సంగారెడ్డి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: గోదావరి నీళ్లు సంగారెడ్డి జిల్లా పంట పొలాల్లో తడవాలంటే అది బిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని గోకుల్ ఫంక్షన్ హాల్లో మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు నేరుగా ఆన్ లైన్ ద్వారా ఇన్ పుట్ సబ్సిడీని పంపిణీ చేశారు. పంట నష్టపోయిన 3666 మంది రైతులకు నాలుగు కోట్ల నాలుగు లక్షల 77 వేల రూపాయలు వారి ఖాతాలకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఏడాదిలోపు సంగమేశ్వర ప్రాజెక్టు కట్టి ,కాలేశ్వరం నీటిని తెచ్చి మీ పంట పొలాలకు నీళ్లు అందిస్తామని అన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల ఉచిత విద్యుత్ లేదన్నారు. కొందరు మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని మూడు గంటల కరెంట్ వ్యవసాయానికి సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. మూడు గంటల కరెంట్ చాలని ఒక పార్టీ అంటే, మోటర్లకు మీటర్లు పెట్టాలని మరో పార్టీ వారు అంటున్నారన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత విద్యుత్ అందిస్తూ మూడు పంటలు కావాలని ఆశిస్తున్నారని, ఏది కావాలో రైతులు ఆలోచించాలన్నారు. ధరణి ఉండడంతోనే రైతుకు రైతుబందు, రైతు బీమా నేరుగా రైతుల ఖాతాల్లో జమఅవుతున్నాయన్నారు. ధరణి వల్ల రైతులు భూములు అమ్మడం,కొనడం సులభతర మైందన్నారు. ధరణి వల్ల భూమిని మరొకరి పేరు మీదికి మార్చేశక్తి ఎవరికి లేదని, భూ యజమాని చేతి వేలికి మాత్రమే ఉందన్నారు. ధరణితో ఎవరి భూమికి వారే హక్కు దారులయ్యారన్నారు.
అదే విధంగా ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తు న్నామన్నారు.అకాల వర్షాలు, వడగండ్ల వానలకు పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్సున పరిహారం అందిస్తున్నామన్నారు. సద్ది తిన్న రేవు తలవాలని, రైతుల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు ఆశీర్వాదించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్,ఎమ్మెల్యే మానిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మఠం బిక్షపతి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మానిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి,రైతులు, తదితరులు పాల్గొన్నారు.