు. ఆ పార్టీ ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చున్నారు.  ప్రధానమంత్రి క్యాబినెట్‌లో బిల్లును ఆమోదిస్తే.. వాళ్ల ముఖ్యమంత్రి దాన్ని వ్యతిరేకించి వెనక్కి పంపించారు.  ‘‘నేను గర్వంగా చెప్పగలను.. ఇప్పుడు కూడా బీజేపీ సీమాంధ్ర, తెలంగాణ నాయకులు మాత్రం కలసికట్టుగా కూర్చుని, సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సీమాంధ్ర నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు.. తెలంగాణ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌ కూడా తెలంగాణకే చెందాలి. కానీ, మాకు కూడా న్యాయం చేయండి’ అని. న్యాయం కోసం వాళ్లు ఏం కోరుకుంటున్నారు? హైదరాబాద్‌లో రూ.1500 కోట్ల మిగులు ఆదాయం ఉంటే దాంతో తెలంగాణకు మేలు జరుగుతుంది. మరి కోస్తాంధ్ర, రాయలసీమకు జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? దాన్ని కేంద్ర ప్రభుత్వమే పూడ్చాలి. హోం మంత్రి హామీతో ఇది నెరవేరదు. నిధులు ఇచ్చే ఏర్పాటు చేయండి. వారి నష్టాన్ని పూడ్చే మాట చెప్పండి. మరోమాట వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 148 సంస్థలు ఉన్నాయి, పదేళ్లపాటు అది సంయుక్త రాజధాని. కానీ, సీమాంధ్రలో ఏర్పాటు కావాల్సిన సంస్థలకు సూత్రప్రాయంగా ప్రణాళికా సంఘం నుంచి అనుమతి ఇవ్వండి. వాటికి టోకెన్‌ అమౌంట్‌గా కొంత నిధులు ఇవ్వండి. మధ్యంతర బడ్జెట్‌ రూపంలో వాటిని నిధులు సమకూర్చండి. వారు చెబుతున్న మూడో మాట.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటున్నారు. దానికోసం మండలాల బదిలీ జరగాల్సి ఉంది. దీనిపై వెంకయ్యనాయుడు సమక్షంలో వారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు జైరామ్‌ రమేశ్‌ లేఖ మా వద్ద ఉంది. కానీ, దీన్ని క్యాబినెట్‌లో మార్చేశారు. ఒప్పందం ప్రకారం వాటిని బదిలీ చేయండి.

అందుకే అధ్యక్ష జీ.. తెలంగాణ ఏర్పాటు కావాలి. హైదరాబాద్‌ కూడా తెలంగాణలోనే ఉండాలి. అయితే, సీమాంధ్ర వారికి కూడా న్యాయం జరగాలి. అందుకే ఇవన్నీ బిల్లులో ఉండాలి. ఇది నా కోరిక. ఈ బిల్లులో గవర్నర్‌కు అధికారాలను కట్టబెట్టారు. ఇలాంటి శక్తులు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. సాధారణ బిల్లుతో పాటు రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీసుకొస్తే మేం మద్దతు ఇస్తామని ప్రభుత్వానికి చెప్పాం. లోపాల బిల్లు తీసుకురావొద్దు.. అసలైన బిల్లు తీసుకురండి అని చెప్పాం. ఈ బిల్లు ఆమోదం పొందగానే బయటకు వెళ్లి పాటలు పాడతారు. ‘’కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది. సోనియా అమ్మ తెలంగాణ ఇచ్చింది’’ అంటారు. సోనియా అమ్మను గుర్తుంచుకుంటే.. ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి. తెలంగాణకు మద్దతు ఇస్తామని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ హామీ ఇచ్చారు కాబట్టి, జన చేతన యాత్రలో మా సీనియర్‌ నాయకుడు అడ్వాణీ మాట ఇచ్చారు కాబట్టి మేం ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. మా విశ్వసనీయత కోసం మద్దతు ఇస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకైనా, నాయకుడికైనా విశ్వసనీయతే ముఖ్యం. మనం ఏదైనా చెబితే ఎదుటివాళ్లు దానిపై నమ్మకం ఉంచాలి. అందుకే మేం ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. హోం మంత్రి సమాధానం ఇచ్చేప్పుడు సీమాంధ్రకు న్యాయం చేయాలని నేను చెప్పినవన్నీ ఈ బిల్లులో పెట్టాలని నేను కోరుతున్నాను. అలా సీమాంధ్రులు కూడా సంతోషిస్తారు. ఒకవేళ అలా చేయకుంటే.. రాబోయే ప్రభుత్వం మాదే. మేం న్యాయం చేస్తాం అని నేను ఇక్కడ నిలబడి చెబుతున్నాను. సీమాంధ్రవాళ్లూ.. బాధపడకండి. మీ భద్రతకు మాది పూచీ. ఈ హామీ ఇస్తూ నేను ఈ బిల్లుకు మద్దతు పలుకుతున్నాను. ఈ బిల్లు ఆమోదానికి మద్దతు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.’’

బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుష్మా స్వరాజ్‌ మాట్లాడుతూ, ‘’బిల్లును సభలో పెట్టాలి. కానీ, అది ఆమోదం పొందకూడదు. దీనికి కారణం బీజేపీనే అని నిందించాలి. బిల్లు పెట్టడం ద్వారా తెలంగాణ వారిని, దాన్ని ఆమోదించకుండా సీమాంధ్ర వారిని సంతృప్తిపర్చాలి’. ఇదే కాంగ్రెస్‌ ప్లాన్‌. ఇది మాకు స్పష్టంగా అర్థమయ్యింది. దీంతో సభలో ఆందోళనలు జరుగుతున్నా సరే మేం బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. బిల్లుకు మద్దతు ఇచ్చాం’ అని చెప్పారు.
ఆగస్టు 6వ తేదీ రాత్రి సుష్మా స్వరాజ్‌ మృతి చెందిన సందర్భంగా, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌… ‘‘కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాను. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమె ఇచ్చిన మద్దతును తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. చిన్నమ్మా, మీ ఆత్మకకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. అంటూ ట్విటర్‌ ద్వారా సుష్మాకు నివాళులర్పించారు.
  -రామకిష్టయ్య సంగనభట్ల
    9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page