- దేశ సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉంది
- ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధానిమోడీ ట్వీట్
- ప్రధాని మోదీ, అమిత్‌షాలతో ముర్ము భేటీ
న్యూ దిల్లీ ,జూన్23: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన ముందుచూపు ఉందని ట్విటర్‌లో ప్రశంసించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పుష్పగుచ్ఛంతో ఆమెను అమిత్ షా స్వాగతించారు. బీజేపీ సీనియర్ నాయకులతోనూ ఆమె భేటీ అవుతారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులను కలిసి ఆమె కోరనున్నారు. కాగా, జూన్ 24న ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రపతిగా అవకాశం కల్పించినందుకు ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు ద్రౌపది ముర్ము ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ నుంచి విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు.
ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపాదించారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని అన్ని మిత్ర పక్షాలు, మిత్రపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 29 చివరి తేదీ. ఈ ఎన్నిక ఫలితాలను జూలై 21న వెల్లడిస్తారు.