- పంట నష్టపోయిన పసుపు రైతులకు ప్రతిపాదనలు రాష్ట్రం పంపితే పరిశీలిస్తాం
- రాష్ట్ర నేతలతో భేటీలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్
- రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బండి సంజయ్ ఫైర్
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 21 : ఫసల్ బీమా అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం అందించే విషయంలో కెసిఆర్ ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాకు తెలిపారు. కేంద్రం రా రైస్ పక్కా కొంటాం అన్నదని…. రైతులను ఆదుకోవడం తమ బాధ్యత అన్నదని, తెలంగాణ ప్రభుత్వమే కేంద్రంతో సహకరించడం లేదని బండి ఆరోపించారు. దేశమంతా ప్రొక్యూర్ మెంట్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయం..? పార్లమెంట్ సాక్షిగా గతంలోనే ఈ విషయాలన్నింటిపై సమాధానం చెప్పిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మళ్ళీ మరోసారి తమకు స్పష్టంగా చెప్పారని సంజయ్ అన్నారు. రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ కేంద్రాన్ని బదనాం చేసే కుట్రకు తెరలేపారని బండి సంజయ్ మండి పడ్డారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్ఫష్టత ఇచ్చారని యాసంగి సీజన్‌లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని చెప్పారని బండి సంజయ్ ప్రకటించారు. ‘‘రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ మాతో చెప్పారు. దురద్రుష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది.’’ అని బండి ఖరాకండిగా చెప్పారు.
సోమవారం రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు, ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తుందంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేస్తున్నదని వారు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ‘‘అసలు రా రైస్ కొనబోమని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతాం? పక్కాగా రా రైస్ కొంటాం. రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం మా కనీస బాధ్యత. అసలు గతంలో ఇస్తానన్న బియ్యం ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనేలేదు. అయినా దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వొస్త్తుంది? పార్లమెంట్ సాక్షిగా గతంలోనే టీఆర్‌ఎస్ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చిన. ఇకపై భవిష్యత్తులో తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతం చేసింది కదా..మళ్లీ వొచ్చిన ఇబ్బంది ఏమిటి?’’ అని ఎదురు ప్రశ్నిచారని బండిసంజయ్ తెలిపారు. సమావేశానంతరం బండి సంజయ్ మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా వున్నా రాజకీయ లబ్ది కోసం కేసీఆర్ ప్రభుత్వం బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. గతంలోనూ ఇదే అంశంపై కేంద్రాన్ని బదనాం చేసేందుకు పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఢిల్లీకి వొచ్చిన రాష్ట్ర మంత్రుల బృందం రకరకాల డ్రామాలాడి భంగ పడ్డారని బండి సంజయ్ అన్నారు. మళ్లీ యాసంగి పేరుతో టీఆర్‌ఎస్ కొత్త డ్రామాలకు తెరదీసిందని విరుచుకుపడ్డారు.
పసుపు రైతులకు పరిహారంపై కేంద్ర మంత్రితో చర్చించిన ధర్మపురి అరవింద్
అకాల వర్షాల కారణంగా గతేడాది పసుపు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించానని చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావులతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించానని ఆయన చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.