జనవరి 9… తెలంగాణ తొలి దశ ఉద్యమ ప్రారంభ దినం
తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మాత్రమే పరిష్కారమని, రాష్ట్ర సాధనకై పోరాటం తప్పదనే భావన తెలంగాణ యువతలో అంకురించింది. అలా తెలంగాణ తొలి ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969, జనవరి 9 న ఖమ్మం పట్టణంలో బి.ఎ. స్టూడెంట్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడైన రవీంధ్రనాథ్ గాంధీచౌక్ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించాడు. తొలి దశ ఉద్యమ ప్రారంభ పూర్వా పరాలు తెలుసుకునే ప్రయత్నం ఇది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి రాయలసీమ, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నాయకులతో కలిసి.1956, ఫిబ్రవరి 20 న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే పెద్దమనుషుల ఒప్పందం. న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున, బూర్గుల రామ కృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి. నరసింగరావుబీ ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న ఉన్నారు. తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఏర్పరచు కున్నారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956, నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
రవీంధ్రనాథ్
అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి తగిలింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదుబీ అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి (కె.వి.రంగారెడ్డి) ని నియమించాడు. అయితే మళ్ళీ 1962 నుండి 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. 1969లో తెలంగాణ ప్రాంతానికి చెందిన జె.వి.నర్సింగరావును ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ వారు భావించారు. అలాగే ఆంధ్ర ప్రాంతం నుండి తరలి వచ్చిన ప్రజలు తెలంగాణ ప్రాంతంలో భూములు కొని, వ్యవసాయం చేసారు. ఇది తమ భూముల ఆక్రమణగా కొందరు తెలంగాణా ప్రజలు భావించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందనే భావన కూడా తెలంగాణా ప్రజల్లో బలంగా కలిగింది. తెలంగాణ విద్యాసంస్థల్లో కూడా తమకు తగినన్ని సీట్లు రాలేదని విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యం లోనే ‘‘తెలంగాణ తొలి ఉద్యమం’’… ‘‘తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమం’’గా మొదలైంది. తెలంగాణ రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969, జనవరి 9 న ఖమ్మం పట్టణంలో బి.ఎ. స్టూడెంట్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడైన రవీంధ్రనాథ్ గాంధీ చౌక్ వద్ద నిరవధిక దీక్ష ప్రారంభించాడు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది. జనవరి 10 న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థుల సమావేశంలో – తెలంగాణా రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చెయ్యాలని ప్రతిపాదించారు.
అయితే, జనవరి 13 న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్థులలోని ఒక వర్గం ‘‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’’గా ఏర్పడి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో ‘‘తెలంగాణ విద్యార్ధుల కార్యాచరణ సమితి’’ ఏర్పడింది. ఆ రోజు మొట్టమొదటి సారిగా ప్రత్యేక తెంగాణ సాధనను తమ లక్ష్యంగా విద్యార్థులు ప్రకటించుకున్నారు. విద్యార్ధుల కార్యాచరణ సమితి మెడికల్ విద్యార్ధి మల్లిఖార్జున్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. విద్యార్ధులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాని మల్లిఖార్జున్ పిలుపునిచ్చారు. అదే రోజున పురప్రముఖులు కొందరు ‘‘తెలంగాణా పరిరక్షణల కమిటీ’’ని ఏర్పాటు చేసారు. జనవరి 18 న విద్యార్థుల్లోని రెండు వర్గాలు (తెలంగాణ రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణ కోరేవారు) వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు. ఈ రెండు ఊరేగింపులు ఆబిద్స్ లో ఎదురైనపుడు ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీఛార్జి చెయ్యవలసి వచ్చింది. అదేరోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసాయి.
ఉద్యమ కారుల కోరికలను చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19 న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం ఒక ఒప్పందానికి వచ్చింది. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి. పెద్దమనుషుల ఒప్పందం లోని తెలంగాణ రక్షణలను అమలు చెయ్యాలి. అయితే ప్రత్యేక తెలంగాణ వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు. ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని, అది నెరవేరే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. జనవరి 24న సదాశివపేటలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 17 ఏళ్ల శంకర్ మరుసటి రోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్. కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేశారు.
అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపివేస్తారు. తెలంగాణ రక్షణల అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీనుండి ఒక బృందం వస్తుంది. ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్థి రవీంద్ర నాథ్ తన దీక్షను విరమించాడు. దీనితో తెలంగాణ రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది. జనవరి 28న వరంగల్లులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానం చేసారు. 1969 ఫిబ్రవరి 28 న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణ ప్రజాసమితి ని స్థాపించారు. జూన్ 4న తెలంగాణ పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్ నగరానికి వచ్చి విద్యార్ధి నాయకులు, తెలంగాణ ప్రజా సమితి నాయకులతో చర్చలు జరిపింది.
తెలంగాణ తొలి ఉద్యమ కాలంలోమొత్తం 95 సార్లు కాల్పులు జరిగాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఉద్యమంలో 369 మంది చనిపోగా, ప్రభుత్వ లెక్కలు మాత్రం 57 మంది చనిపోయినట్టుగా చెప్పాయి. తెలంగాణ ప్రజా సమితి నేతతో కేంద్రం చర్చలు జరిపింది. సెప్టెంబర్‌లో చెన్నారెడ్డి ఢిల్లీలో చర్చలు జరిపి వచ్చిన తర్వాత విద్యార్ధులు తరగతులకు హాజరు కావాలని చెన్నారెడ్డి, విద్యార్ధి నాయకుడు మల్లికార్జున్ ఒక ప్రకటన చేశారు. చదువులు కొనసాగిస్తూనే ఉద్యమంలో పాల్గొనాని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఉద్యోగులను, విద్యార్ధును ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు.
మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాసమితి 1971 లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించడం, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణా ప్రజాసమితి మద్దతు కీలకం కాకపోవడం,1971 సెప్టెంబర్ 24 న బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేయడం, ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం క్రమానుగతంగా జరిగి పోయాయి.
మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాసమితి 1971 లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించడం, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణా ప్రజాసమితి మద్దతు కీలకం కాకపోవడం,1971 సెప్టెంబర్ 24 న బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేయడం, ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం క్రమానుగతంగా జరిగి పోయాయి.
అలా తొలి దశ ఉద్యమం నీరు గారి పోవడం తెలిసిందే…
2001 ఏప్రిల్ 27న కేసిఆర్ నేతృత్వంలోని తెరాస ఉద్యమ పార్టీ ఏర్పాటు కావడం, సుదీర్ఘ మలి ఉద్యమ పోరాటాల, అత్మ బలిదానాల ఫలితంగా, భారత ప్రభుత్వం 2 జూన్ 2014 ను తెలంగాణ నిర్మాణ దినంగా ప్రకటించడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం అందరికీ తెలిసిందే.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494
2001 ఏప్రిల్ 27న కేసిఆర్ నేతృత్వంలోని తెరాస ఉద్యమ పార్టీ ఏర్పాటు కావడం, సుదీర్ఘ మలి ఉద్యమ పోరాటాల, అత్మ బలిదానాల ఫలితంగా, భారత ప్రభుత్వం 2 జూన్ 2014 ను తెలంగాణ నిర్మాణ దినంగా ప్రకటించడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం అందరికీ తెలిసిందే.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494