- ఆదానీ వ్యవహారంపై జెపిసి ఎందుకు వేయరు
- రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారు
- నిలదీసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
న్యూ దిల్లీ, ఏప్రిల్ 6 : దిల్లీలో విపక్ష ఎంపీలు గురువారం తిరంగా మార్చ్ నిర్వహించారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ బ్జడెట్ సమావేశాలు చివరి రోజుతో పాటు పార్లమెంట్ ముగిసింది. ఉదయం లోక్‌సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత .. విపక్ష ఎంపీలు విజయ్ చౌక్ వరకు ర్యాలీ తీశారు. జాతీయ జెండాలు పట్టుకుని ఎంపీలు అంతా ర్యాలీలో పాల్గొన్నారు. పార్లమెంట్‌ను ప్రభుత్వమే నడపడం లేదని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ అన్నారు. అదానీ స్కామ్ విషయాన్ని ఎందుకు చర్చించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిరంగా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డియాతో మాట్లాడారు. 50 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఎటువంటి చర్చ లేకుండా కేవలం 12 నిమిషాల్లో ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ సజావుగా సాగకూడదన్నదే మోదీ ప్రభుత్వ ధ్యేయమని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతుంది కానీ పాటించదని మండిపడ్డారు.
అదానీ కుంభకోణంపై జెపిసితో దర్యాప్తు చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నుండి దృష్టి మరల్చేందుకు పార్లమెంట్‌కు అంతరాయం కలిగించిందని మండిపడ్డారు. పైగా ప్రతిపక్షాలు సహకరించలేదని ఆరోపిస్తుందని మండిపడ్డారు. అధికార పార్టీ సభ్యులే పార్లమెంటులో గందరగోళం సృష్టించారని, ప్రతిపక్షాలను సభలో మాట్లాడేందుకు అనుమతించలేదని, తన 52 ఏళ్ల ప్రజాజీవితంలో ఎన్నడూ ఇలా జరగలేదని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ముగిసిపోతుందని, నియంతృత్వం వైపు వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో విచారణ చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. దీని వెనుక ఏదో రహస్యం దాగుందని, అందుకే విచారణకు భయపడుతుందని అన్నారు. అదానీ అంశంపై పార్లమెంటులో చర్చను పక్కదారి పట్టించేందుకే రాహుల్ అంశాన్ని తెరపైకీ తీసుకువచ్చిందని మండిపడ్డారు. రాహుల్‌గాంధీపై మెరుపువేగంతో అనర్హత వేటు వేశారని, కానీ బిజెపి ఎంపిని దోషిగా నిర్థారించి, మూడేళ్ల శిక్ష విధించి 16 రోజులైనా ఎందుకు అనర్హత వేటు వేయలేదని నిలదీశారు.