న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాలి!

ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచిన భారతీయ న్యాయవ్యవస్థకు ఏ ఇతర న్యాయవ్యవస్థ కూడా సాటిరాదు. కానీ ‘తులసివనంలో గంజాయి మొక్కల’ తీరుగా న్యాయవ్యవస్థకు మకిలి అంటించే న్యాయాధికారులు, న్యాయమూర్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా తీర్పులు వెలువరించేలా న్యాయమూర్తులను, న్యాయాధికారులను రాజ్యాంగం అత్యంత ఉన్నత స్థానంలో నిలిపింది. విశేష అధికారాలను, విస్తృతమైన వ్యక్తిగత విచక్షణనూ కట్టబెట్టింది. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్న ఇతర వ్యవస్థల కోవలోకే న్యాయస్థానాలు సైతం ఇపుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. కొంత మంది న్యాయాధికారులు, న్యాయమూర్తులు అవినీతికి, ఆశ్రీత పక్షపాతానికి, కులమతాల ప్రభావానికి, కుటుంబ బంధాలకు లొంగిపోతున్నారని, ఫలితంగా వారి నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా ఉంటోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుండి ఒకరిద్దరు న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చినా, న్యాయవ్యవస్థ ఔన్నత్యానికి భంగం కలగనీయకూడదని వారిని అంతర్గతంగా హెచ్చరించి, తగిన చర్యలను తీసుకునే వారు.

ఆనాడు మీడియా ఇంతగా లేకపోవడంతో పెద్దగా చర్చకు అవకాశం ఉండేది కాదు. స్వాతంత్య్రం సిద్ధించిన కొత్తలోనే ఆరోపణలు ఎదుర్కొన్న అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ ఎస్‌పీ సిన్హా ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్టు-1935’ కింద పదవిని కోల్పోయారు. అప్పటికింకా రాజ్యాంగం అమలులోకి రాలేదు. ఆనాటి ప్రభుత్వం గౌరవ వ్యాఖ్యానాలతోనే సిన్హాను ఇంటిముఖం పట్టించింది. అసలు వ్యవహారం అవినీతి అని తెలిసినా, న్యాయపాలనలోనూ, వ్యవస్థల గౌరవాన్ని నిలపడంలోనూ విఫలమయ్యారని పేర్కొంటూ ఆయనను పదవి నుండి తొలగించారు. 1979లో అప్పటి మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.వీరస్వామి అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అది తేలడానికి మూడు దశాబ్దాలు పట్టింది. వ్యవహారం కాస్తా నానిపోయింది. 1991-93లో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ వి. రామస్వామి ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో పదవి కోల్పోయిన జస్టిస్‌ వీరస్వామి మనుమడే రామస్వామి. రామస్వామిపై 12 ఆరోపణలు వచ్చాయి. అందులో ఏడు ఆరోపణలు రుజువు చేయదగ్గ స్థాయిలో ఉన్నాయని సావంత్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. సుప్రీం కోర్టు సైతం స్వయంగా పరిశీలనలు చేసి ఐదింట మూడు ఆరోపణలు నిజమేనని తేల్చింది.

అవినీతి, రాజకీయ నేతలతో సంబంధాల విషయమే కాదు, అనైతిక ప్రవర్తనను సైతం నిర్ధారించింది సుప్రీం కోర్టు. 1995లో ఇలాంటి ఆరోపణలనే ఎఎం భట్టాచార్జీ ఎదుర్కొన్నారు. ముంబయి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించిన భట్టాచార్జీ చివరికి రాజీనామా చేశారు. చీకటి సామ్రాజ్యానికి చెందిన వ్యక్తుల కేసులకు సంబంధించి ఒక ప్రచురణ కర్త నుండి 70 లక్షలు తీసుకున్నారని ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1996లో అజిత్‌ సేన్‌ గుప్తా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంపై అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అజిత్‌ సేన్‌ గుప్తాను పదవీ విరమణ తర్వాత ఫెరా చట్టాల ఉల్లంఘన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 1994 అక్టోబర్‌ నుండి 1997 మార్చి వరకూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ ఏఎం అహ్మదీ సైతం చిన్న చిన్న విషయాల్లో ఆశ్రీతపక్షపాతంపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఢల్లీి హైకోర్టులో న్యాయవాదిగా ఉంటున్న తన కుమార్తెకు కొంతమంది న్యాయమూర్తులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వెనుక జస్టిస్‌ అహ్మదీ కారణమనే విమర్శలు వచ్చాయి. న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు న్యాయవాదులుగా ప్రాక్టీస్‌ చేయడం తగదని, ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ చేసిన తీర్మానం ఆ తర్వాత వీగిపోయింది.

 

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ ఏ ఎస్‌ ఆనంద్‌ తన భార్యకు, అత్తకు అనుకూలమైన తీర్పుకోసం దిగువస్థాయి న్యాయాధికారిని ప్రభావితం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. రెండు దశాబ్దాల పాటు కాలాతీతమైన పిటిషన్‌ను స్వీకరించమని దిగువస్థాయి న్యాయాధికారిపై ఒత్తిడి చేసినట్టు జస్టిస్‌ ఆనంద్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. జస్టిస్‌ ఆనంద్‌ వయస్సుకు సంబంధించిన అంశంపై కూడా సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఆ నివేదిక అంశాలు నేటికీ వెలుగు చూడలేదు. జోద్‌పూర్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ అరుణ్‌ మదన్‌ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైద్యురాలు సునీత మాలవియా 2002 నవంబర్‌లో ఆయనపై సంచలన ఆరోపణలు చేస్తూ, ఒక కేసులో తనకు అనుకూలంగా వ్యవహరించే న్యాయమూర్తితో పాటు తనతోనూ శారీరక సంబంధం పెట్టుకోవాలని కోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్‌ తనకు ఫోన్‌ చేసి కోరినట్టు చెప్పారు. ఈ విజ్ఞాపన తర్వాత తీర్పు సునీతకు అనుకూలంగా వచ్చింది. అయితే అప్పటి సీజేఐ జీబీ పట్నాయక్‌ ఆరోపణలు విచారించిన తర్వాత అరుణ్‌ మదన్‌కు ఎలాంటి విధులు అప్పగించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు.

 

తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పిస్తే నగదు ఇస్తామని హర్యానా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎల్‌ సింగ్‌, జస్టిస్‌ మెహతాబ్‌ సింగ్‌ గిల్‌, జస్టిస్‌ అమర్‌బీర్‌ సింగ్‌ పేర్కొన్నారని పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ చైర్మన్‌ ఆర్‌పీ సిద్దు ఆరోపించారు. ఈ ఆరోపణలు రాగానే జస్టిస్‌ మెహతాబ్‌ సింగ్‌ గిల్‌, అమర్‌బీర్‌ సింగ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. జస్టిస్‌ ఎంఎల్‌ సింగ్‌ మాత్రం రాజీనామాకు నిరాకరించడంతో హైకోర్టు ఆయనకు ఎలాంటి కేసులు అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. కర్నాటక హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌ఎస్‌ వీరభద్రయ్య, జస్టిస్‌ వి.గోపాలగౌడ, జస్టిస్‌ చంద్రశేఖరయ్యలు ఇద్దరు మహిళా న్యాయవాదులు, మరో మహిళతో పాటు అతిథి గృహంలో ఉన్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేయడంతో ముగ్గురు న్యాయమూర్తులూ దొరికిపోయారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించారు. ఆ కమిటీ ముగ్గురు న్యాయమూర్తులకూ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఢల్లీి హైకోర్టు న్యాయమూర్తి సుమిత్‌ ముఖర్జీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో ఉన్న అక్రమ లావాదేవీల ఆరోపణలతో రాజీనామా చేశారు. 2010లో మాజీ న్యాయశాఖామంత్రి శాంతిభూషణ్‌ సంచలన ఆరోపణలు చేస్తూ పది మంది అవినీతి న్యాయమూర్తులు వల్ల న్యాయవ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పది మంది పేర్లను వెల్లడిరచారు. తన ఆరోపణలు తప్పయితే తనను జైలుకు పంపించాలని కూడా సవాలు విసిరడమే కాదు, ఆ జాబితాను సుప్రీం కోర్టుకు సమర్పించారు.

 

2009లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రి సేన్‌పై అభిశంసనకు రాజ్యసభలో 58 మంది ఎంపీలు ప్రతిపాదించారు. చట్టసభల్లో అభిశంసన ఎదుర్కొన్న న్యాయమూర్తుల్లో జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి, సౌమిత్రి సేన్‌తో పాటు పీడీ దినకరన్‌, జేబీ పార్దీవాలా, వి.రామస్వామి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెయిల్‌ కోసం నిందితులకు అనుకూలంగా వ్యవహరించి న్యాయమూర్తితో పాటు ఇద్దరు జిల్లా జడ్జీలు జైలుకు వెళ్లిన అంశం అందరికీ తెలిసిందే. తాజాగా కొంత మంది న్యాయమూర్తులు ఉన్నత న్యాయస్థానాల్లోని సీనియర్లపై పక్షపాత ఆరోపణలు చేస్తున్నారు. సుప్రీం న్యాయమూర్తులు తమకు జరుగుతున్న అన్యాయంపై బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహంచినపుడే దేశం అంతా ఉలిక్కిపడిరది. ప్రపంచంలో అవినీతి లేని దేశం అంటూ లేదని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ సంస్థ ఇటీవల ప్రకటించింది. పాశ్చాత్య దేశాల్లో సైతం ఏదో ఒక దశలో ఎక్కడో ఒక చోట అవినీతి జరుగుతోందని ఈ సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. అన్ని రంగాల్లో విస్తరించిన అవినీతి న్యాయవ్యవస్థను సైతం కుదేలు చేస్తోంది.

 

భారత్‌లోనూ న్యాయవ్యవస్థలో అవినీతి రొంపి చొచ్చుకొచ్చిందని ఈ నివేదిక పేర్కొంది. ఎంతోకాలంగా న్యాయమూర్తులపై ఆరోపణలు వస్తున్నా ఆచితూచి వ్యవహరిస్తున్న వ్యవస్థలు తాజాగా కొంచెం కఠినంగానే స్పందిస్తున్నాయి. గతంలో  పాట్నా న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఉలిక్కిపడేలా చేశాయి. బిహార్‌ మహాదళిత్‌ వికాస్‌ మిషన్‌ చైర్మన్‌గా ఉన్న ఒక మాజీ ఐఎఎస్‌ అధికారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్‌ కోసం ఆశ్రయిస్తే దానిని హైకోర్టు తిరస్కరించింది. సుప్రీం కోర్టు సైతం ఆ పిటిషన్‌ను తిరస్కరించి, దిగువ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఆయన లొంగిపోయిన రోజునే దిగువ కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఉన్న అనుమానాలను జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ కొంత తీవ్ర స్వరంతో వెళ్లగక్కడాన్ని సహించలేకపోవడాన్ని కూడా చూశాం. ఏదేమైనా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యవస్థ పక్కచూపులు దేశానికి చేటు. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాలి!
-రేగటినాగరాజు
(సీనియర్‌ జర్నలిస్ట్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page