సెప్టెంబర్ 9… తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకునే కాళోజీ జయంతి
“ఏ భాష నీది ఏమి వేషమురా,
ఈ భాష ఈ వేషమెవరి కోసమురా,
ఆంగ్లమందున మాటలనగానే
ఇంత కుల్కెదవెందుకు రా,
తెలుగు వాడివై తెలుగు రాదనుచు,
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా
అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా,”!…పర భాషలపై మోజుతో మాతృ భాషను విస్మరించే వారిని కాళోజీ కంటే గొప్పగా హెచ్చరించిన వారెవరూ లేరనేది వాస్తవం. అందుకే ఆయన జయంతి ‘తెలంగాణ భాషా దినోత్సవం’ అయింది.ఎక్కడో మరాఠాల కుటుంబంలో పుట్టి, వరంగల్‌కు వచ్చి స్థిరపడి ‘నాది బడి పలుకుల భాష కాదు.. పలుకు బడుల భాష.. నా మాతృభాష తెలుగు’ అని ఎలుగెత్తిన పోరాట యోధుడు. భయం అనేది ఎరుగని కలం వీరుడు కాళోజీ. ఆయన తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచాడు. ఎన్నో సార్లు నిజాం ప్రభుత్వం కాళోజీని వరంగల్లు నుంచి బహిష్కరించింది.
“నా గురించి చెప్పు కోవాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తు వచ్చిన, అన్ని ఉద్యమాల్లో ధైర్యంగా పాల్గొన్న, ఎక్కడ అక్రమం జరిగినా దాన్ని ధిక్కరిస్తూ గేయమో, కథో రాసిన. నా గేయాలలో తొంభై ఐదు శాతం ఉద్యమాలపై రాసినవే. అవన్నీ గేయ రూపంలో ఉన్న స్టేటుమెంట్లే.”
అలాంటి కలం వీరుడిని జ్ఞాపకం చేసుకుని నివాళులు అర్పించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణ రావు లేదా కాళోజీ లేదా కాళన్న” గా సుపరిచితులు. ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడ బడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. కవిత్వం రాసినా, హక్కులడిగినా, ఉద్యమం నడిపినా, ప్రజా వాణికి ప్రతిధ్వనిగా నిలిచాయన. మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. ఆజన్మాంతం తెలంగాణ ప్రజల అన్యాయాల గురించే తపించిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణా ఉద్యమ కారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ పొందాడు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టబడింది.
‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి…అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన 1914, సెప్టెంబరు 9 న (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడ పడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయిత గా ప్రఖ్యాతి గాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహ మాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపు కడతాయి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం, గళం ఎత్తిన ఈ శతాబ్దపు మేటి కవి కాళన్న. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయ పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీలోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939 లో హైదరాబాదు లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయ రానిది. 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణా రావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింప జేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహా సభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్య సాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసు కుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించి నందుకు ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వ విద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యునిగా ఎన్నికై, 1958 నుండి 60 వరకు పనిచేసారు. రెండేళ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. ఆయన “ఆంధ్ర సారస్వత పరిషత్” వ్యవస్థాపక సభ్యుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు. ఆయన తెలంగాణ రచయితల సంఘం అధ్యకునిగా, 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగా ఉన్నారు. 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పై పోటీ చేశాడు, కానీ ఓడి పోయాడు. కాకతీయ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ “సామాన్యుడే నా దేవుడు” అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణా నంతరం ఆయన పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అంద జేసారు.1992లో పద్మ విభూషణ్ – భారత రెండవ అత్యున్నత పురస్కారం;
1972 లో తామ్రపత్ర పురస్కారం;
1968లో “జీవన గీత” రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనువాద పురస్కారం; బూర్గుల రామకృష్ణా రావు మెమోరియల్ మొదటి పురస్కారం;ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చే 1981లో సత్కారం; “ప్రజాకవి” బిరుదు; ఆంధ్ర ప్రదేశ్ లో అనేక సాహితీ సంఘాలచే సన్మానాలు; రామినేని ఫౌండేషన్ అవార్డు; గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు; కాకతీయ విశ్వ విద్యాలయంవరంగల్ వారు 1992 లో డాక్టరేట్; 1996లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు; 1996లో కళసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం పొందారు. ఆయన మరాఠీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులో అనువదించాడు. 1943 లోనే ఆయన కథల్ని “కాళోజీ కథలు” పేరుతో అప్పట్లో హైదరాబాదులో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణా గ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది. ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర మహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణలలో కాళోజి భాగం ఉంది. పాములపర్తి
నరసింహారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంలో, రాజకీయాల్లో మార్గదర్శనం చేశాడు. విశాలాంధ్ర సమస్యలు గమనించి ఆయన 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిశాడు.
అన్ని సందర్భాలలో అసలుసిసలైన తెలంగాణ వాదిగా జీవించాడు. పర భాషా జ్ఞానాన్ని సంపాదించు కోవడం అవసరమే. కానీ, ఆ సాకుతో అమ్మ లాంటి మన భాషను నిర్లక్ష్యం చేయడం ఎంత తప్పు. నేటి తరం. తెలుగు పదాలనే మర్చిపోతోంది. ఈ పరిస్థితి పోవాలి. మన తేట తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలి అని పరితపించాడు. తెలంగాణ పలుకు బడితో ప్రజల మాట, వ్యధలను ఆయన వ్యక్తం చేసిన తీరు అమోఘం. అందరికీ ఆదర్శ ప్రాయం. కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపు కోవడం సమంజసం.
-రామకిష్టయ్య సంగనభట్ల…
9440595494