(ఆగస్ట్ 14న ‘‘విభజన విషాద స్మృతి దినం’ సందర్భంగా)
అనాలోచితంగా, అజ్ఞానంగా, వివాదాస్పదంగా, అకారణంగా, విభజించి విచ్ఛిన్నం చేయాలనే దుర్బుద్దితో అఖండ భారతాన్ని ఇండియా, పాకిస్థాన్‌గా అశాస్త్రీయ రాజకీయ విభజన కారణంగా నాటి ప్రజలు పడ్డ బాధలు, విద్వేషాలు, హింసాగ్నిలో లక్షల ప్రజలు నిర్వాసితులు కావడం, మాన ప్రాణాలు కోల్పోవడం హిందుస్థాన్‌లో ఓ మహావిషాదం. మతపరంగా విభజన కోరిన ముస్లిమ్‌లు పాకిస్థాన్ స్వాతంత్య్ర దినాన్ని 14 ఆగస్ట్‌న పాటిస్తున్నారు. శవాల విషాదాల పునాదిగా జరిగిన విభజన దేశ చరిత్రలో ఓ చీకటి రోజు. 1947 ఆగస్ట్ 15 అర్థరాత్రి లభించిన భారత స్వాతంత్య్రానికి సంబరాలు చేసుకోవాలో, విభజన విష వలలో చిక్కిన అమాయక ప్రాణాలను చూసి దుఃఖించాలో తెలియని దుస్థితి నాటి ప్రతి బాధ్యతగల భారతీయ పౌరుడిది.
బ్రిటీష్ పాలకులు వ్యాపార బుద్దితో ప్రవేశించి, దేశ సంస్కృతీ వారసత్వాలను నాశనం చేసి, దేశ సంపదను పీల్చేసి, శవాల దిబ్బలను మిగిల్చి వెళ్ళిన దుర్దినమది. ముఖంపై స్వాతంత్య్రం దక్కిందనే సంతోషం, మదిలో విభజన చేసిన గాయాల బాధల నడుమ దేశం పరాయి పాలన నుండి విముక్తం అయ్యింది. విభజన అకాలంలో జరిగిన హింసాత్మక ఘటనలు, మారణహోమాలు భారతీయులపై చెరగని శాశ్విత మచ్చలుగా మిగిలిపోయాయి. అఖంఢ భారతదేశ విభజన అత్యధిక మానవ వలసలను చవి చూసింది. లక్షల కుటుంబాలు, దాదాపు 2 కోట్ల ప్రజలు తమ తమ వారసత్వంగా వచ్చిన పల్లెలు, పట్టణాలు, నగరాలు, జన్మ భూములను వదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కొత్త జీవితాలను వెతుక్కోవలసిన దుస్థితి వచ్చింది.
దేశ విభజన సమయంలో జరిగిన రక్తపాతం, హింసోన్మాదానికి, అరాచక అకృత్యాలకు బలైన భరతమాత బిడ్డలను స్మరించుకోవాలనే సదభిప్రాయంతో ప్రతి ఏట 14 ఆగస్ట్ న ‘విభజన విషాద స్మృతి దినం (పార్టీషన్ హారర్స్ రిమెంబ్రెన్స్ డే)’ పాటించాలని నిర్ణయించడం సముచితమే కాదు హర్షదాయకం కూడా. 15 ఆగస్టు 1947 స్వాతంత్య్ర సంబరాల వేదికగా మహాత్మాగాంధీ మాట్లాడుతూ ‘రెండు దశాబ్దాల తెల్ల దొంగల దాస్య శృంఖలాలను ఛేదించుకొని, బానిస బతుకులకు చరమగీతం పాడుతూ భారతీయులు స్వేచ్ఛావాయువులు పీల్చాలంటూనే, దేశ విభజనకు అంగీకరించాలి’ అని కోరారు. గత 74 ఏండ్లుగా విభజన గాయాలను మర్చిపోలేనప్పటికీ, సమగ్రాభివృద్ధి దిశగా నడిచే ప్రగతి పయనాలు సాగుతున్నాయి.
భారతదేశం పట్ల కనీస జ్ఞానం లేని బ్రిటీష్ లాయర్ ‘సర్ సిరిల్ రెడ్‌క్లిఫ్’ అఖండ భారత పటంపై గీసిన దేశ సరిహద్దు గీతలు కోట్ల ప్రజల పట్ల పెనుశాపాలుగా మారడంతో పాటుగా, మన గుండెల్ని నేటికి విషాద సంద్రంలో ముంచేస్తూనే ఉన్నాయి. సువిశాల భారత విభజనతో ఇండియా, పాకిస్థాన్ (ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్థాన్)గా ఏర్పడ్డాయి. ముస్లిమ్‌లు అధికంగా ఉన్న పంజాబ్ ప్రాంతాన్ని వెస్ట్ పాకిస్థాన్(నేటి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్)గా, ముస్లిమ్‌లు అధికంగా ఉన్న బెంగాల్ ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్థాన్‌గా (నేటి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్) వేరు చేశారు. ఈస్ట్ పాకిస్థాన్ ప్రజల కోరిక మేరకు 1971లో ఇండో-పాక్ యుద్ధంలో బంగ్లాదేశ్‌ను విముక్తం చేయడంలో కూడా భారత దేశం 2,500-3,843 మంది సైనికుల ప్రాణాలు కోల్పోవడం, 12,000 మంది జవాన్లు గాయాల పాలుకావడం, అపార ఆర్థిక నష్టాన్ని భరించడం చూశాం. 1947లో జరిగిన దేశ విభజన ప్రపంచ చరిత్రలో అతి పెద్ద హింసాత్మక, రక్తం ప్రవహించిన అర్థరహిత రాజకీయ మానవ వలసగా చరిత్రకారులు పేర్కొంటారు. మిలియన్ల మానవ వలసలు, లక్షల మరణాలు, వేల మానభంగాలతో అత్యంత అమానవీయంగా దేశ విభజన మరువలేని విషాదాన్ని మిగిల్చింది. పాకిస్థాన్ ప్రాంత హిందువులు, సిక్కులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారత సరిహద్దుల్లోకి పరుగులు తీయడం, భారత్‌లోని ముస్లిమ్‌లు అధికంగా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకోవడం కూడా విస్మయంతో చూశాం.
నాటి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం ప్రకారం, అశాస్త్రీయ మత రాజకీయాల ఆధారంగా చేసిన దేశ విభజనలో 2 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని, 10 నుంచి 20 మిలియన్ల మానవ వలసలు జరిగాయని అంచనా వేసింది. విభజనతో ప్రాణత్యాగాలు, జీవనోపాధులు కోల్పోయిన భారతీయుల వలసల వల్ల దేశ విద్య, ఆర్థిక స్థితులపై అధిక ప్రభావం పడింది. హిందువుల ఇండ్లను కాల్చి వేయడం, సంపదను దోచుకోవడం, మహిళల్ని రేప్ చేయడం, పిల్లల్ని కసాయి కత్తులను బలి చేయడం, రక్తంతో నిండిన రైళ్లు సవాల దిబ్బల్ని రవాణ చేయడం, ప్రయాణీకులను నిర్దాక్షిణ్యంగా మతవివక్షతో చంపేయడం లాంటి అమానవీయ ఘటనలు చవి చూసింది భారత విభజన విషాదం.
ఐరాస అంచనా ప్రకారం విభజన విషాదంలో 14-20 మిలియన్ల అమాయక హిందువులు, సిక్కులు, ముస్లిమ్‌లు కాలినడకన బిడ్డల్ని సంకన ఎత్తుకొని, మూటముల్లె సర్దుకొని, నెత్తిన పెట్టుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సరిహద్దులు దాటడం అత్యంత అమానవీయ ఘోరంగా చరిత్ర పుటల్లో నిలిచింది. నాడు ప్రతి ఒక్క అమానవీయ విద్రోహి నరరూప రాక్షసుడిగా ప్రవర్తించాడంటూ భయానక దుర్ఘటనలను గుర్తు చేసుకున్నారు నాటి అమాయక భారతీయ పౌరులు. భరతమాత బిడ్డలుగా, దేశభక్తి ఉప్పొంగే పౌరులుగా మనందరం ప్రతి ఏట 14 ఆగస్టు రోజున ‘విభజన విషాద స్మృతి దినం’ పాటించడం మన కనీస కర్తవ్యంగా భావిద్దాం, పరమతసహనాన్ని జీర్ణించుకుందాం, సామరస్యంగా జీవిద్దాం.
జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై విద్వాన్.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 994970003