భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో నిమజ్జనాలు
ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన గణేష్ ఉత్సవ సమితి
హైదరాబాద్,సెప్టెంబర్8: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగానలోని పలు జిల్లాల్లో గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడికక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరంలో శోభాయాత్రగా తరలివచ్చే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ చుట్టూ సుమారు 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. కాగా నిమజ్జనానికి ఎలాంటి ఆంక్షలు లేవని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఇప్పటికే గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. శానిటేషన్ వాటర్ వర్కస్, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ఆర్ అండ్ బీహార్టికల్చర్తో పాటు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో నిమజ్జనాలు జరుగుతున్నాయి. శుక్రవారం టాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలను నిషేధించారు. నిమజ్జనాల కోసం గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఉండేందుకు గజ ఈతగాళ్లు, ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు. విగ్రహాల వ్యర్థాలను తొలగించేందుకు వాటర్ క్లీనింగ్ మెషీన్లను అందుబాటులో ఉంచారు. ఏర్పాట్లపై ఎలాంటి రాజకీయాలు తగదని ప్రభుత్వం స్పష్టం చేశారు. ట్యాంక్ బండ్‌పై నిమజ్జన ఏర్పాట్లను భాగ్యనగర్ గణెష్ ఉత్సవ సమితి ప్రతినిధులు గురువారం ఉదయం పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులుసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు మాట్లాడుతూ… ఈ ఏర్పాట్ల కోసమే తాము ఆందోళన చేశామని తెలిపారు. ఆలస్యమైనా భారీగా ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి దీనిని ఆపాదించడం సమంజసం కాదన్నారు. అన్ని పార్టీలతో ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారని స్పష్టం చేశారు. మతానికి సంబంధించి కూడా కాదని.. కేవలం ఘనంగా ఉత్సవాలు జరగడమే కావాలని అన్నారు. అన్ని మతాల వాళ్ళు ఉత్సవాల్లో పాల్గొంటారని భగవంత రావు వెల్లడించారు. కాగా… ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు సిద్ధమవుతున్నాడు. నేటి శోభాయాత్ర కోసం ఖైరతాబాద్ ఉత్సవ నిర్వహకులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఒకరోజు ముందుగానే మండపం షెడ్డు తొలగించారు. మట్టి గణపతి కావడంతో నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రక్ వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరోవైపు చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు ఖైరతాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి.