: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలును వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వచ్చిన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ వరి ధాన్యాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేకరించేందుకు రెండు రోజులలో జిల్లాకు కేటాయించిన 122 కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరం మేరకు గన్ని బ్యాగులు, తూకం యంత్రాలతో పాటు తేమను పరిశీలించే యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని మిల్లులతో పాటు అవసరం మేరకు పరిగి తాండూర్ కొడంగల్ లలో ఇంటర్మీడియట్ గోదాములను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ లేనందున వరి ధాన్యం సేకరణలో భాగంగా ప్రజాప్రతినిధులకు పూర్తి సమాచారం అందజేస్తూ, వారిని భాగస్వాములు చేయాలని అన్నారు. అన్ని రైస్ మిల్లుల వద్ద అవసరం మేరకు హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పని చేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వరి ధాన్యం సేకరణతో పాటు గన్ని బ్యాగులు, ధాన్యం తరలించేందుకు వాహనాలు, ఇంటర్మీడియట్ గోదాములను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. వచ్చిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నందున, ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా రైతుల నుండి ధాన్యాన్ని సేకరించాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు టోకెన్లు అందించి వరుసక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు వచ్చి విక్రయించుకునేలా చూడాలని అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు త్రాగునీరు తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణ వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ( రెవెన్యూ ) లింగ్యా నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, డి ఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శంకరాచారి, మార్కెటింగ్ ఎడి సారంగపాణి, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఏపీఎం లు తదితరులు పాల్గొన్నారు.