తెలంగాణా సుపరిపాలన దినోత్సవంలో సి.ఎస్ శాంతి కుమారి
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్10:తెలంగాణా రాష్ట్రం అవతరణ తొమ్మిదేళ్ల పూర్తి కాలంలో దార్శనికులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో దేశంలో మరే రాష్ట్రం సాధించని రీతిగా తెలంగాణ అభివృద్ధి చెందిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం తెలంగాణా సుపరిపాలన దినోత్సవంగా పాటించారు. ఈ సందర్బంగా ఎంసీఆర్ హెచ్చార్దీ లో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి సి.ఎస్ శాంతి కుమారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డీజీపీ అంజనీ కుమార్, ప్రిన్సిపల్ సిసీఎఫ్ దొబ్రీయల్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ ఓడీ లు, పోలీస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, నీటి పారుదల, వ్యవసాయం, ఐటి, పరిశ్రమలు, విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఆయా రంగాల్లో రికార్డు స్థాయిలో పురోగతి ఉందని వివరించారు. 2014 కు ముందు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండి, వాటర్ ట్యాంక్ లకు కూడా పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలియచేసారు. గతంలో వేసవి కాలం వచ్చిందంటే జిల్లా కలెక్టర్లతో సహా ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్ లు రూపొందించే విధానం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని, దీనికి ప్రధానకారణం సి.ఎం కేసీఆర్ ప్రణాళికలేనని స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒక గొప్ప కార్యక్రమమని, హరితహారంలో నాటిన మొక్కల్లో దాదాపు 90 శాతం మొక్కలు మనుగడ సాధించడం ఒక అద్భుతం అని అన్నారు. రాష్ట్రంలో ప్రసూతి మరణాలలో గణనీయమైన తగ్గుదల సాధించామని, ఇమ్మ్యూనైజషన్ పెరిగిందని, వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు చవిచూశామని సి.ఎస్ తెలియ చేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను 21 రోజులు నిర్వహించేందుకై రూపకల్పన చెయ్యగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని అన్నారు.
తన 34 ఏళ్ల సర్వీసులో తెలంగాణా రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్నా అభివృద్ధి గతంలో చూడలేదని, దీనికి కారణం, ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి అంకిత భావంతో పనిచేయడమేనని అన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు తమ తమ శాఖలు సాధించిన విజయాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలు, మార్పులపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి, వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మ మార్పులపై వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మున్సిపల్ పరిపాలన లో ప్రవేశ పెట్టిన టీ.ఎస్. బీ.పాస్ పై మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, విధ్యుత్ రంగంలో సంస్కరణలపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రాష్ట్రంలో ఆర్థిక రంగ సంస్కరణలపై ఆర్థిక, ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, విద్య రంగంలో మార్పులపై విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్య, ధరణిలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఐటి, పరిశ్రమల అభివృద్ధిపై ఐటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ లు పవర్ పాయింట్ ద్వారా వివరించారు.