నోట్లయినా ఉండాలి… నోట్లో నాలుకైనా ఉండాలి..

వర్తమాన మానవ చరిత్ర అత్యంత విషాదకరంగా మారింది. నిలకడ లేని మనస్తత్వాలు, నిజాయితీ లోపించిన మనుషుల మానసిక పరిపక్వత లేని ప్రవర్తన వలన మానవ జాతికున్న విశిష్ఠ లక్షణాలు అదృశ్యమై పోతున్నాయి.మానవ స్వభావాలు వికృతంగా మారిపోతున్నాయి. కరోనా సమయంలో చాలా మందిలో మానవత్వం వెల్లివిరిసింది. మనం ఎలా బ్రతకాలో నేర్పించిన కరోనా పాఠాలు గుణపాఠాలు కావాలని ఆశించాం.అయితే  మన ఆశ నిరాశగానే మారింది. చావులో కూడా మానవీయ కోణం ఆవిర్భవించలేదు. కరోనా కాలంలో మనిషిలో ఏర్పడిన వైరాగ్యం నీటిబుడగలా మారిపోయింది. కరోనా క్షీణదశకు చేరిన తర్వాత మనిషిలో కూడా మానవత్వ ఛాయలు క్షీణించడం మొదలెట్టాయి. మానవ నైజం మొదటికొచ్చింది. సమాజంలో విలువలు ఏనాడో  విధ్వంసమయ్యాయి.మనిషిలో మానవత్వం నశించింది. మానవతత్వమే మటుమాయమైనది. విధ్వంసకరమైన, విద్వేష పూరితమైన ఆలోచనలతో మానవ నైజం అపసవ్యమైన దిశలో పయనిస్తున్నది.

పురాణకాలం నుండి నేటి కాలం వరకూ మానవజాతి ఔన్నత్యాన్ని గురించి  అనేక  ప్రాచీన గ్రంథాల్లో,తాళపత్రాలలో, ఆధునిక రచనల్లో విశదీకరించడం జరిగింది. అటువంటి మహిమాన్వితమైన మానవ శక్తి నిర్మాణాత్మకంగా ఉపయోగపడకుండా   విధ్వంసకరంగా పరివర్తన చెందడం నేటి వ్యవస్థ చేసుకున్న పాప పరిహార ఫలితమేమో అనిపించక మానదు.వివేకం స్థానంలో మూర్ఖత్వం,విచక్షణ స్థానంలో  విధ్వంస మనస్తత్వం బలంగా నాటుకుపోయింది. మానవ మేథస్సు వక్రమార్గంలో పయనిస్తుంది.మానవుని ఆలోచనా విధానం వక్రగతిలో పురోగతి చెందడం అనర్ధదాయకం- అటవికం. కొత్తనీరొచ్చి పాత నీరును ప్రక్కకు గెంటినట్టుగా పాతతరాన్ని,పాతతరపు ఆలోచనలను నవతరం ఎప్పటికప్పడు ప్రక్కకు నెడుతూ “కొత్తొక వింత- పాతొక రోత” గా మారుతూ, స్థానభ్రంశం చెందడం కాలానికున్న  సహజలక్షణం. అయితే గతంలో ఒక తరం వారి ఆలోచనా విధానాలను అవగతం చేసుకుంటూ వారిని గౌరవిస్తూ వారు చూపిన బాటలో పయనించడానికే ప్రయత్నం చేసేవారు.

విలువలకు పెద్ద పీటవేస్తూ, సమాజంలో ఎలాంటి అలజడులు,అశాంతి లేకుండా జీవించేవారు. కుల,మత,వర్గబేధాలు పాతకాలంలో ఉన్నప్పటికీ అందరూ కలసి మెలసి అరమరికలు లేని జీవన విధానం అనుసరించేవారు. పెద్దలను గౌరవించడం, విలువలను పాటిస్తూ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ, సాధ్యమైనంతవరకూ సుహృద్భావ వాతావరణం లోనే జీవించేవారు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఖండిస్తూ, న్యాయబద్దమైన తీర్పులు చెప్పే పెద్దరికం నాటి వ్యవస్థలో ఉండేది. బలహీనులు కూడా ఎవరి అండా లేకపోయినా యథేచ్ఛగా జీవించేవారంటే నాటి సమాజంలోని హుందాతనం,పెద్దరికం, న్యాయ నిర్ణయాలే కారణం. అలాంటి పరిస్థితులు నేటి కాలంలో ఎక్కడా కనిపించవు. బలవంతులకే అగ్రతాంబూలం-డబ్బున్న వారికే సమాజంలో విలువ. డబ్బుంటే తప్పులన్నీ ఒప్పులు గా చెలామణీ అవుతున్న రోజులివి.మంచికి వంచన తప్ప విలువ లేదు. కొంతమంది సమాజం చేత ఛీత్కరించుకుని,లేని పెద్దరికాన్ని తలకెక్కించుకుని, నీతికి పాతర వేస్తున్నారు. అవకాశవాదం వేయితలల విషవృక్షంగా అవతరించింది. మాటకు విలువ తగ్గింది. మనిషి సృష్టించిన నోటు మనిషినే కబళించే విడ్డూరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నోటుకున్న  ప్రాధాన్యత నోటిమాటకు లేదు.

 వికృత మనస్తత్వాలు మారడం లేదు
బంధాలన్నీ డబ్బు మాయలోపడి పటాపంచలౌతున్నాయి. మానవ సంబంధాలు తెగిన గాలిపటంలా శూన్యాకాశంలో పరిభ్రమిస్తున్నాయి. రక్తసంబంధాలు సైతం రావణకాష్ఠంలా రగిలిపోతున్నాయి. సమాజమంతా అసూయతో నిండిపోయింది. అహంకారపు పైత్యప్రకోపాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. దొడ్డిదారిలో ధనార్జనచేసి,పైకి రావడానికే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తున్నారు. పాతకాలంలో ఎవరైనా అక్రమార్జన తో పైకి వస్తే సమాజం వారిని ఛీత్కరించేది. అలాంటివారికి ఎవరూ విలువనిచ్చేవారు కాదు. ప్రస్తుత సమాజంలో నీతిగా బ్రతికేవాడికి విలువలేదు. విధ్వంస మనస్తత్వాలకే సమాజం అందలం వేస్తున్నది .ఇలాంటి దరిద్రపు సంస్కృతిని అంతమొందించాలి.

మానవ ఆయుఃప్రమాణం క్రొవ్వొత్తిలా కరిగి పోతున్నది. జీవించిన కొద్ది కాలంలో కూడా కడుపునిండా తినలేరు…కంటి నిండా నిద్రపోలేరు. రకరకాల రోగాలతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నా, మనిషిలో మార్పురాదు. సక్రమంగా జీవించాలన్న ఆలోచన మచ్చుకైనా మన మస్తిష్కంలో జనించదు. అవయవాలన్నీ చెడిపోయి,అంపశయ్యపై ఉన్నా, ధనాశ చావదు…లోభత్వం నశించదు. లేవలేక మనిషి  మంచం పాలైనా, తాను పోయినా తమ బిడ్డలకు కోట్లు కూడబెట్టాలనే వికృతమనస్తత్వాలు  మారడం లేదు పోయేముందు కూడా!!  మనసుని తీవ్ర కలతకు గురిచేసే పరిణామాలు నేటి సమాజంలో  చోటు చేసుకుంటున్నాయి.  సమాజమంటే మనుషుల సమూహమే కదా. మనుషుల “మనసు” లేని  మనస్సుల్లో అంకురించే  అవాంఛనీయ, అమానవీయ, విధ్వంసకర బీజాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించమానవు.మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకైనా తెలుస్తుందా? కనీసం ఆలోచించే మనస్తత్వమైనా మనుషుల్లో నిక్షిప్తమై ఉందా? అంటే  లేదనే సమాధానమే మనకు చటుక్కున తిరిగి వస్తుంది.

ఇతరులను హింసించే వారు కొందరైతే, హింసతో సంతోషించే వారు మరికొందరు. పెట్టిన చేతులను నరికేవారు మరికొందరు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్టుగా బంధాలనే బలవంతంగా తెంపేసి, నీతులు చెప్పేవారు మరికొందరు.పరాన్న జీవనానికే అలవాటుపడి, డాంభికాలతో  నీతులు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించడమే. ఇలాంటి అధమ స్ధానంలో జీవిస్తున్న  అగ్నికి ఆజ్యం తోడైనట్టు,వాళ్ళతో కలిసి దుష్ట మంత్రాంగాలతో బాధాతప్త హృదయాలను చితిమంటల్లోకి తోసేసి, ఆ మంటల్లోచలి కాసుకోవడం అమానవీయం. నైతిక విలువలు లేని పులితోలు కప్పుకున్న తోడేళ్ళ గుంపంతా తామే  పెద్దలమంటూ గెద్దల్లా తయారై ద్రోహ చింతనతో దగ్గరవడం మానవజాతి పతనానికి పరాకాష్ట. రాబంధుల జాతి తరిగిపోతున్నా ఏదో ఒక  రూపంలో  ఎక్కడ పీనుగు కనబడితే అక్కడ వాలిపోయే  మానవ రూప రాబంధులే అడుగడుగునా మనకు అగుపిస్తున్నాయి.

ఒకప్పుడు  తప్పు చేసిన వాడు బయట తిరగలేక జీవశ్ఛవంలా నాలుగు గోడలకే పరిమితమై కృశించేవాడు. అది గతం. సకలపాపాలు చేసి,సర్వం మేమేనంటూ డబ్బాలు కొట్టుకునే   పరాన్నభుక్కులన్నీ ఒక్కచోట చేరి  రొమ్ము విరుచుకుని మంచితనపు రుధిరమ్ము త్రాగే నరహంతకులుగా మారడం వర్తమానచరిత్ర.సహనం నశించి,నిస్ఫృహచెంది,ఇక ఈ సృష్టి  సమాప్తమై,నూతన ధర్మం ఆవిర్భవించాలని ఆశించేవారెంతోమంది నేటి వ్యవస్థ లో ఉన్నారు.ఈ ఆశావహుల కోరిక తీరకపోయినా,కనీసం ఒక చైతన్యప్రవాహం అకస్మాత్తుగా వచ్చి, అజ్ఞానతిమిరాలను చీల్చుకుని ఉషః కాంతులతో నవశకం ఆరంభం కావాలని వాంఛించడంలో అతిశయోక్తి లేదు.  సజావుగా సాగే జీవితాల్లో చిచ్చుపెట్టి, వారి మరణాలకు కారణమవుతూ,వారి చితిమంటలలో చలి కాగుతూ, బ్రతుకుతున్న రక్తపిపాసుల దమన క్రీడ ఆగాలనుకోవడం భ్రమకారాదు. మంచివారిని ముంచేసి, అభం శుభం తెలియని అభాగ్యుల కన్నీళ్ళకు కారణమౌతున్న ఆధునిక రాక్షస ప్రవృత్తిని నిర్మూలించాలంటే చట్టాలు మారాలి..
 పోయిన తర్వాత ఆరడుగుల నేలకూడా మనది కానప్పుడు,అన్నీ తెలిసిన మానవుడు ఎందుకింత స్వార్ధ పరుడౌతున్నాడు? ధనమే ఇంధనమని ఎందుకు ప్రాకులాడుతున్నాడు? ఎందుకు సజావుగా జీవించడం లేదు? కరెన్సీ కట్టలలోనే మోక్షాన్ని వెతుక్కుంటూ,  స్వార్ధమే పరమార్ధమని భ్రమిస్తూ,కరెన్సీ చుట్టూ పరిభ్రమిస్తూ,కాలాన్ని కర్పూరంలా హరిస్తూ, పరులను హింసిస్తూ,పైశాచికానందంలోనే  వికృతమైన సంతృప్తి పొందే నేటి కాలపు వింత ధోరణులు ధ్వంస జీవన ప్రమాణాలకు పరాకాష్ఠ.  ఇలాంటి ధోరణులు విడనాడకపోతే మానవ జీవితం ఆత్మహత్యాసదృశమే!! సద్గుణాలవలనే మనిషి ఉత్తముడు కాగలడు తప్ప తెచ్చిపెట్టుకున్న డాంభికాల వలన కాదు. మనలోని మంచితనం వలనే మనకు విలువ పెరుగుతుంది. ఓర్వలేనితనం తో కొంతమంది మనల్ని అందరికీ దూరం చేసినా దీర్ఘకాలంలో అది వారికే ఎదురుతిరిగే ఆయుధం అవుతుంది.  ఓర్పు అనేది ఎంతచేదుగా ఉంటుందో,దాని ఫలం దీర్ఘకాలంలో మథురంగానే ఉంటుంది. ఈ వాస్తవాన్ని గమనించి ప్రతీ వ్యక్తి పరులకు అపకారం చేయకుండా సద్వర్తనం తో మెలగడమే ఉత్తమోత్తమం.
  సృజనశీలురు,త్యాగశీలురు,సమాజహితులు,సద్వర్తనులే మానవాళి మనుగడకు మూలస్థంబాలు. మానవమనుగడకు మూలసూత్రాలైన సత్యం,ధర్మం,అహింసలే సర్వకాల సర్వవ్వవస్థలకు అనుసరణీయాలు. అరచేతిలో వైకుంఠం చూపెడుతూ,శూన్యహస్తాలు చూపెట్టే నేటి ఆధునిక సమాజవైఖరి మారకపోతే మానవాళి మనుగడ త్రిశంకుస్వర్గంలా సందిగ్ధావస్థలో  పడక తప్పదు.మనిషిపై మనిషికి నమ్మకం సడలిపోయింది.  అనుమానాలు- అపనమ్మకాలతో సహజీవనం చేస్తున్న మానవ మస్తిష్కాల్లో నమ్మకమనే పునాదులను నిర్మించాలి.మానవజాతిని విలువలసౌధాల్లో నిలబెట్టాలి.నోటి మాటలో లేని నమ్మకం “నోటు”లో మాత్రం  కనబడుతున్నది. విలువైన మాటలకు సమాజం ఏనాడో విలువివ్వడం మానేసింది. “శుష్కప్రియాలు- శూన్యహస్తాలు”  అనే  సిద్ధాంతం చుట్టూ పరిభ్రమిస్తున్న  నేటి సమాజంలో  విలువలను నమ్మితే అధోగతి- ఆత్మాభి మానం అమ్ముకుంటేనే పురోగతి లా మనిషి మానసిక పరిస్థితి తయారైనది. అపసవ్యదిశలో పరివర్తన చెందిన సమాజంలో సగటు మనిషి బ్రతుకు బండి సాగాలంటే నోట్లయినా ఉండాలి…నోట్లో నాలుకైనా ఉండాలి. అబద్ధాలతోనైనా బ్రతకాలి- అవకాశవాదంతో సహజీవనం చేయాలి. ఇలాంటి అస్తవ్యస్థమైన వ్యవస్థను గాడిలో పెట్టే సంస్కర్తలు కనుచూపుమేరలో కానరావడం లేదు. ఆశతో జీవించడం అలవాటైన మనిషికి అనునిత్యం ‘నిరాశ’ అనే నీలినీడలు వెంటాడుతూ వేధిస్తున్నాయి. విలువల పునరుద్ధరణ మాత్రమే అపసవ్యమైన దిశలో సాగే మానవ ప్రస్థానానికి స్వస్తివాక్యం పలికి   మరో మలుపుకు నాంది ప్రస్తావన గావించగలదు. డబ్బు కోసం గడ్డి తినే మనస్తత్వాలు మారాలి.  నిజాయితీకి పట్టం గట్టాలి. అవకాశవాదంలో స్వర్గాన్ని  చవిచూసే అనైతిక ప్రవర్తన పోవాలి. నిలువెల్లా నిండిన ద్రోహ చింతన జరుగుతున్న అనర్థాలు మానవ జాతికి మారణహోమాలు. మారని మనస్తత్వాలతో మానసిక విప్లవం సాధ్యం కాదు.
image.png
  -సుంకవల్లి సత్తిరాజు.
మొబైల్ నెంబర్:9704903463.
             ప.గో.జిల్లా,ఆంధ్రప్రదేశ్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page