బ్యాంకాక్, ఆగస్ట్ 5 : థాయ్‌లాండ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణాన 150 దూరంలో ఉన్న సట్టహిప్ జిల్లాలోని మౌంటెన్ బీ నైట్‌స్పాట్ నైట్‌క్లబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్ మొత్తానికి మంటలు విస్తరించడంతో 13 మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడుగంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే అప్పటికే నైట్‌క్లబ్ మొత్తం కాలిపోయింది. కాగా, అగ్నిమాపక శాఖ విడుదల చేసిన వీడియోలో నైట్‌క్లబ్ నుంచి కొంత మంది పరుగులు తీస్తూ కనిపించారు. వారికి మంటలు అంటుకోవడంతో తాళలేక అటూఇటూ పరుగెడుతూ ఉన్నారు. అయితే క్లబ్‌లోని గోడలకు ఉన్న రసాయనాల వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, వాటివల్ల మంటలను అదుపుచేయడానికి చాలా సమయం పట్టిందని అధికారులు తెలిపారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామన్నారు. మృతుల్లో నలుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారని వెల్లడించారు.