రైతుల ఆత్మహత్యలపైనా జవాబు చెప్పండి
నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తే ఎలా
మూడోరోజు పర్యటనలో రాష్ట్ర సర్కార్‌పై మరోమారు కేంద్ర మంత్రి నిర్మల ధ్వజం
వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద మోడీ ఫోటో ఏదీ : పాలమూరు పర్యటనలో కేంద్ర మంత్రి మహేందర్ నాథ్ పాండే
కామారెడ్డి/మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : శుక్రవారం జిల్లాలో తన పర్యటన సందర్భంగా తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే రాష్ట్ర మంత్రులు తనపై అకారణంగా మండిపడుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన మూడో రోజులో భాగంగా గాంధారిలో రైతులతో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్ర సర్కార్‌పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుందని నిర్మల ఆరోపించారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. 2017 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో రెండువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డస్ చెబుతున్నాయని పేర్కొన్నారు.
ఎన్నికల్లో రుణమాఫీపై హావి• ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం వందలో ఐదుగురు రైతులకు మాత్రమే చేసినట్లు చెప్పారు. మల్లన్నసాగర్, మిడ్ మానేరు, సీతారామ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి దాకా పూర్తి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న వేయొద్దని, వరి వేస్తే ఉరేనంటూ రైతులను తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోందని నిర్మల ఫైర్ అయ్యారు. అందరివాడైన రైతు సమస్యలను కేసీఆర్ సర్కార్ రాజకీయాలకు వాడుకుంటుందని మండిపడ్డారు. సున్నితమైన అంశాన్ని రాజకీయలబ్ది కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లోని రైతు సమస్యలకు అనుగుణంగా రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తుందని నిర్మల అన్నారు. ఏ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధాని మోదీకి తెలుసని వ్యాఖ్యానించారు.
వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద మోడీ ఫోటో ఏదీ : పాలమూరు పర్యటనలో కేంద్ర మంత్రి మహేందర్ నాథ్ పాండే
పాలమూరులోనూ ఫోటో వ్యవహారంపై మరో కేంద్రమంత్రి విమర్శలు గుప్పించారు. ‘దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ పోగ్రామ్ నిర్వహిస్తుంది..మోడీ ఫోటో తప్పనిసరి.. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది.. మోడీ ఫోటో పెట్టలేదు.. సుప్రీమ్ కోర్టు సైతం మోడీ ఫోటో పెట్టుకోవాలని చెప్పింది.. కానీ కేసీఆర్ ఫోటో మాత్రమే పెట్టి మోడీ ఫోటో పెట్టకపోవడం దురదృష్టకరం’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేందర్ నాథ్ పాండే అన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వొచ్చిన కేంద్ర మంత్రి పాత పాలమూరులోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మహేందర్ నాథ్ పాండే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్ పోగ్రామ్ నిర్వహిస్తుందని వివరించారు. పాలమూరులో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ 23.96 శాతం పూర్తయింది, రాబోయే 6 నెలల్లో 100 శాతం పూర్తి చేస్తామని వైద్యాధికారులు చెబుతున్నారని తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో మోడీ ఫోటో లేకపోవటం దురదృష్ట కరం అని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ దేశ్‌కి నేత కావాలని పగటి కలలు కంటున్నాడు.. అది సాధ్యం కాని పని అని కేంద్ర మంత్రి మహేందర్ నాథ్ పాండే పేర్కొన్నారు.