గత తొమ్మిదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మెగా షోతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ ఉపయోగించుకుంది…. వ్యవసాయ రంగంలో పుష్కలంగా నీరు పరవళ్ళు తొక్కుతున్నాయి. వేసవిలో తెలంగాణలో చెరువులు మత్తళ్లు దూకుతు, చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందించింది. తెలంగాణ మాగాణంగా మారిపోయింది. జలవిజయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కీలక భూమిక పోషించింది. అతి తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తి ఫలాలు తెలంగాణ అంతటికీ అందించటం మరో విశేషం. ఈ రోజు అత్యధికంగా గరిష్ఠంగా 400 టీఎంసీలకు పైగా జలాలు వినియోగించుకునే స్థాయికి ఎదిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారి కాకతీయ కాల్వ చివరి భూముల వరకు గోదావరి నీళ్ళు అందుతున్నాయి.
కృష్ణా నదిపై ప్రాజెక్టులు సైతం ప్రాధాన్యత క్రమంలో పూర్తవుతున్నాయి. పాలమూరు జిల్లాలో 4 ప్రాజెక్టులు రావడంతో 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. కోయిల్‌సాగర్ ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.85 లక్షల ఎకరాలకు ప్రాణం వచ్చింది. రాజీవ్ భీమా ద్వారా 2.03 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. గదచిన తొమ్మిదేళ్ళలో లో ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.1.69 లక్షల కోట్లు వెచ్చించింది. తెలంగాణలో తొమ్మిదేళ్ళలో పెరిగిన సాగు విస్తీర్ణం 117 శాతం. సగటుభూగర్భ జల మట్టం 4.14 మీటర్లు పెరిగింది. గడచిన ఏడేళ్లలో కల్వకుర్తి, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మిడ్ మానేర్, సింగూరు కెనాల్స్, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెంవాగు, కుమ్రంభీం మత్తడి వాగు, నీల్వాయి, జగన్నాథపూర్ పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తు, ప్రాజెక్టు నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్, మొబైల్ యాప్‌లను రూపొందించింది. పంప్ హౌజ్‌లు, జలాశయాలు, కాలువలు, చెరువులు, వర్షపాతం వివరాలు, నదుల ఇన్ ఫ్లో, భూగర్భ జలాల పరిస్థితి, తదితర సమాచారం ఒకే చోట లభ్యమవుతుంది. జలాశయాలు, చెరువుల్లో నీరు ఎంత ఉంది? ఎంత ఖాలీ అనే సమాచారం సులువుగా తెలుసుకోవచ్చు. గతంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిన తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోందని, తెలంగాణలో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అడుగులేస్తోంది..
తాగునీటి సరఫరా…
ప్రభుత్వ మిషన్ భగీరథలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామీణగృహాలకు కుళాయిలు ఏర్పాటు చేసి నూరు శాతం మంచినీటి పంపిణీ సాధించిన పెద్ద రాష్ట్రం తెలంగాణ అని గుర్తింపు పొందింది. తలసరి రోజుకు 100 లీటర్ల మంచి నీటిని రాష్ట్రంలో 57.01 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రధాని 2014 అక్టొబర్ 2న, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు, పాఠశాల – అంగన్వాడీ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి 100% గ్రామీణ పారిశుధ్యం సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పాల్గొంటోంది. గత ఐదేళ్లలో 31.56 లక్షల మరుగుదొడ్ల నిరంఆణం పూర్తి చేసి రాష్ట్రం ప్రశంశలు అందుకుంది.
సంక్షేమం
మహిళలు, పిల్లలు, వృద్ధులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు (దివ్యాంగులు), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరిచే పథకం కింద ప్రతి లబ్ధిదారునికి రూ.10 లక్షలు మంజూరు చేస్తారు. 2022-23 సంవత్సరానికి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 1,500 మంది లబ్ధిదారుల లక్ష్యంతో రూ.17,700 కోట్లు కేటాయించారు. దళిత కుటుంబంలో ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే దళిత రక్షణ నిధి ద్వారా లబ్ధిదారు కుటుంబాన్ని రక్షించడానికి ఖర్చు చేస్తారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, హెచ్‌ఐవి/ఏయిడ్స్ తో బాధపడుతున్న వ్యక్తులు, బోదకాలు రోగులు, పనిచేయలేని చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులు సహా సమాజంలోని అనేక వర్గాలను రక్షించడానికి ‘ఆసరా’ పెన్షన్ పథకాన్ని నవంబర్ 2014 లో ప్రారంభించారు.
మిలియన్ మార్చ్..
ఉవ్వెత్తున సాగుతున్న తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు లక్షల గొంతుకలు ఒక్కటై నినదించిన రోజు. లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ జనంతో ట్యాంక్ బండ్ .. జనసంద్రాన్ని తలపించింది. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా.. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు. ఓ కెరటంలా ఎగిసి పడ్డ ఈ కార్యక్రమం ఉద్యమకారులకు, ప్రజలకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో 2011 మార్చి 10 న ప్రజలందరు కలిసి అద్భుతంగా విజయవంతం చేసిన కార్యక్రమం మిలియన్ మార్చ్., దేశ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ సమాజాన్ని ఒక్క వేదిక మీదికి తెచ్చిన రోజు. దశాబ్దాల ఆవేశం, ఆక్రోశం కలగలిపిన ఉద్యమం. ఉద్యమ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. అదే మిలియన్ మార్చ్. ఉద్యమం మలిదశ భాగంగా చేపట్టిన కార్యక్రమానికి పుష్కరం పూర్తయింది. అదొక అపురూప ఘట్టం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, ఉద్యోగ, విద్యా సంఘాలతో పాటు కవులు, రచయితలు, కళాకారులు స్వచ్ఛందంగా పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను చాటిచెప్పారు. ఉద్యమకారులకు, మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. ప్రజల నుంచి మిలియన్ మార్చ్ ప్రచారానికి అపూర్వ స్పందన రావడంతో టీఆర్‌ఎస్ తో పాటు అన్ని రాజకీయ పక్షాలు కలసికట్టుగా కదిలాయి. మిలియన్ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం హైదరాబాద్ నగరమంతా పారామిలిటరీ బలగాలను మోహరించడంతో పాటు, జిల్లాల సరిహద్దుల్లో బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేసినా ముందస్తు వ్యూహంతో తెలంగాణవాదులు ఊహించిన దానికంటే ఎక్కువగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. మొత్తం తెలంగాణలో సుమారు 50 వేలమందిని ముందస్తుగా అదుపులోకి తీసుకోగా, హైదరాబాదులో 10,000 మందిని అరెస్టు చేశారు. వరదలా దూసుకొచ్చిన ఉద్యమకారుల నినాదాలతో నగరం ప్రతిధ్వనించింది. కేసీఆర్ సాయంత్రం ట్యాంక్ బండ్ కు చేరుకుని మార్చ్ కి హాజరైన వారినుద్దేశించి ప్రసంగించారు.
క్రమంలో పరిస్థితి అదుపు తప్పిందిౌ విధ్వంస సంఘటనలు చోటు చేసుకున్నాయి. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు సాక్షాలు లభించలేదు. విగ్రహాల విధ్వంసం తర్వాత ట్యాంక్ బండ్ మీద కొమరం భీం లాంటి విగ్రహలు అక్కడ కొత్తగా చేరాయి. టీజేఏసీ తర్వాత చేపట్టిన సాగరహారానికి నాటి మార్చ్ స్ఫూర్తిగా నిలిచింది.
ఆ ఉత్సాహం, ఉద్వేగం మాయమై…
నిర్వేదం, నిరుత్సాహం.
ఆచరణలో కనిపించని పేరుకు బంగారు తెలంగాణ. ఏదీ ఈనాడు ప్రజల్లో ఆ ఉత్సాహం, ఉద్వేగం, పట్టుదల. తెలంగాణ కోస అర్రులుచాచి, దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొంటూ,, కొందరైతే జీవితాలనే త్యాగం చేసారు. వారిని, వారి కుటుంబాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎన్నికలప్పుడు మినహా, ఏనాడైనా ప్రజలలో తిరుగుతున్నారా, కష్ట నష్టాలు తెలుసుకుంటున్నారా? నాయకుల దర్శనమే ప్రజలకు అపురూపం. దీర్ఘకాలం సచివాలయం లేదు, వందల కోట్లఖర్చుతో వచ్చిన నూతన సచివాలయంలోకి ప్రతిపక్షాలకు, పాత్రికేయులకే ప్రవేశం నిషిద్ధం, సామాన్య ప్రజల ఘోష పట్టించుకునేదెవరు. ఇక ప్రజా భవన్ సంగతి సరే సరి. అదో దుర్భేద్యమైన కోట. ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఉంటారో, ఎర్రవల్లి ఫాం హౌజ్ లో ఉంటారో, దిల్లీలో ఉంటారో సామాన్యులకేమి ఎరుక. భవంతులకు శంకుస్థాపనలు, ప్రారంభాలు, నీటి ప్రాజెక్టులు, ఆలయల నిర్మాణాల పర్యవేక్షణ, యాగాది క్రతువుల నిర్వహణ పేరిట గాలి గుమ్మటాల్లో ప్రయాణాలు. పటిష్ట పోలీసు భద్రత మధ్య వచ్చిపోవడాలు. ఏనాడైనా సామాన్యులకు ఎమ్మెల్యేలే అందుబాటులో ఉండరు. ఎవరి పనులు వారివి. కాంట్రాక్టులలో తలమునకలు. ముఖ్య మంత్రి ఎప్పుడైనా ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలు వింటున్నారా? ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు అందుకుని పరిష్కరించి వారికి ధైర్యమిస్తున్నారా.. పత్రికా ప్రకటనలు, ముఖ్యమంత్రి, మంత్రుల దిల్లీ సందర్శనలు, కార్పొరేట్ విదేశీ ప్రముఖులతో ముచ్చట్లు, పర్యటనలతో కాలం సరిపుచ్చుతున్నారు. పేదలకు వైద్యం అందుబాటులో లేక కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడికి గురవుతున్నారు. తరచూ అగ్నిప్రమాదాలు, వర్షాలకు కట్టుకుపోతున్న జీవాలు, విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు, దారుణ హత్యలు, మాన భంగాలు, ఆర్థిక దుస్థికి తాట్టుకోలేక అప్పులు, ఋణ యాప్ ల పీడితుల బలవన్మరణాలు, రోడ్డు ప్రమాదాలలో మృతులు. అవినీతి, లంచగొండి తనం, మద్య ప్రవాహం.. ఇవన్నీ అధికార పార్టీని చుట్టుముట్టి ఉన్న సమస్యలు.
అభియోగాల పరంపర, కేసుల ఉచ్చులు
ప్రభుత్వాధికారులే కాదు అధికార పార్టీలో ఆంతరంగికులు, బంధుగణం, బాధ్యతాయుత వ్యక్తులపై కూడా అనేక కుంభకోణాల అరోపణలు, కేసులున్నాయి. దిల్లీ లిక్కర్ కేసు, న్యాయస్థానాల చుట్టు తిరగడం, ప్రత్యర్థులపై రాజకీయ ఎత్తుగడలతో డబ్బు ఎరచూపడం, రహస్య కెమేరాలు పెట్టి భారతీయ జనతా పార్టీ నేతలను ఉచ్చులో ఇరికించే ప్రయత్నంలో కేసులు పెట్టడం, ప్రచారం ఇవ్వడం.. రాజీపడే ధోరణిలో అంతలో వాటిని తెర చాటుకు పంపడం, భారాసను నైతికంగా దెబ్బతీసాయని సర్వత్రా అభిప్రాయం ఉంది. ఉద్యోగ నియామకాల్లో భారీ అవినీతిలో కూరుకుపోయిన టిఎస్ పిఎస్‌సి పై పెదవి విప్పక పోవడం, పోలీసు శాఖ సహా ఉద్యోగ నియామకాలు ఆగిపోవడం కోర్టు కేసుల్లో మొట్టికాయలు..డబుల్ బెడ్ రూం, ఇళ్ళ స్థలాల కేటాయింపు నత్తనడక… రాజకీయపార్టీల నుంచి గోడ దూకుళ్ళు ప్రోత్సహించడం.. ఒకటా, రెండా?
ఇలా ఎన్నెన్నో అభియోగాలు ఎదుర్కోంటూ తెలంగాణలో ప్రభుత్వం మూడో పర్యాయం ఎన్నికలకు సిద్ధమవుతున్నది. పరిస్థితి నల్లేరుపై బండి నడక కాదని, ముళ్ళబాట అని, పలువురు భారాస నాయకులు అసంతృప్తితో ఇతర పార్టీల్లో చేరడం నాయకులు నాయకుల సుడిగాలి పర్యటనలలో ఉక్కిరిబిక్కిరవుతూన్న తీరు,ప్రసంగాల తీరు చెప్పకనే చెబుతున్నాయని పరీశీకుల అభిప్రాయం. సరిగ్గా ఎనిమిదిరోజులే మిగిలి ఉంది. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకం గా తీసుకుని అధికారం హస్తగతం చేసే పనిలో నిమగ్నమై ఉండగా, నిన్నటి వరకూ మిత్రులైన భాజపా అగ్ర నాయకత్వం కూడా ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా ఎదురు దాడిని ఉధృతం చేసి పాలక పార్టీకి ఊపిరి సలపకుండా చేస్తున్నాయి.
-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్, 98481 28215