మొదట 50 ర్యాంకుల్లో 8మంది తెలుగు విద్యార్థులు
హైదరాబాద్,సెప్టెంబర్8: నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. తెలంగాణకు చెందిన సిద్దార్థరావుకు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించగా ఏపీ చెందిన సాయికీర్తి తేజకు 12వ ర్యాంక్ వరించింది. మొదట 50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 8మంది ఉన్నారు. అంతే కాకుండా దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్‌సాయి 661 మార్కులు సాధించి దేశంలో తొలిర్యాంకును పొందారు.రాజస్థాన్‌కు చెందిన తనిష్క జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ పొందారు.బుధవారం అర్థరాత్రి విడుదలైన నీట్(యూజీ) 2022 ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్దార్థరావు 711 మార్కులతో నీట్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. 710 మార్కులతో ఏపీకి చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గుల్లా హర్షవర్ధన్‌నాయుడు 25వ ర్యాంకు సాధించారు. బాలికల్లో నూని వెంకటసాయి వైష్ణవి 6 స్థానం, చప్పిడి లక్ష్మి చరిత 14, వరుం అతిథి 20వ స్థానం దక్కించుకున్నారు. బాలురు విభాగంలో ఎర్రబెల్లి సిద్దార్థరావు 3, మట్టాదుర్గాసాయి కీర్తి తేజ 8, గుల్లా హర్షవర్ధన్ నాయుడు 14వ స్థానాలను ఆక్రమించారు. మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు జులై 17న పరీక్ష రాయగా అందులో 9,93,069(56.27శాతం) మంది అర్హత సాధించారు. గత ఏడాది ఇది 56.34 శాతంగా నమోదైంది. మొత్తం ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో ఓబీసీలు 45.03శాతం, ఎస్సీలు 13.26శాతం,ఎస్టీలు 4.76శాతం, జనరల్ 28.41శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 8.46శాతం మంది ఉన్నారు. ఆంధప్రదేశ్ నుంచి 68,061 మంది అభ్యర్థులు నమోదు చేసుకొని పరీక్షకు 65,305 మంది హాజరయ్యారు. అందులో 40,344 మంది (61.77శాతం) అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 61,207 మంది పేర్లు నమోదుచేసుకోగా, పరీక్షకు 59,296 మంది హాజరయ్యారు. అందులో 35,148 మంది (59.27శాతం) మంది అర్హత పొందారు. జాతీయ సగటుతో పోలిస్తే రెండు తెలుగు రాష్టాల్ల్రోనూ ఎక్కువమంది అర్హత సాధించారు. రాజస్థాన్‌కు చెందిన తనిష్క 715 మార్కులతో జాతీయస్థాయి తొలిర్యాంకును కైవసం చేసుకున్నారు. దిల్లీకి చెందిన వత్సా ఆశిష్ బాత్రా రెండవ స్థానం పొందాడు. టాప్ 50లో 8 మంది తెలుగువిద్యార్థులు చోటు దక్కించుకున్నారు. 705 మార్కులతో మంగసముద్రం హర్షిత్‌రెడ్డి 36వ ర్యాంకు, అంతే మార్కులతో తెలంగాణకు చెందిన చప్పిడి లక్ష్మి చరిత 37వ ర్యాంకు, కంచన జీవన్‌కుమార్‌రెడ్డి 41వ ర్యాంకు, 700 మార్కులతో వరుం అథితి 50వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్‌సాయి 661 మార్కులు సాధించి దేశంలో తొలిర్యాంకును ఆక్రమించారు. ఆంధప్రదేశ్‌కు చెందిన జూటూరి నేహ 695 మార్కులతో ఆల్‌ఇండియాలో 134 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కోటాలో 10వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఎస్సీ కేటగిరిలో ఆంధప్రదేశ్‌కు చెందిన కొమ్ము ఆదర్శ్ 685 మార్కులతో జాతీయ స్థాయిలో 7, ఆలిండియార్యాంకు విభాగంలో 453వ స్థానంలో నిలిచారు.ఎస్టీకోటాలో తెలంగాణకు చెందిన ముదావత్ లితేష్ చౌహాన్ 688 మార్కులతో తొలిస్థానంలో, గుగులోతు శివాని 680 మార్కులతో రెండోస్థానంలో, ఆంధప్రదేశ్‌కు చెందిన వడిత్య తేజశ్విని 675మార్కులతో మూడోస్థానంలో నిలిచారు. వీరికి ఆలిండియా ర్యాంకుల్లో వరుసగా 400, 715, 1,112 దక్కాయి. అలాగే తెలంగాణకు చెందిన లవోద్య బ్రింద 671మార్కులతో 5, అనుమేహ భూక్య 670 మార్కులతో 6వ స్థానంలో నిలిచారు. ఆలిండియా ర్యాంకుల్లో 1374, 1619 దక్కించుకున్నారు. ఓబీసీ కోటాలో ఏపీకి చెందిన గుల్లా హర్షవర్ధన్‌నాయుడు 3వ ర్యాంకు, తెలంగాణకు చెందిన చందల యశశ్విణిశ్రీ 8వ స్థానం సొంతం చేసుకున్నారు. రాష్టాల్రవారీగా చూస్తే తెలంగాణలో ఎర్రబెల్లి సిద్దార్థ్ రావు, ఆంధప్రదేశ్‌లో మట్టా దుర్గాసాయికీర్తి తేజ తొలిస్థానంలో నిలిచారు.