హైదరాబాద్, ప్రజాంత్ర, జూన్ 14 : రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. సోమవారం మహబూబ్నగర్ జిల్లాలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు, ఆ తర్వాతి రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించింది. హైదరాబాద్లో కూడా సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులు మొదలై చిరుజల్లులు పడ్డాయి. ఈ సారి రుతుపవనాలు ఐదు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఈ నెల 8నే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ నాలుగు రోజులు ఆలస్యంగా సోమవారం రాష్ట్రంలో ప్రవేశించాయి.
కిందటేడు జూన్ 5నే రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. ఈసారి జూన్ 2న కేరళకు వస్తాయని అంచనా వేయగా, మూడు రోజులు ముందుగానే మే 29న కేరళలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈసారి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం సాధారణం (106శాతానికి పైనే) కంటే ఎక్కువగా నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయంది. ఈ మేరకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.