సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ విమోచన పోరాటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.సెప్టెంబర్ 17న విమోచన దినం జరిపితే ఒక వర్గం వారు బాధపడతారని ఇప్పుడు ప్రభుత్వం సమైక్య దినోత్సవం అని పేర్కొనటాన్ని తప్పు పట్టారు.తెలంగాణ దినోత్సవం,పాఠశాల పుస్తకాల్లో విమోచన పోరాటాన్ని పొందుపరచాలని డిమాండ్ చేశారు.సైనికులు మరణించిన స్థలాలను స్మారక చిహ్నాలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.యోధులు మరణించే ప్రదేశాలను స్మృతి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు.అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించిన కెసిఆర్..మరి ఇప్పుడు అధికారంలో వుండి ఎందుకు నిర్వహించలేకపోతున్నారని ప్రశ్నించారు.ఇకనైనా ప్రభుత్వం మేలుకొని విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పత్రి శ్రీనివాస్ యాదవ్, ఉపేందర్ రావు, కోడూరి నరేష్,ఉడత మల్లేశం,నర్సింహారెడ్డి,విభీషణ్ రెడ్డి,గోనె మార్కండేయులు,దాబా నరేష్,కనకరాజు,శ్రీనివాస్, కర్ణాకర్,వెంకట్,యాదవ్ రావు,కృష్ణ,సాయి కిరణ్ భోగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.