తెలంగాణ పైన ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడలేని ప్రేమ పుట్టుకువచ్చింది. తెలంగాణ ప్రజలపైన ఈగ కూడా వాలనిచ్చేదిలేదనీ ..వారిని తిడితే ఊరుకునేదిలేదని ఆయన చేసిన హెచ్చరికలో ఏదో కొత్తదనం కనిపించింది. తెలంగాణపైన మోదీ వ్యతిరేక భావనతో ఉన్నా డంటూ ఇంతవరకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తన ప్రసంగాల్లో తిప్పికొట్టిన విధానం కేవలం తెలంగాణ ప్రజలనేకాదు, కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి తెలిసిన వారినందరినీ ఆశ్చర్యపర్చింది. దేశంలోని బిజెపియేతర రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదంటూ చాలాకాలంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు మోదీ తీరుపై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమనే స్థితిలో మాటల యుద్ధం సాగుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, విభజన ఒప్పందాలను అమలు పర్చే విషయంలో కేంద్రం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎత్తి చూపుతోంది.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధుల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదంటూ తెలంగాణ ప్రభుత్వం నెత్తిననోరు పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. దానికి తగినట్లుగా తెలంగాణపై ఆధిపత్యం కోసం ఇటీవల ఉప ఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీలు పోటీపడిన విధానం, ఎంఎల్ఏలను కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బిజెపీ చేసిన ప్రయత్నాలంటూ నగ్న సాక్షాలను టిఆర్ఎస్ చూపించే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మోదీ తెలంగాణలో పర్యటించడం ప్రత్యేకతను చాటుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల ప్రయాణం పెట్టుకున్న మోదీ, శనివారం తెలంగాణలో వరుసగా రెండు సభల్లో మాట్లాడారు. ఈ రెండు సభల్లో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ పేరునుగాని, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పేరెత్తకుండానే విమర్శనాస్త్రాలను సంధించారు. కేవలం విమర్శలేకాదు, వ్యంగ్య వచనాలు, ఛలోక్తులు విసురుతూ తెలంగాణ అంటే తనకు ఎంత అభిమానమో.. అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు.
ఎన్నో ఆశలతో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నదంటూ ఆయన తెగ బాధపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసేవారినెవరినీ వదిలిపెట్టేదేలేదని ఆయన భీష్మ ప్రతిజ్ఞకూడా చేశారు. ‘‘పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్- ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’’ అన్నట్లు ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో అక్కడ బిజెపి ముందుంటుందని, అక్కడ కమలం వికసిస్తుందంటూ ఆయన చేసిన ప్రసంగం తెలంగాణలో కమల వికాసం తప్పదని చెప్పకనే చెప్పుకొచ్చారు. తెలంగాణ పేరు చెప్పి పార్టీ పెట్టినవాళ్ళు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. అందుకే ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారు. ఇక్కడ జరిగిన ప్రతీ ఉప ఎన్నికలో బిజెపికి తమ మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ ఆదరణ అన్నది 1984నుండి సాగుతున్నది. ఆనాడు దేశంలో కేవలం రెండు స్థానాలనే బిజెపి గెలుచుకుంది. అందులో ఒకటి తెలంగాణలోని హనుమకొండ కావటం విశేషమంటూ, అదే స్పూర్తితో దేశప్రజలిప్పుడు మూడు వందలకు పైగా స్థానాలనిచ్చి తాము బిజెపి వెన్నంటి ఉన్నామని చెప్పారంటూ, తెలంగాణ తమకు ఎంత ప్రాధాన్యమైనదన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఇక్కడ కుటుంబ పాలన సాగుతున్నదని, ప్రజలను ఆ కుటుంబ పాలననుండి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందని, అలాగే అవినీతిపరులంతా ఒకటవుతున్న ప్రస్తుత పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందంటూ ఆయన ప్రజలకు విపులంగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో తానూ ఒక ప్రధాన కార్యకర్తగా పనిచేస్తున్నానని, అందుకు తనను ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని, ఈ తిట్లు తనకు ఇరవై అయిదు సంవత్సరాలుగా అలవాటైపోయాయని, అవి తనను ఏమీ చేయలేవని, పైగా పుష్టినిస్తున్నాయని హాస్యోక్తంగా మాట్లాడి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారాయన. తెలంగాణకు ఏనాడు తాము అన్యాయం చేయలేదని చెప్పే క్రమంలో ఆయన రాక సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను వివరించే ప్రయత్నం చేశారు. ఈ ఒక్క రోజున్నే పదివేల కోట్ల అభివృద్ధి పనులకు ఇక్కడ శ్రీకారం చుట్టామన్నారు. రైల్వే లైన్లు, రోడ్ల విస్తరణ తదితర అంశాలకు ఈ నిధులు వెచ్చిస్తున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రధానంగా రైతు పక్షపాతిగా తమ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడానికి ప్రయత్నిస్తూ దేశవ్యాప్తంగా రైతులకోసం ఇప్పటికే పది లక్షల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని, త్వరలో మరో రెండు లక్షల కోట్లను వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు. అలాగే సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్రంపైన వస్తున్న విమర్శనలను కొట్టిపారేశారు. అయితే బొగ్గుగనుల విషయంలో గతంలో అవినీతి జరిగిందని, అందుకే పారదర్శకంగా వాటిని నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పిన మోదీ వాస్తవంగా తెలంగాణకు రావాల్సిన నిధులను, హామీ ఇచ్చిన పథకాలను కాని స్పృశించిందిలేదు.