అమెరికాలో 1860 ప్రాంతంలో డిడిటి వల్ల పక్షులు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అనే విషయంపై సమగ్ర పరిశోధన చేసి సైలెంట్ స్ప్రింగ్ (నిశ్శబ్ద వసంతం) అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించి దానిద్వారా మానవజనిత పర్యావరణ విధ్వంసం పై మొట్టమొదటిసారి అమెరికా నేతల ద్వారా వ్యవసాయానికి డిడిటిని వాడకాన్ని నిలిపి వేసేలా రాచల్ కార్సన్ అనే మహిళా శాస్త్రవేత్త పరిశోధనలు చేసారు. ఆ తర్వాత 1973లో అత్యంత పెద్ద స్థాయిలో పెద్దపెద్ద ఫ్యాక్టరీల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాగించడం వల్ల పర్యావరణానికి తీర్చలేని లోటు ఏ విధంగా జరుగుతుందో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకంలో ఈ ఎఫ్ షూమేకర్ అనే ఆర్థిక శాస్త్రవేత్త రాశాడు. ఆయన ఈ పుస్తకంలో ప్రకృతి మనకిచ్చిన వనరులు ఒక మూలధనంగా వాడుకోవాల్సిందే గాని దానిని నిరంతరం లభ్యమయ్యే ఒక వస్తువుగా ఉదాహరణకి గాలిగా వాడుకునేందుకు వీలు లేదని, అలా వాడుకుంటే భవిష్యత్తులో మానవజాతి మునుగడకే ప్రమాదకరమని హెచ్చరించాడు. అయినా బడా వ్యాపారస్తులు వారి లాభాల కోసం ఇలాంటి శాస్త్రవేత్తలు ఎన్ని హెచ్చరికలు చేసినా వాటిని విస్మరించడమే కాకుండా వారి పర్యావరణ ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు నిలువరించే ప్రయత్నం చేశారు. మొట్టమొదటిసారి 1988లో ఈ పర్యావరణ సంక్షేమం గురించి చేసిన పరిశోధనలు ఐక్యరాజ్యసమితి దృష్టికి వచ్చింది.
అది ప్రభుత్వ అధినేతల దృష్టికి తీసుకుపోయి ఐపీసీసీ (పర్యావరణ మార్పుపై అంతర్జాతీయ కమిటీ) వేసి పర్యావరణ పై జరిగే పరిశోధనలు సమీక్షించి పర్యావరణ నష్టాన్ని నిలువరించే ప్రయత్నం చేసేందుకు పర్యావరణ మార్పు కోసం ఒక విధానాన్ని ఏర్పాటు చేసింది. ఇదే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ((KNF))(పర్యావరణం రక్షణకై ఐక్యరాజ్యసమితి విధానం . ఇందులో మానవజనిత కార్యక్రమాల వల్ల పర్యావరణానికి నష్టం అవుతుందని, దాని నిలువరించవలసిన అనివార్యమని, దానికోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచనలు చేసింది. అయితే ఈ సూచనలు కార్యరూపం దాల్చేందుకు అన్ని దేశాలను ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలను ఒప్పించేందుకు చాలాకాలం పట్టింది. ఈ అన్ని దేశాల్లో మొట్టమొదటిసారి 1997లో జపాన్లో క్యోటో అనే ప్రాంతంలో 192 దేశాలతో ఒక పెద్ద సమావేశం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పేరున జరిపించింది. అప్పటినుండి ఇప్పటివరకు 26 సార్లు సమావేశాలు జరిగాయి. నవంబరు 6 నుండి 18 వరకు, 27వ సమావేశం ఈజిప్ట్ లోని శర్మ్ అల్ షేక్ అనే ప్రాంతంలో జరగనుంది. ఈ మొట్టమొదటి సమావేశంలో పర్యావరణానికి నష్టం కలిగించే అటువంటి కాలుష్య ఉధ్గారాలు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక నమూనాల నుండే వస్తున్నాయి అని ఒప్పించి.
వారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మళ్ళీ ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టే కార్యక్రమాలు చేపట్టకూడదని, అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉధ్గారాలను తగ్గించే ప్రయత్నం చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని, దీనికి కావాల్సిన సాంకేతికత అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలతో పంచుకోవాలని, దాని గురించి అందరూ తమ వంతు సహాయం చేయాలని ప్రపంచ స్థాయిలో ప్రతి సంవత్సరం 100 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాలని అమెరికా లాంటి కొన్ని దేశాలు వారి వంతు ప్రయత్నం చేసినప్పటికీ బాధ్యతగా స్వీకరించలేదు. మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే పారిస్ లో జరిగిన ఈ సమావేశం బహిష్కరించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆయనే మానవజనిత కార్యక్రమాల వల్ల పర్యావరణ విధ్వంసం అనేది ఒక జోక్ అని కూడా చెప్పాడు. అయినా గ్లోబల్ కమిషన్ ఆన్ ద ఎకానమీ అండ్ క్లైమేట్ (ఆర్థిక విధానాలు మరియు పర్యావరణ మార్పు పై అంతర్జాతీయ కమిషన్) వారు 2018లో లోతైన పరిశోధన చేసి ఈ పర్యావరణానికి జరుగుతున్న విధ్వంసాన్ని ఎన్నో రంగాలలో అంచనాలు వేశారు.
ఉదాహరణకి 2017లో 320 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం కొన్ని వేల ప్రాణాలు ఈ పర్యావరణ విధ్వంసం ద్వారా జరిగాయని కచ్చితంగా అంచనా వేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా 2018 నుండి పర్యావరణాన్ని గురించి శాస్త్రజ్ఞులు ఇస్తున్నటువంటి సూచనలని ‘యూస్ ఇట్ ఆర్ లూజ్ ఇట్’ (పట్టించుకోండి లేక పతనం కండి)అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను విస్మరించ లేని పరిస్థితిని వివరిస్తూ రెండువందల పైగా పేజీల రిపోర్ట్ తయారు చేశారు. అమెరికా 45వ వైస్ ప్రెసిడెంట్ అయిన అల్ గోర్ ఆన్ ఇన్కన్వీనియెంట్ ట్రూత్(2006) అనే డాక్యుమెంటరీ ద్వారా పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచానికి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో ఇంకా ఎంత ఘోరమైన దుస్థితి దాపరించవచ్చు చాలా భయం వేసేలా కల్పించేలా చిత్రీకరించాడు.
పర్యావరణ పెను మార్పులు ఇప్పుడు అందరికీ కనబడుతూనే ఉన్నాయి. గత 19 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాలుగా శాస్త్రజ్ఞుల ద్వారా గుర్తింపబడినది. ఈ పర్యావరణ పెను మార్పులపై మన వాతావ రణంపై దుష్ప్రభావం గణాంకాలు ద్వారా నిరూపించబడ్డాయి. ఉదాహరణకి 1974-2001 మధ్య సంవత్సరంలో 1300 వరద పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడితే, 2001- 2018 మధ్యలో 2800 ప్రాంతాలలో వరదల సంభవించాయి. అదేవిధంగా 1950 మరియు 1983 మధ్య 50 సార్లు ప్రపంచం వ్యాప్తంగా భయంకరమైన అడవి మంటలు ఏర్పడితే 1984- 2018 మధ్య 350 సార్లు అడవులు తగలబడ్డాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం క్యాలిఫోర్నియా ప్రాంతాల్లో, పోయిన సంవత్సరం ఆస్ట్రేలియన్ లో జరిగినటువంటి భయంకర అతి ఉష్ణోగ్రతల వల్ల తగలబడడం ద్వారా ఎంత అడవి, జంతువులు మరియు ఆస్తి నష్టం జరిగిందో యూట్యూబ్ చానళ్లు టీవీల ద్వారా ప్రత్యక్షంగా చూసాం. 1950 నుంచి 1983 వరకు ప్రపంచ వ్యాప్తంగా 190 ప్రాంతాలలో అన్నావృష్టి సంభవిస్తే 1984 నుండి 2018 వరకు 500 ప్రాంతాలలో అన్నావృష్టి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1973 నుంచి 1995 వరకు 100 సార్లు అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడితే, 1996 నుండి 2018 వరకు 430 సార్లు ఇలాంటి సంఘటనలు సంభవించాయి. ఎప్పుడు చల్లగా ఉండే ఉత్తర అమెరికా మరియు యూరోప్ ప్రాంతాలలో కూడా ఎండలకు తాళలేక ఎండ దెబ్బకి ఎంతోమంది బలి అవుతున్నారు అనేది ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్నటువంటి విషయం.
శాస్త్రజ్ఞులంతా ఒప్పుకునే ముఖ్యమైన విషయం మానవులు ప్రస్తుతం అవలంబించే అటువంటి ఆర్థిక విధానాల వల్ల, విపరీతమైన అనవసరమైన వస్తువు వినియోగం వల్ల పారిశ్రామిక విప్లవం సమయం నుండి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని,ఇవి రెండు డిగ్రీల కన్నా ఎక్కువగా పెరిగితే అప్పుడు పర్యావరణ విధ్వంసాన్ని ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని ఎన్నో సిములేషన్ మోడల్స్ అంటే ప్రయోగశాలలో సాంకేతికను ఉపయోగించి చేసిన ప్రయోగాల వల్ల నిరూపితమైంది. ఒక అంచనా ప్రకారం 2050 వరకు ప్రపంచం మొత్తంగా ఈ పర్యావరణ విధ్వంసాన్ని తగ్గించేందుకు, భవిష్యత్తులో వీటిని స్థిరీకరించేందుకు 90 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు అవసరమని అంచనా వేశాయి. శాస్త్రజ్ఞులు పర్యావరణ విధ్వంసం ఆపేందుకు ఒక డాలర్ ఖర్చు పెడితే దాని ద్వారా భవిష్యత్తులో నాలుగు డాలర్ల లాభం వస్తుందని నిరూపించారు. అందుకోసం ఆర్థిక వేత్తలు సర్కులర్ ఎకానమిక్ మోడల్ ప్రతిపాదించారు. ప్రకృతిక వనరులను తిరిగి తిరిగి వాడుకోవడం, తక్కువ వాడుకోవడం, ఉన్నవాటినీ సమర్ధవంతంగా వాడుకోవడం, వృధాను అరికట్టడం, ముఖ్యంగా త్వరలో అంతరించి పోయే టువంటి వాతావరణ కాలుష్యం పెంచే అటువంటి బొగ్గు లాంటి వనరులని వాడుక తగ్గించటం ఈ స్వయం చొదక ఆర్థిక విధానాల్లో ముఖ్యమైన అంశాలు. అయినా 30 సంవత్సరాలగా ఈ పర్యావరణ రక్షణకై చేపడుతున్న కార్యక్రమాలపై ఇప్పటివరకు 600 బిలియన్ డాలర్స్ అంటే అవసరం ఉన్న దాంట్లో ఒక శాతం కూడా ఖర్చు పెట్టలేదు.
గ్లోబల్ కమిషన్ ఆన్ ద ఎకానమీ అండ్ క్లైమేట్ (నూతనార్తిక విధానం మరియు క్లైమేట్ పై అంతర్జాతీయ సంస్థ) అనే సంస్థ చాలా సుదీర్ఘమైన పరిశ్రమ ద్వారా అత్యంత వివరంగా ఈ పర్యావరణ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడున్న ఆర్థిక విధానాలకు బదులుగా పర్యావరణ రక్షణకు సముచితమైనటువంటి ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండాలో వివరించింది. ఇందులో ముఖ్యంగా పునరుత్పదక విద్యుత్ శక్తి ఉత్పత్తి విధానాలు, నగరాలను అతి తక్కువ శక్తి వాడే నిర్వహణ పద్ధతులు ఏర్పరచుకోవడం, నీటి వినియోగాన్ని సమర్ధవంతం చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించటం, ప్రపంచ వనరులని ముఖ్యంగా ఖనిజాలను లేక విద్యుత్ తయారు చేసేందుకు వాడేటువంటి బొగ్గు ఇతర వనరులని అతి తక్కువగా వాడడం, కాలుష్యాన్ని తక్కువ చేసి అడవుల పెంపకం ఉన్న అడవుల్ని నరకకపోవడం లాంటి ఎన్నో సూచనలు చేశారు.
అయినా ఇప్పటికీ ప్రపంచంలో అవసరమైన విద్యుత్తు 80% కాలుష్య కారకాలైన బొగ్గు లాంటి వనరుల ద్వారానే తయారు చేయబడుతుంది. అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేసి అన్ని దేశాలకు కలిసి ఉన్న ఈ ఒక్క గ్రహం అనే ఆస్తిని కాపాడు కోకుండా ఈ విపత్తు ఆపేందుకు శాస్త్రజ్ఞులు చేస్తున్నటువంటి హెచ్చరికల్ని పెడచెవినబడుతున్నారు. మీరంటే మీరు అనే ధోరణి ఇంకా మనం చూస్తున్నాం. ఇవన్నీ వదిలిపెట్టి ప్రపంచ దేశాలు అంతా కూడా వ్యాపారస్తుల లాభాలపై దృష్టిని పక్కనపెట్టి షూమేకర్ చెప్పినట్టు సామాన్య ప్రజాకేంద్రిత ఆర్థిక విధానాలు పాటించాల్సిన అవసరం ఉంది.
మన దేశ విషయానికి వస్తే పర్యావరణ రక్షణ కోసం ముఖ్యంగా మూడు లక్ష్యాలు ఏర్పరచుకోబడ్డాయి. అవి కాలుష్యకారక ఉద్గారాలని 2005 స్థాయిలో 45% కు తగ్గించటం, 2030 వరకు 50 శాతం విద్యుత్ శక్తి పునరుత్పదక వనరులు వాడి సమకూర్చుకోవడం, 2.5 నుండి 3 గీగా టన్నుల పారిశ్రామిక ఉద్గారాలను శోషించేందుకు కావాల్సిన అడవుల పెంపకం చేపట్టడం. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ పర్యావరణ రక్షణ కోసం పెట్టుకునే లక్ష్యాలని ఎప్పటికప్పుడు లెక్కగట్టే అటువంటి క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనే సంస్థ మన దేశానికి ఇంకా ‘హైలీ ఇనెఫీసైంట్’ అంటే అత్యంత అసమర్థమైన దేశంగానే పరిగణిస్తుంది.
డాక్టర్ మండువ ప్రసాదరావు, హైదరాబాద్