స్పీకర్ ఓంబిర్లా అనుమతితో సభ ఆమోదం
••న్యూ దిల్లీ, ఆగస్ట్ 1 : లోక్‌సభలో ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం ధరల పెరుగుదల పై సభలో చర్చ ప్రారంభమైంది. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దని సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఆమోదించబోమని అన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. సభలో ఆందోళన చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించినందుకు నలుగురు కాంగ్రెస్ సభ్యులు గతసోమవారం సస్పెండ్ అయ్యారు. మానిక్కం టాగూర్, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతిమణిలపై సస్పెన్షన్ విధించారు. సమావేశాలు ముగిసేవరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని సభాపతి ప్రకటించారు. అయితే, తాజాగా వీరి ప్రవర్తనపై కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. సభాపతిని అవమానించాలన్నది సభ్యుల ఉద్దేశం కాదని చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ.. దేశంలో 14 నెలల నుంచి ద్రవ్యోల్బణం రెండంకెల పైన ఉందని అన్నారు. ఇది ముప్పై ఏళ్ల గరిష్ఠమని చెప్పారు. వినియోగదారుల ధరల సూచీ.. ఆకాశాన్నంటుతోందని పేర్కొన్నారు.
రోజువారీ వినియోగ వస్తువులైన బియ్యం, పెరుగు, పన్నీర్‌పై జీఎస్టీ విధించడాన్ని తప్పుబట్టారు. పెన్సిల్, షార్ప్నర్లపైనా ప్రభుత్వం పన్ను విధిస్తోందని.. పిల్లలను సైతం విడిచిపెట్టడం లేదని ధ్వజమెత్తారు.మరోవైపు విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేశారు. దీంతో సోమవారం సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత ధరల పెరుగుదలపై చర్చ చేపట్టారు.సభలో విపక్షాల ఆందోళనల నేపథ్యంలో సోమవారం ఉదయం అన్ని పార్టీల ఎంపీలతో సమావేశమయ్యారు స్పీకర్ ఓం బిర్లా. సభలో చర్చలు జరగాల్సిన సమయంలో ఆటంకాలు కలిగించటం దేశానికి నష్టం కలుగుతోందన్నారు. సభామర్యాదను అంతా కలిసి కాపాడాలని పిలుపునిచ్చారు. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దన్నారు. ఈ క్రమంలోనే నలుగురు సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు ప్రతిపాదనను సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. దానిని ఆమోదించింది లోక్‌సభ.