సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతీ దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడించారు.దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్ జర్నలిస్ట్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, బుధ పూర్ణిమ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లెపల్లి లక్ష్మయ్య, జర్నలిస్టులు బుచ్చన్న, జర్నలిస్టులు జంగం రాజలింగం, జనార్దన్, బబ్బూరి రాజు, ఇతర నాయకులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ…ప్రారంభోత్సవం సభకు రావాల్సి ఉంది. వరదలు కారణంగా రాలేకపోయాం ముగింపు సభకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.వృత్తి ధర్మం, సామాజిక న్యాయం చేసేందుకు కలిగి ఉండాల్సిన బాధ్యత ప్రతీ దళిత జర్నలిస్ట్ పై ఉందన్నారు.
వృత్తితో పాటు సామాజిక బాధ్యత కలిగిన వారు జర్నలిస్టు అని తెలంగాణ వచ్చాక ఎస్సీ గురుకుల పాఠశాలలు రెట్టింపు చేసుకున్నాం. ఇంకా అందులో సీట్లు మిగిలి పోతున్నాయని, జర్నలిస్టులు అవసరం ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పించి వారికి అవకాశాలు కల్పించేలా చొరవ చూపా లన్నారు.దళిత ప్రజానీకానికి అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు సబ్సిడీల పై అవగాహన కల్పించి వారికి చైతన్యం కలిగించాలి. వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపించే బాధ్యత ప్రతీ జర్నలిస్టులకు ఉందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తేవడంలో మల్లెపల్లి లక్ష్మయ్య గారి కృషి ఎంతో ఉందనీ,ప్రతి జర్నలిస్టు బాధ్యతతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరారు. తెలంగాణలో ఎస్సీ కాంట్రాక్టర్లకు ఇరిగేషన్ ప్రాజెక్టులో రిజర్వేషన్ కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచామ న్నారు.అలాగే ఆరోగ్య శాఖలో శానిటేషన్, ఫుడ్ డైట్, ఎక్సైజ్ కాంట్రాక్టులలో ఎస్సీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చాం.
జనాభా ప్రాతిపదికన 16 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేస్తామన్నారు.అన్ని రంగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్ తీసుకొచ్చి సమాజంలో వెనుకబడిన వర్గాలను ముందుకు తేవాలనే లక్ష్యం సీఎం కేసీఆర్ ది అన్నారు. సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దళిత బంధు అందిస్తామనీ,ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యం వల్లే దళిత బంధు సాధ్యమైంది. సమాజంలో ఎక్కువ శాతం పేదవాళ్లు ఉన్న వర్గం వెనుకబడిన వర్గం దళితులు కాబట్టి వారిని సమాజంలో ముందుకు నడిపించి తద్వారా వారిని దేశానికి ఉపయోగపడే సంపదగా తీర్చిదిద్దాలని ముఖ్య లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు.అన్ని వర్గాలను ముందుకు నడిపించే సీఎం కేసీఆర్ గారిని టిఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉంది. ఇలాంటి కార్యక్రమం తెచ్చిన నాయకుడు దేశంలో మరెవ్వరూ లేరనీ,తెలంగాణలో సాధ్యమైన దళిత బంధు దేశంలో ఎందుకు సాధ్యం కాదని వివిధ రాష్ట్రాలలో ప్రజలు ప్రశ్నిస్తున్నారనీ హరీష్ రావు అన్నారు.