అవిభక్త కరీంనగర్ జిల్లాకు 50 వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర ఉంది. చరిత్రలో ఆంధ్రులకు లభించినంత వరకు, శాత వాహనుల మొట్ట మొదటి రాజవంశం, ఆదీ మహా రాష్ట్ర లోని పైఠానో లేక నాసిక ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే వీరు ఆంధ్రులని, కరీంనగర్ జిల్లా నే వారి మూల పురుషులకు ఆవాస స్థానమని, చారిత్రక పరిశోధనలు స్పష్టం చేశాయి. శాతవాహన వంశానికి మూలపురుషుడు అని భావింపబడే శ్రీముఖుడు కోటి లింగాలను రాజధానిగా చేసుకుని పాలించాడని స్పష్టం అయినాక, ఆయన నాణేలు కోటిలింగాలలో లభ్యమైనాక చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు 65 కి.మీ .ల, ధర్మపురి క్షేత్రానికి 19 కి.మీ.ల దూరాన వెల్గటూర్ మండలం లోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థాన మందుగల కోటిలింగాల లోని పుట్ట కోట గోడలు (పూర్వపు కోటలు) ఆంధ్రదేశ పాలకులైన శాతవాహనుల తొలి రాజులకు ఆటపట్టయినవి.
ఆంధ్రుల తొలిరాజుగా పురాణాలలో వర్ణించ బడిన శ్రీముఖ చక్రవర్తి నాణాలను , కప్పారావు పేట సమీపాన, ధర్మపురి వాస్తవ్యులు ప్రముఖ చారిత్రక పరిశోధకులు, పురావస్తు శాఖలో ఎపిగ్రాఫిక్ అసిస్టెంట్ (శాసన వ్యాఖ్యాత)గా పనిచేస్తూ మరణించిన సంగనభట్ల నరహరి శర్మ సేకరించి, పురావస్తు శాఖకు అప్పగించడంతో , ఈ ప్రాంత ప్రాశస్త్యం వెలుగు చూడగలిగింది. శాతవాహన కాలానంతర మైనట్టి వారికి ఉద్యోగ చెందిన ‘‘మహా తలవర, మహా సేనాధిపతిపతిస’’ ఆను నాణెములు ఇచ్చట లభించినవి. విదిశా నగరమును కేద్రముగా ఏలిన చివరి శుంగ రాజుల నాణెములు లభింపగా, వాటిపై బ్రాహ్మీ లిపిలో ‘‘రజోగోబదస, రజో సమగోపస’’ అని వ్రాసి ఉన్నవి. శుంగుల అనంతరం మగధను ఏలారని పురాణాలలో పేర్కొనిన కాణ్వ రాజుల నాణెములు కూడా లభించాయి. వీటి ఆధారంగా పురాణములందు పేర్కొన్నట్లు, మగధ రాజ్యమును మౌర్యుల అనంతరం శృంగులు, కాణ్వులు పిదప ఆంధ్రులు వరుసగా పాలించినట్లు తార్కాణం ఇచ్చు చున్నదని పురావస్తు శాఖ మాజీ డైరక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శా స్త్రీ సోదాహరణంగా నిరూపించారు.
వీటిలో కొన్ని కోటిలింగాల పొలములలో బ్రాహ్మీ లిపి లోని శిలా ఫలకాలు వెలుగు చూశాయి. ఇచట లభించినట్లు అపు రూప నాణెములు వేరెచ్చటా లభించని కారణంగా , కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని అని, పరిసర ప్రాంత కేంద్ర స్థానమని స్పష్టమైంది. కోటిలింగాలలోనే నరహరిశర్మ పంచమార్క్ నాణేలు , ఇతర అపు రూప నాణేలు సేకరించి పురావస్తు శాఖకు హస గతం చేశారు. వానిలో ‘‘రజో శాతవాహ , రజో సాతకంనిస’’ ఆని బ్రాహ్మీ లిపిలో వ్రాయ బడిరది. లిపి ప్రకారం శ్రీముఖుని కన్నా ఇవి ప్రాచీనమైనవి. సహజంగా ఉండవలసిన ఉజ్జయిని చిహ్నం వీటిలో లేదని నరహరి పరిశోధనలో పేర్కొన్నాడు. శాతవాహన కాలపు పొరల్లో అనేక శాతవాహన నాణేలు లభించాయి. లభ్యమైన నాణెములను బట్టి శాతవాహన వంశ మూల పురుషుడైన శాత వాహనుడు ఆంధ్ర గోపులను , శబరులను, మహా తలవరులను, తదితర ఆంధ్ర రాజులను ఓడిరచి శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
శాతవాహనులు తొలుత ఆంధ్రుల పాలనలో భాగమై, ఆంధ్ర భృత్యులుగా ఉండి, బలవంతులై సామ్రాజ్య స్థాపనకు పూనుకున్నారని, శ్రీముఖుడు చివరి కాణ్వరాజును అంతమొందించి, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచి, విస్తరించారని జగిత్యాలకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకులు, రిటైర్ రీడర్ డాక్టర్ జైశెట్టి రమణయ్య కరీంనగర్ చారిత్రక సంస్కృతి గ్రంథంలోని వివరించారు. హాల చక్రవర్తి గాథా సప్తశతి లోని గోదావరి వర్ణన ఆధారంగా, లభ్యమైనట్లు శ్రీముఖ నాణాలను బట్టి కోటిలింగాల, శాతవాహనుల బలిష్ట దుర్గమని స్పష్టం అవుతున్నది. కోటిలింగాల సమీపమున గల గుట్ట జైన మునులకావాస స్థానముగ నుండేదని తెలుస్తున్నది. సమీపాన క్రీ.పూ.రెండవ శతాబ్దపు బౌద్ద స్తూపం పాపాయిగాం గుట్టపైన ఉండేది. ప్రస్తుతం మధ్య యుగానికి చెందిన దేవాలయం గ్రామంలో ఉంది. రెండు గర్భగృహాలకు ఉమ్మడి మంటపముంది. ప్రతి గర్భగృహంలో అంతరాళం ఉంది. ప్రధానాలయంలో కోటీశ్వరుడు లింగ రూపుడుగా ప్రతిష్ఠితుడు కాగా, దక్షిణ దిశలో ఉత్తర ముఖ గర్భగృహంలో అంతరాళం ఉంది.
ప్రధాన ఆలయంలో కోటీశ్వరుడు లింగ రూపుడై ఉన్నాడు. ఆలయం చాళుక్య రీతులలో నుండి, గోదావరి ఒడ్డున అనేక శిల్ప ప్రతిమ లున్నాయి. పురావస్తు శాఖచే త్రవ్వకాలు జరపబడి, పర్యాటక శాఖ గుర్తింపు పొందింది ఈ ప్రదేశం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాక్చరిత్రకు నిలువెత్తు నిలువుటద్దంగా నిలిచి, శాతవాహనుల తొలి రాజధానిగా చరిత్ర పుటలకెక్కి, జిల్లా సంతరించుకున్న జిల్లా చరిత్ర గతినే మార్చి, విశేష ప్రాధాన్యత కోటిలింగాల ఒడ్డు, గోదావరి నీటి వల్ల నానాటికీ కోతకు గురవు తున్నది. స్థానికుల, దాతల చేయూత, ధర్మకర్తల మండళ్ళ కృషితో, ప్రత్యేక నిధులను ప్రోగు చేసుకుని దేవస్థానాన్ని అభివృద్ధి పరుచుకుంది. పర్యాటక శాఖ ఈ గ్రామంపై చాలా కాలం చిన్నచూపే చూసింది.
గతంలో చాలా సందర్భాలలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రముఖ పర్యాటక స్థలంగా తీర్చిదిద్ద గలమని ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటన – నీటి మూటలు గానే మిగిలి పోయాయి. మంత్రిగా మంత్రి కొప్పుల హరిత హోటల్ ఏర్పాటు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు చేపట్టడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అయితే కొప్పుల ఈశ్వర్ కృషికి, సీఎం కేసిఆర్ చేయూతను అందించి, పర్యాటక సంబంధంగా ఎంతో చేయాల్సి ఉంది. రాష్ట్ర చరిత్రతో విడదీయ రాని సహస్రాబ్దుల సంబంధాన్ని కలిగిన అపు రూప చారిత్రక బంధాన్ని తత్సంబంధ ఆధారాలను పరిరక్షించి, గోదావరి వద్ద రక్షణ గోడ నిర్మించి, కోటిలింగాల ఉనికిని కరుమరుగు కాకుండా ఉండ గలందులకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నాయి.
-రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494