హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 7వ తెలంగాణ రాష్ట్ర రెగట్టా బుధవారం ప్రారంభమైంది. ఈ టోర్నీకి హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నారాయణపేట, వికారాబాద్ , వరంగల్ ఆరు జిల్లాల నుంచి 59 ఎంట్రీలు వచ్చాయని ఇటీవలే తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దాడీ భోటే ఒక ప్రకటనలో తెలిపారు. సెయిలింగ్‌లో తెలంగాణ ఇప్పుడు పవర్ హౌస్‌గా ఉందన్నారు. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈ ఏడాది నగరంలోని పలువురు ఉత్సాహవంతులైన యువకులను కొత్త సెయిలర్స్‌గా తయారు చేసిందన్నారు. నగరానికి చెందిన ప్రీతి కొంగర ఆసియా క్రీడల్లో పాల్గొనడం రాష్ట్ర క్రీడా రంగానికి నూతనోత్తేజాన్ని అందించిందన్నారు. ఈ టోర్నీ ఫలితాలతో జనవరిలో ముంబైలో జరిగే నేషనల్స్‌లో రాష్ట్రం పోటీ పడే సెయిలర్లను ఎంపిక చేస్తారని ప్రధాన కోచ్, ఆతిథ్య యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు సుహేమ్ షేక్ తెలిపారు. తెలంగాణ స్టేట్ రెగట్టాలో జూనియర్, సబ్ జూనియర్ కేటగిరీలలో 3 ఫ్లీట్లలో పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రానికి చెందిన దేశంలోని పలువురు అగ్రశ్రేణి సెయిలర్స్ ఇందులో పాల్గొంటారని తెలిపారు.