- రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రాజకీయ పార్టీల నేతలు
- ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్
- పెట్రో, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్
- విద్యుత్ చార్జీల పేరుతో బీజేపీ
ప్రజాతంత్ర, హైదరాబాద్ : రాష్ట్రం అందోళనలు….ధర్నాలతో అట్టుడుకుతున్నది. అధికార టీఆర్‌ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రోడ్డెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగిలో పండించిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డెక్కగా, భారీగా పెరిగిన పెట్రో, గ్యాస్ ధరలకు నిరసనగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. అలాగే, బీజేపీ నేతలు రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండో రోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు పట్టించుకోకుండా వారి జీవితాలను ఆగం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకూ బీజేపీ నేతలను గ్రామాలలో అడుగుపట్టనివ్వవద్దని టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
వ్యవసాయ చట్టాలపై రైతులు కేంద్రం మెడలు వంచిన విధంగానే తెలంగాణ రైతులు కూడా ఏకమై ధాన్యం కొనుగోళ్లు చేపట్టేదాకా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలను భారీగా పెంచడం ద్వారా పేదల నడ్డి విరిచిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ సందర్బంగా మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు మహిళా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, బీజేపీ నేతలు కూడా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు పేరుతో సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ వెంటనే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.