- జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు
- ధరణి పోర్టల్‌లో మొదటి పేరు కేసీఆర్ దే
- ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు
- మోడీ తన మిత్రులకు, కేసీఆర్ తన బంధువులకు దోచుపెడుతున్నారు
- కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్న కేసీఆర్
- యాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
- భారత్ జోడో యాత్రలో భాగంగా ముత్తంగి కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ
దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్‌ఈఎల్ నుండి ముత్తంగి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. పటాన్‌చెరు సమీపంలోని ముత్తంగి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… నరేంద్ర మోడీ నోట్ల రద్దు, జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరిచారని విరుచుకుపడ్డారు. సామాన్య ప్రజలు వారి బతుకులు భారంగా వెళ్లదీస్తున్నారని, యాత్ర సందర్భంగా యువతతో తాను మాట్లాడినప్పుడు వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నామని చెప్పారు. పెద్ద చదువులు చదివినా సరైన ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని సృష్టిస్తుందని, ప్రజల్ని భయాందోళనలకు గురి చేసి దేశాన్నీ అమ్మేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరి సొత్తు కాదని, అవి దేశ ప్రజల సొత్తు అని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయనీయబోమని భరోసా ఇచ్చారు. ప్రతీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర పట్ల ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారు. 25కి.మీ నడిచినా ఎవరికి అలసట రాలేదని తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు తమకు అలసట అనేది లేకుండా చేస్తున్నాయని అన్నారు. దేశంలో విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించడమే యాత్ర లక్ష్యమని చెప్పారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని సృష్టించి, ప్రజల్ని భయాందోళనకు గురి చేసి దేశాన్నీ అమ్మేసే కుట్ర చేస్తుంది. భారత్ డైనమిక్స్ దేశ రక్షణ కోసం క్షిపణులను తయారు చేస్తుంది.
బీహెచ్‌ఈఎస్, బీజీఎల్ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ఉద్యోగులను భయపెడుతున్నారు. ప్రభుత్వ సంస్థలు భారత దేశ మూలధనం అన్నారు. బీజేపీ ప్రజల ఆస్తులతో వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో యువకులకు చదువుకు తగిన ఉద్యోగాలు లభించడం లేదని అన్నారు. ఇంజనీరింగ్ చదివిన వారు కూలీలుగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లేకుండా చేశారని దుయ్యబట్టారు. నల్లధనాన్ని వెనక్కు తెస్తానన్న మోదీ, నోట్ల రద్దు చేశారని తెలిపారు. జీఎస్టీ పేరుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రోడ్డున పడేశారని, అక్కడ మోదీ చేసిందే ఇక్కడ కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో భూములు ఏమయ్యాయి, ధరణి పోర్టల్‌లో మొదటి స్థానంలో కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి పని చేస్తున్నాయని, దిల్లీలో మోదీకి కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సహకారం ఇచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో భయాన్ని పారద్రోలేందుకే భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు చెప్పారు. కేసీఆర్ కమీషన్ల సొమ్మును తన కుటుంబ సభ్యులకు కట్టబెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,మాజీ మంత్రి గీతా రెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి గాలి అనిల్ కుమార్, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఘన స్వాగతం…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జీ గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో బీహెచ్‌ఈఎల్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. మొదటి రోజు సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి గీతారెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. బీహెచ్‌ఈఎల్ సర్కిల్ వద్ద నుంచి రాహుల్ జోడో యాత్ర రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం వరకు 22 కిలోమీటర్ల మేర కొనసాగింది. రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్ నుంచి పటాన్‌చెరు వరకు నాన్ స్టాప్‌గా నడిచిన రాహుల్ గాంధీ పటాన్‌చెరు పట్టణం లోని ఆనంద్ హోటల్‌లో టీ తాగేందుకు ఆగారు. రామచంద్రాపురం-ఇక్రిశాట్ మధ్య చిన్నారులతో క్రికెట్ ఆడగా రాహుల్ గాంధీ బౌలింగ్ చేశారు. విద్యార్థులు జై జోడో యాత్ర, జై రాహుల్ అంటూ నినాదాలు చేస్తూ పటాన్‌చెరులో రాహుల్ గాంధీకి స్వాగతం పలకగా వారికి అభివాదం చేశారు. పటాన్‌చెరు ఔటర్ రింగు రోడ్డు మీద వాహనాలు ఆపి పై నుంచే రాహుల్ జీ అంటూ నినాదాలు చేశారు. ఓఆర్‌ఆర్ మీద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతు తెలిపారు.