తెలంగాణ వ్యవసాయ పథకాల అమలుకు పెరుగుతున్న డిమాండ్‌

‌తెలంగాణలో అమలవుతున్న పథకాలపై ప్రతిపక్ష పార్టీల్లో అభిప్రాయభేదాలున్నప్పటికీ పక్క రాష్ట్ర ప్రజల్లో మాత్రం క్రమేణ ఆ పథకాలపైన మోజు పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ పథకాలను తమ రాష్ట్రంలోకూడా అమలు చేయాలని కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కోరుతున్నారు. కాని పక్షంలో తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ ‌కూడా చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి డిమాండ్‌ ‌మొదలైంది. ముఖ్యంగా తెలంగాణరాష్ట్రంలోని రైతు సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోకూడా అమలు చేయాలంటూ వారు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు పదివేల మంది రైతులతో వారు పాదయాత్ర చేపట్టడం గమనార్హం. తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ‌సరఫరా వంటి పథకాలు అమలు చేయడం వల్ల అక్కడ వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతున్నదని, అంతేగాక రైతులు పండించిన పంటను వారి పొలాలనుండే కొనుగోలు చేస్తున్న విధానాన్ని కూడా తమ రాష్ట్రంలో అమలు చేయాలంటూ వారు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు. నవ నిర్మాణ్‌ ‌కిసాన్‌ ‌సభ అధ్యక్షుడు అక్షయ్‌కుమార్‌ ‌నాయకత్వంలో సుమారు పదివేల మంది రైతులు పై డిమాండ్‌లతొ పాదయాత్రలను ప్రారంభించారు. దాదాపు వారం రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించే క్రమంలో వ్యవసాయరంగంపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ వారు నినాదాలచేస్తూ, ప్లకార్డులతో ప్రదర్శన చేయడం గమనార్హం.

వ్యవసాయ రంగంలో తాము చేపట్టిన విప్లవాత్మక నిర్ణయాలవల్ల నిఖార్సయిన అభివృద్ధి సాధ్యపడిందని తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఘంటా పథంగా చెబుతున్నది. వ్యవసాయం దండుగ అన్న నోళ్ళు ఇప్పుడు వ్యవసాయం పండుగ అంటున్నాయి, ఊహించని రీతిలో ఉత్పత్తి వొస్తుండడంతో రైతుల్లో సంతోషం ఇనుమడిస్తోంది. అంతేకాదు. ఈ పథకాల కారణంగా రైతు అత్మహత్యల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగామన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదానికి పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ పాలకులు గుర్తు చేస్తున్నారు. ఈ పథకాలు అనేక రాష్ట్రాలకు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ఒక్కో రాష్ట్రంలో పేరు మార్పులతో దాదాపు పదమూడు రాష్ట్రాల్లో ఈ పథకాలను ఇప్పటికే అమలు చేస్తుండడం తమ రాష్ట్రానికి గర్వకారణంగా తెలంగాణ పాలకులు చెబుతున్న మాట. ఒక బహిరంగ సభలో కర్ణాటక మంత్రి సమక్షంలోనే రాయిచూర్‌ ‌బిజెపి ఎమ్మెల్లే తమకు తెలంగాణ పథకాలను అమలు చేయాలని లేదా తెలంగాణలో అయినా కలపాలని డిమాండ్‌ ‌చేసిన విషయాన్ని మంత్రి కెటిఆర్‌ ‌గతంలో చెప్పిన విషయం గమనార్హం. పూర్వ హైదరాబాద్‌ ‌రాష్ట్రానికి సంబంధించిన పర్భణీ, నాందేడ్‌, ఔరంగాబాద్‌ ‌తదితర ప్రాంతాల సర్పంచ్‌లు తమను తెలంగాణలో కలపాలని కోరుతూ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేయడం కూడా గమనార్హం.

సాగునీరు, విద్యుత్‌, ‌గిట్టుబాటు ధర విషయంలో దశాబ్దాలుగా తెలంగాణ రైతులు అనేక కష్ట, నష్టాలకు గురవుతున్న క్రమంలో తెరాస ప్రభుత్వం ఈ రంగాన్ని ఆదుకునేందుకు వివిధ పథకాలను రూపొందించింది. అందులో ప్రధానమయినది రైతు బంధు .. 2018 మే 10 దీనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక సీజన్‌కు ఎకరానికి అయిదు వేల చొప్పున సాగుకు పెట్టుబడి సహాయం అందించడంలో భాగంగా ఖరీప్‌, ‌రబీ సీజన్‌లు కలిపి పదివేల రూపాయలను అందజేస్తోంది. ఈ నగదు సహాయం నేరుగా రైతు ఖాతాల్లోకే చేరుతుండడంతో రైతులకు ముందస్తు పెట్టుబడి విషయంలో ఆందోళన పడనవసరం లేకుండా పోతోంది. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం గమనార్హం. ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధికోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన ఇరవై పథకాల్లో రైతు బంథు పథకం ఒకటి కావడం విశేషం. అలా ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ పథకాన్ని తమ రాష్ట్రంలోకూడా అమలు చేయాల్సిందిగా వివిధ రాష్ట్రాలనుండి డిమాండ్‌ ‌వొస్తున్నది.

ఒడిశా ఏకంగా పాదయాత్ర చేస్తుండగా, అంతకు ముందే కర్ణాటక రాష్ట్రంలోని రైతాంగం ఆగస్టులో అక్కడ జరిగిన రైతాంగ సమావేశంలో ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అక్కడి సౌత్‌ ఇం‌డియా రైతు సంఘం తెలంగాణ తరహా పథకాలను అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. కేరళకు చెందిన రాష్ట్రీయ కిసాన్‌ ‌సంఘ్‌ ‌కో ఆర్డినేటర్‌ ‌పిటి జాన్‌ ‌రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. అదే రాష్ట్రానికి చెందిన సంయుక్త కిసాన్‌ ‌మోర్చ అధ్యక్షుడు శాంతకుమార్‌ ‌భావనకూడా అదే. క్రమేణ దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒకదాని వెనుక ఒకటిగా ఈ పథకాలపట్ల మోజు పెంచుకుంటున్నాయి. ఒక విధంగా దేశ వ్యాప్తంగా ఈ పథకాలను అమలుచేయాలన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాగా దేశంలోని వనరులను కేంద్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతున్నదంటూ విమర్శిస్తున్న కెసిఆర్‌, ‌కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ పార్టీలో ఇదే ప్రధాన ఎజండాగా ముందుకు పోనున్న క్రమంలో దేశ ప్రజలు ఏవిధంగా ఆదరిస్తారన్నది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page