ఏర్పాట్లను పరిశీలించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్ జోడోయాత్ర ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం వద్ద ఉన్న బ్రిడ్జ్ నుండి రాహుల్‌గాంధీ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శనివారం పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి యాత్ర ప్రారంభ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. రాహుల్ గాంధీ యాత్ర ఇవాళ ఉదయం మక్తల్ నియోజకవర్గంలోని, కృష్ణ మండలం థైరోడ్ వద్ద ఉన్న కృష్ణానది బ్రిడ్జి పైనుంచి 8 గంటలకు తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే శనివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, స్వయంగా హాజరై టైరోడ్ వద్ద ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు లక్ష మందితో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేశారు. తెలంగాణలోకి ప్రవేశించిన కృష్ణ బ్రిడ్జి వద్ద యాత్ర విశేషాలు తెలిపే పైలాన్ ఆవిష్కరణలతో పాటు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించిన తర్వాత ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో అక్కడ ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అనంతరం బ్రేక్‌ఫా•స్ట్ చేసుకొని 11 గంటలకు రాహుల్ గాంధీ హెలికాప్టర్ ద్వారా దిల్లీకి బయలుదేరనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని 24, 25, 26, తేదీల్లో దిల్లీలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. తిరిగి 27వ తారీకు ఉదయం ఏడు గంటలకు మక్తల్ పట్టణ శివారులోని సబ్ స్టేషన్ నుంచి తిరిగి జోడో యాత్ర ప్రారంభించనున్నారు. మక్తల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం బొందలకుంట గ్రామం గేట్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో భోజనం చేయడంతో పాటు అక్కడే వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటారు. ఆ తర్వాత మరికెల్ మండలం సమీపంలోని పసుపల గేటు వద్ద రాత్రి బస ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభమై దేవరకద్ర నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.