అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలా
ఆదానీ అవినీతి గురించి ఎందుకు మాట్లాడరు
తెలంగాణ అభివృద్ది సాధిస్తేనే కదా…అవార్డులు
ఇంటికి సున్నం వేసి నాదే అన్న తీరుగా ఉంది మోదీ వ్యవహార శైలి
వి•డియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు
మోదీ విమర్శలపై మండిపడ్డ బిఆర్‌ఎస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8 : మోదీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాత్రమే మాట్లాడారని, తెలంగాణపై ఆయనకు ప్రేమలేదని, ఇందుకు గతంలో రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని, వందే భారత్ రైళ్లను మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని మోదీ అన్నారని, కేంద్రం ఏమిచ్చిందని అడ్డుకోవడానికని రాష్ట్ర మంత్రులు నిలదీశారు. శనివారం ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో చేసిన విమర్శలను అధికార బిఆర్‌ఎస్ తిప్పికొట్టింది. ఘాటుగా విమర్శలు చేసింది. కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో వి•డియా సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ..అవినీతి గురించి మోదీ మాట్లాడుతున్నారని.. అదానీ అవినీతి సంగతేంటని ప్రశ్నించారు. శ్రీలంకలో అదానీకి వొచ్చిన కాంట్రాక్టు ఎవరి ద్వారా వొచ్చింది ? అదానీ మోసాలపై జేపీసీ వేయమంటే ఎందుకు వేయరన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి మోదీ నాతో చర్చకు వొస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి సాధించకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తుందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అవునో కాదో ..? మోదీయే చెప్పాలన్నారు.
24 గంటల కరెంట్ రాష్ట్రంలో ఉందో లేదో మోదీ చెప్పాలన్నారు. రెండుకోట్ల ఉద్యోగాల సంగతిపై మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో లక్షా35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అవినీతి కుటుంబ పాలన గురించి మాట్లాడే హక్కు మోదీకి ఉందా? అని నిలదీశారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు లేవా? బీజేపీ సీఎంలు అవినీతిలో కూరుకుపోతే విచారణలు ఎందుకు ఉండవన్నారు. దేంట్లో తెలంగాణ వెనకబడిందో మోదీ చెప్పాలన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెలంగాణకు ఇచ్చారా ..? జాతీయ రహదారులు ఎవరున్నా వొస్తాయన్నారు. అందులో మోదీ గొప్ప ఏముందన్నారు. దేశానికి తెలంగాణ సమకూరుస్తున్న ఆదాయం ఎంత? కేంద్రం నుంచి ఇచ్చింది ఎంత ..? కొరోనాకు టీకా కూడా తానే కనిపెట్టాను అన్నట్టుగా మోదీ మాట్లాడుతారని, ప్రోటోకాల్ ఉల్లంఘనకు తెరలేపింది మోదీయేనన్నారు. గతంలో మోదీ రాష్ట్రానికి వొచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ను రావొద్దన్నారని, విభజన చట్టం హావి•లపై మోదీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి కాదు.. కనీసం సికింద్రాబాద్‌కు ఏమైనా చేశారా అని నిలదీశారు. మోదీ బాధ్యతా రహిత్యంగా మాట్లాడరని, ఆయన మాట్లాడిన మాటలపై చర్చకు సిద్ధమన్నారు. ఎవరి వాదనలో బలమెంతో చూసుకుందామంటూ సవాల్ విసిరారు. మోదీ మమ్మల్ని తిట్టాలనుకుంటే దిల్లీలో ఉండి తిట్టుకోవచ్చని.. దానికి హైదరాబాద్ రావాలా? అని ప్రశ్నించారు.
మమ్మల్ని తిడితే ప్రజలే తిరగబడతారని, ప్రధాని వొస్తే సీఎంలు స్వాగతం పలకాలని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. ప్రధానికి రాష్ట్రానికి వొచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయిండని మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ విమర్శించారు. గతంలో కేసీఆర్ పాలనను ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోదీకి ఏవి• చేత కాదన్నారు. అదానీ కోసమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కన బెట్టారని, బీజేపీ గతంలో కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. ఏ అంశంలోనైనా తెలంగాణతో ఇతర రాష్టాల్రు పోటీ పడతాయా? అని ప్రశ్నించారు. దేంట్లోనైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందున్నాయా ? అని నిలదీశారు. మోదీ సీబీఐని గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనలేదా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతిపక్షాల తీరును తప్పుబట్టడం సమంజసమా..? కాళేశ్వరానికి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. జాతీయ రహదారులు తెలంగాణ హక్కు అన్నారు. సున్నం వేసి ఇల్లు నాదే అన్నట్టుగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ప్రాజెక్టులు చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయన్నారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారన్నారు. తెలంగాణ వి•ద మోదీ కక్ష మరోసారి బయటపడిందన్నారు.
కేసీఆర్‌ది కుటుంబ పాలన కాదని, తెలంగాణ అంతా కేసీఆర్ కుటుంబమేనని, మోదీది ఆదానీ కుటుంబమని విమర్శించారు. మోదీ నిధులు ఇవ్వకున్నా ఫర్వాలేదని, మమ్మల్ని బద్నాం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రధాని మోదీ పర్యటనలో అన్ని వర్గాలను నిరాశ పరిచారన్నారు. యాసంగి పంట కొనుగోలుపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా రైతులను నిరాశ పరిచారని, రేషన్ కార్డుల సంఖ్యను మోదీ పెంచుతారనుకుంటే అది కూడా చేయలేదని గంగుల కమలాకర్ అన్నారు. రేషన్ బియ్యంపై ప్రధాని పదవిలో ఉండి అబద్ధాలు ఆడడం దురదృష్టకరమన్నారు. రేషన్ బియ్యం పేదలకు ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారని, కుటుంబానికి బియ్యం కోటా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్రం కాదన్నారు. రేషన్ బియ్యంపై రూ.27వేలకోట్లు ఖర్చు చేశామన్నారు. గురుకులాల గురించి మోదీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వ్యవసాయం, పీడీఎస్ గురించి మాట్లాడే అర్హత మోదీకి లేదన్నారు. వెనకబడిన వర్గాలకు మోదీ చేసింది శూన్యమన్నారు. వెనకబడిన వర్గాలకు విద్యను అందించింది కేసీఆరేనన్నారు. అవినీతి బీజేపీ సీఎంలపై సీబీఐ విచారణ ఎందుకు జరిపారన్నారు. మోదీ తెలంగాణకు ప్రాజెక్టులు ఇస్తారంటే ఎందుకు వద్దంటామన్నాని మంత్రులు ప్రశ్నించారు.