త్వరలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ..

నైజమును విరోచితంగా ఎదిరించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ పది సంవత్సరాలలో నిరాశ, నిస్ప్రహా, ఒక రకమైన స్తబ్దత, బద్దకానికి గురైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్వరాష్ట్రం సిద్ధిస్తే లభిస్తాయి అనుకున్న నీళ్లు నిధులు నియామకాలలో ఏ ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాము. నిరుద్యోగులు కాక వికలాయిపోతున్నారు. దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఒకవైట్‌ ఎలిఫెంట్‌ గా మిగిలిపోయింది. ఒక్క ఎకరా ఆయకట్టు కూడా పెరిగింది లేదు. పెరిగిపోయిన ఆదాయాన్ని సక్రమంగా ఖర్చు చేసి ఉంటే ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉండేది, దేశంలో అగ్రభాగాన ఉండేది. దుబారా ఖర్చులు పటిష్టంగా ఉన్న పాత సచివాలయం సీఎం క్యాంపు కార్యాలయాలు కూల్చి కొత్తగా కట్టడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆత్మహత్య చేసుకున్న ఒక రైతును కూడా పరామర్శించలేని మన పాలకులు పక్క రాష్టలకు పోయి అక్కడ రైతులకి పరిహారాలు ఇవ్వడం పట్ల తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫామ్‌ హౌస్‌.. లేకపోతే ప్రగతి భవన్‌…మనం చరిత్రలో నియంత గురించి చదువుకున్నాం కానీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. నీళ్లు, గోదారి, పాలు నిన్న మొన్నటి వరకు నియామకాల ఊసే లేదు. నిధులను మెగా, కేవీపీ లాంటి కొందరు ఆంధ్ర బాబులకు కట్టబెట్టి వారి నుండి భారీగా కమీషన్‌ లు దండుకోవడం మామూలు అయిపోయింది.

సంవత్సరాల తరబడి బిల్లులు రాక ఒకవైపు సర్పంచులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, పార్టీ మారిన కొల్లాపూర్‌ ఎమ్మెల్యేకు ఎక్స్లేషన్‌ పేరా బహుమతిగా ఐదు కోట్లు చెల్లించారు. ఎన్నడు లేనంతగా సహజ సంపదలు లూటీ కాబడ్డాయి. ఇసుక మాఫీయా ఆగడాలకు అంతే లేదు. ఏకపక్ష నియంతృత్వ కుటుంబ పాలన ఐదుగురు చేతుల్లోనే పాలన బంధీగా ఉండడం, మంత్రులు డమ్మీగా మిగిలిపోవడం గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఉన్న గౌరవ మర్యాదలు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలకు లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులపై అజమాయిషీ లేదు. ముడుపులు చెల్లించనిదే ఒక్క పని కావడం లేదు. పోలీసు యంత్రాంగం టిఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా మారిపోయారు. ధరణి రైతుల పాలిట శాపంగా మారింది.కబ్జా కాలమ్‌ ఎత్తివేయడం వలన లక్షలాది మంది రైతులు రోడ్డుపాలయ్యారు. అసంఖ్యాకంగా ఉన్న కౌలు రైతుల నోట్లో రైతుబంధు మట్టి కొట్టింది. బడా బాబులకు అది బంగారు బాతు అయింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ వూసే లేదు, నిరుద్యోగ భృతి లేదు, స్పష్టత లేని దళిత బందు, పేలిపోయిన బి సి బంధు. చాలా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేని శాసన సభ. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ప్రజా సంఘాలను, మేధావి వర్గాన్ని కలుపుకొని పోరాటం చేయడంలో ఘోరంగ విఫలమైంది. ఏ రాజకీయ పార్టీలు చేయలేని పనిని ఇవాళ సామాజిక మాధ్యమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నాయి.

అరెస్టులకు భౌతిక దాడులకు బెదిరింపులకు లొంగకుండా ప్రభుత్వ తప్పుడు లోపాభూయిష్ట విధానాలను ధునుమడుతున్నయి. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ చేష్టలు ఉడిగిపోయి చూస్తున్న పరిస్థితుల్లో సోషల్‌ మీడియా ఆ బాధ్యతను భుజస్కంధలపై వేసుకొని తమ పాత్రనుగా విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ప్రొఫెసర్‌ కాసిం, హరగోపాల్‌, కోదండరాం,నాగేశ్వర్లు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులైనటువంటి జయప్రకాష్‌ నారాయణ ,ఆకునూరు మురళి లాంటి వారి విశ్లేషణలు, భక్క జడ్సన్‌ లాంటి పలువురు ప్రముఖ న్యాయవాదులు అసంతృప్త రాజకీయ నాయకులు, మేధావులు, హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, బీఎస్పీ పార్టీ రాష్ట అధ్యక్షులు రిటైర్డ్‌ ఐ పి ఎస్‌ అధికారి డా. ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చాల సమర్ధ వంతంగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. ఆలస్యంగా కళ్ళు తెరిచిన కాంగ్రెస్‌ ఆంధ్రలో అధికారం పోతుంది, నష్టం జరుగుతుందని తెలిసి కూడా, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినా ఆ ఘనతను చెప్పుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఆ పనికి పూనుకుంటున్నది. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరో పార్టీలో కనిపించదు.

ఇప్పటికైనా ఈ పార్టీ ఈ అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే విజయం నల్లేరు మీద నడకే.. లేకపోతే 2014 -2018 సాధారణ ఎన్నికల్లో పన్నిన వ్యూహాన్ని టిఆర్‌ఎస్‌ ఈసారి కూడా పన్నుతుంది. ఏ వలస ఆంధ్రులను వద్దనుకున్నామో వారితోనే లోపయికారి ఒప్పందాలను చేసుకొని రాష్ట్ర ఖజానా లూటీ చేసి ఎదురు దాడికి దిగడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ దాన్ని ధీటుగా తిప్పి కొడుతుందా లేధా చూడాల్సిందే. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర, కర్ణాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్కు ఆక్సిజన్‌ అందించాయి. ఈ పరిణామల మూలంగానే బి ఆర్‌ ఎస్‌, బి జె పి గ్రాఫ్‌ పడిపోయి కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఉపూ.. ఉత్సాహంతో విజృంభించిన బీజేపీ బండి సంజయ్‌ ని మార్చడం తో డీలా పడిపోయింది. ఇవి అన్నీ కూడా కాంగ్రెస్‌ పార్టీ కి కలిసొస్తున్న అంశాలు. ఇవ్వాళ హైదరాబాద్‌ పరిసరాల్లో భారీగా విజయబేరి సభను నిర్వహించి అధికార పార్టీ కి సవాల్‌ విసరనుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నా ఈ పరిస్తితిల్లో కాంగ్రెస్‌ ప్రజాకర్షక ఎన్నికల మానిఫెస్టో ప్రత్యమ్నాయ రాజకీయాలను కోరుకునే ప్రజా సంఘాలు, మేధావుల మద్దతు కాంగ్రెస్‌ పార్టీ కి కలిసొచ్చే అంశాలు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు కోరిన బి ఆర్‌ ఎస్‌ పార్టీ ఇప్పుడు వారిని ఏకాకిగా చేసింది. మొతం మీద వొచ్చే ఎన్నికలు తెలంగాణ లో అనూహ్య మార్పులకు దోహదం చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
– పబ్బు శ్రీనివాస్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page