తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం

హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్
ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం
ఫోరమ్​ చీఫ్​ బొర్గె బ్రెండే, సీఎం రేవంత్​రెడ్డి సంయుక్త ప్రకటన
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్​లో  ప్రారంభించేందుకు  ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. దీంతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్​రెడ్డి  సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది.  స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపింది. అనంతరం సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలంగాణకు విశిష్ట సహకారం అందించింది.
‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి. అందుకే రెండింటి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరింది. జీవన విధానాలు, జీవన నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టుబడి ఉన్నాం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు..’ అని సీఎం రేవంత్​రెడ్డి  అన్నారు. ‘ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరికొత్తగా పునర్నిర్వించే ఆలోచనలున్నాయి.  చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page