ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ సెంటిమెంటును వాడుకునే విషయంలో ఒక విధంగా ఆదివారం జరిగిన సెప్టెంబర్ 17 కార్యక్రమాల్లో తీవ్రంగానే పోటీపడ్డాయి. చివరాంకంలో అధికార బిఆర్‌ఎస్‌కూడా అందులో భాగస్వామి అయింది. సరిగ్గా నేటికి 75 ఏళ్ళ కింద జరిగిన సంఘటనను అన్ని పార్టీలు ఆలోకనం చేసుకునే ప్రయత్నాలు చేశాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడుగాని, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడుగాని ఏనాడు చరిత్ర పుటల్లో ఒక ప్రధాన ఘట్టంగా నిలిచిన సెప్టెంబర్ 17 నాటి సంఘనను స్ఫురణకు తెచ్చుకున్నదీ లేదు. ఆ రోజున సంబరాలు జరుపుకున్నదీలేదు. ఇప్పుడీ పార్టీలు పోటీలు పడి ఆ రోజును గుర్తుచేసుకుంటూ పోటీ కార్యక్రమాలను నిర్వహించాయి. ఇందులో తానేమీ తక్కువ కాదన్నట్లు బిఆర్ఎస్ కూడా మమ అనిపించింది. గడచిన తొమ్మిదేళ్ళుగా అధికారాన్ని చెలాయిస్తున్న ఈ పార్టీ విపక్షాలనుండి, స్థానిక ప్రజల నుండీ అనేకసార్లు ఆరోపణలు ఎదుర్కున్నా నిమ్మకు నీరెత్తినట్లు, ఏమీ పట్టనట్లుగా వ్యవహరించి అకస్మాత్తుగా తానూ కార్యక్రమాన్ని అయిందనిపించింది. మొత్తం మీద చరిత్ర పుటల్లోనే నిలిచిపోతుందనుకున్న సెప్టెంబర్ 17 రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో నాటి త్యాగధనులను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసినట్లైంది. ఆనాడు ధన, మాన, ప్రాణాలను త్యాగంచేసిన ఎందరో మహానుబావులను స్మరించుకునే అవకాశం ఏర్పడిరది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, స్థానిక బిజెపి నాయకులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నాటి పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, కాళోజీ నారయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావు లాంటి పలువురిని గుర్తుచేసుకుని వారికి నివాళులర్పించారు. ఆపరేషన్ పోలో పేరుతో నిజామ్ నుండి ఈ ప్రాంత విముక్తికి కారణమైన ఆ నాటి ఇండియన్ యూనియన్ హోం శాఖ మంత్రి సర్ధార్ వల్లబభాయ్ పటేల్, మున్షీలను ఆయన గుర్తుచేసుకున్నారు. కాగా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సుదీర్ఘకాలం పాలనచేసిన కాంగ్రెస్‌పైన ఆయన విరుచుకుపడ్డాడు. ఇంతటి మహోద్యమాన్ని చరిత్రలో మరుగున పడేసిందంటూ ఆయన తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పైన విమర్షనాస్త్రాలను ఎక్కుపెట్టారు. స్వాతంత్య్ర చరిత్రను కూడా కాంగ్రెస్ వక్రీకరించే ప్రయత్నం చేసిందంటూ తీవ్రమైన ఆరోపణచేశారాయన. అలాగే బిఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొత్తగా ఈ రోజును జాతి సమైక్యదినంగా పాటిస్తూ దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ, కుమురం భీం, రావి నారాయణరెడ్డి లాంటి వారికి వినమ్రంగా నివాళులర్పించారు. నాడు వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా పోరాటంలో పాల్గొన్నవారి స్ఫూర్తితోనే తెలంగాణ సాకార మహోద్యమానికి సారధ్యం వహించిన విషయానికి చెప్పుకొచ్చారు.
రాష్ట్ర సాధన సారధ్యం వహించే అవకాశం చరిత్ర తనకు ప్రసాదించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అంతేకాదు స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత కూడా తన భుజస్కందాలపైన ఉందన్నారు. గత పాలకుల అసమర్థత, భావదారిద్య్రం వల్ల వనరులు సద్వినియోగం జరుగలేదని, తాము అధికారంలోకి వొచ్చినప్పటి నుండీ మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలుపరుస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. తమ పథకాల గొప్పదనాన్ని చెబుతూ తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుకరిస్తోందంటారాయన. ఇదిలా ఉంటే రాష్ట్ర రాజధానిలో మూడు రోజులపాటు జరిగిన సమావేశాల సందర్భంగా బిజెపి, బిఆర్ఎస్ పైన కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడిరది. రాజకీయ, ఆర్ధిక, జాతీయ భద్రత అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ సవాళ్ళు ఎదుర్కుంటున్నాయని కాంగ్రెస్ అభిప్రాయపడిరది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి చరిత్రను సృష్టించబోతున్నట్లుగా కాంగ్రెస్ పేర్కొంటోంది.
ప్రచారహోరులో పార్టీలు
గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ నగరం రాజకీయ పార్టీల ప్రచారహోరుతో నిండిపోయింది. ఒకవైపు భారతీయ జనతాపార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు చేపట్టిన కార్యక్రమాలతో నగరమంతా హుర్డింగ్లు, వాల్ పోస్టర్లతో నిండిపోయింది. ఈ రెండు పార్టీలుకూడా ఆదివారం నాడే భారీ స్థాయిలో బహిరంగ సభలను నిర్వహించడంతో ఆయా పార్టీలకు చెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులతోపాటు దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన నాయకుల రాకతో ఒక విధంగా రాష్ట్ర రాజధాని నగరం కోలహాలంగా మారింది. హోటళ్ళన్నీ ప్రముఖులతో నిండిపోయాయి. కాంగ్రెస్ మూడు రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో నాయకులు, కార్యకర్తల హడావిడి ఎక్కువైంది. ఆ పార్టీకి చెందిన అత్యున్నత నిర్ణాయక మండలి (సిడబ్ల్యుసీ) సమావేశాలు కావడంతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోపక్క బిజెపి భారీ బహిరంగసభకు విచ్చేసిన లక్షలాదిమంది జనంతో నగరమంతా సనసంద్రంగా మారింది.