సభ సక్సెస్ తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం
ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్తలు,పోలింగ్ బూత్ సభ్యుల తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ టెలికాన్ఫరెన్స్
బహిరంగ సభ సక్సెస్ కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10:‘‘ ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది? అక్కడ లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించే సత్తా ఖమ్మం బీజేపీ నాయకులకు ఉందా? ఖమ్మం బీజేపీ నాయకులకు సభ నిర్వహించడమే చేతకాదు’’ అనే దుష్ప్రచారం జరుగుతోంది. మీ తరపున నేను సవాల్ ను స్వీకరించిన. ఖమ్మం జిల్లా కాషాయ అడ్డా అని నిరూపించే టైమొచ్చింది. దుష్ప్రచారం చేస్తున్న నేతలకు కనువిప్పు కలిగేలా కనీవినీ ఎరగని రీతిలో బహిరంగ సభను సక్సెస్ చేద్దాం. అందుకోసం మీరంతా కసితో పనిచేయండి’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలను పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు, ఆపై స్థాయి నాయకులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ పాల్గొన్న ఈ కాన్ఫరెన్స్ లో బండి సంజయ్ మాట్లాడుతూ ఈనెల 15న ఖమ్మంలో లక్ష మందితో నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన…..సభకు 5 రోజులే సమయముంది. ప్రతి ఒక్కరూ సీరియస్ గా కష్టపడి కసితో పనిచేయాలి.
హేళన చేస్తన్న వాళ్లకు గుణపాఠం చెప్పేలా, కనువిప్పు కలిగేలా బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలి..అని సూచించారు.తెలంగాణలోని రాజకీయ విశ్లేషకులు, మీడియా అంతా ఖమ్మంలో నిర్వహించబోయే బీజేపీ బహిరంగ సభపై ద్రుష్టిని కేంద్రీకరించారు..అని పేర్కొంటూ ఖమ్మంలో సభ సక్సెస్ కాదు.. ఎట్లా సభ నిర్వహిస్తారో చూద్దామని కొంతమంది అనుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో ఖమ్మం బీజేపీ కార్యకర్తలంతా మరింత కసితో పనిచేయాలి. కేసీఆర్ కు, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేలా సభను సక్సెస్ చేయాలి.. తెలంగాణలో చరిత్ర స్రుష్టించాలి.. ఈ బహిరంగ సభ సక్సెస్ తో కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగాలి..అని పిలుపునిచ్చారు. మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహింస్తూ.. ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించాలని పేర్కొన్నారు. ప్రజా, కుల సంఘాలను, వ్యాపారులను సభ లో భాగస్వాములను చేయాలని సూచించారు.