‘‘ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్’’ అని ఏనుగు లక్ష్మణ కవి అన్నట్లు ఏదైనా పనిని ప్రారంభించనే వద్దు , ఒక సారి ప్రారంభించిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాని అంతు తెలుసుకునేవరకు కార్యసాధకులు వదిలిపెట్టరు. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలుచుకుని ఏపని చేపట్టని వారు అధములు. ఏదో ఆటంకాలు ఎదురవగానే ఆ పనిని వొదిలిపెట్టేవారు మధ్యములు. ఈ పద్యాన్ని పలు సందర్భాల్లో చెప్పే కెసిఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజెపియేతర కూటమి ఏర్పాటు విషయమై ఆయన ప్రారంభించిన కార్యక్రమాన్ని వొదిలేదిలేదన్నట్లుగా ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు జరిపారు. ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నరనడానికి ఆయన తాజా పర్యటనే నిదర్శనం.
శుక్రవారం దిల్లీ బయలుదేరిన కెసిఆర్ అనేక మంది రాజకీయ ప్రముఖులతో ఈ విషయంపై చర్చలు జరిపేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అలాగే దేశ ఆర్థిక పరిస్థితిపైన కూడా పలువురు ఆర్థిక నిపుణులతో సమావేశం కావడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈసారి ఆయన జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులను సమావేశపరచి దేశ, విదేశీ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై సమగ్రంగా చర్చించబోతున్నట్లు తెలుస్తున్నది. కాగా ఆదివారం నాడు పంజాబ్‌లో పర్యటించే సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో అసువులుబాసిన రైతు కుటుంబాలను పరామర్శించడంతోపాటు ఆ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది.. అలా సుమారు ఆరు వందల కుటుంబాలకు ఆయన ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవత్ మాన్ కూడా పాల్గొనబోవడం విశేషం. ఇద్దరు ముఖ్యమంత్రులతో మూడవ ఫ్రంట్ గురించి చర్చించే అవకాశాలు దీనివల్ల ఏర్పడనున్నాయి. గతంలో కర్ణాటక పర్యటన సందర్భంగా మాజీ ప్రధాని దేవగౌడను, ఆయన కుమారుడు- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలుసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోమారు వారిరువురిని కలుసుకుని దేశ రాజకీయాపై చర్చించే అవకాశం ఉంది.
ఆ తర్వాత మరోసారి మహారాష్ట్రలో పర్యటించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అక్కడ రాలెగావ్ సిద్దికి వెళ్ళి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో వివిధ• అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. మరో విడుత పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కూడా పర్యటన ఏర్పాట్లు కూడా సిద్దమయ్యాయి. ఈ నెల చివరన ఈ ప్రాంతాలు పర్యటించేప్పుడు గల్వాన్ లోయలో చైనాతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలను పరామర్శించడంతోపాటు వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి అందజేయబోతున్నట్లు సమాచారం.
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని కెసిఆర్ గత కొంతకాలంగా చెబుతున్నారు. అయితే జాతీయ స్థాయిలోని కాంగ్రెస్, బిజెపి పార్టీలను మినహాయించి మరో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటువల్లే అది సాధ్యమవుతుందన్నది ఆయన అభిప్రాయం. అయితే ఇటీవల థర్డ్ ఫ్రంట్ కాదని చెబుతున్నా ఒక ప్రత్యమ్నాయ ఏర్పాటుపైనే పలు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు దృష్టిపెట్టినట్లు తెలుస్తున్నది. దాన్ని సాకారం చేయడంకోసం కెసిఆర్ ఇతర నాయకులకన్నా ఒక అడుగు ముందుకు వేసి వివిధ రాష్ట్రాల నాయకులతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే వివిధ• కారణాలతో ఆ చర్చలు ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ సమయంలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడంతో కెసిఆర్ తన దృష్టినంతా ఆ ఎన్నికలపై పెట్టాల్సిన పరిస్థితిలో కొంత విరామం ఇవ్వడమైంది.
అయితే ముందుగానే చెప్పినట్లు ఆరంభించకుండానే ఉండాలికాని, ఆరంభించిన తర్వాత ఫలితాలు సాధించేవరకు దాన్ని విడిచి పెట్టి పారిపోవడమన్నది పిరికి వాళ్ళ చర్య. సరిగ్గా అదే విషయాన్ని కెసిఆర్ తన రాజకీయాలకు జోడించారనడానికి ఆయన తాజా టూర్ చెప్పకనే చెబుతోంది. శుక్రవారం శ్రీకారం చుట్టిన ఈ దేశ పర్యటనకు ముందు ఆయన తన ఫాం హౌజ్‌లో రాజకీయ వ్వూహకర్త ప్రశాంత్ కిశోర్, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో పాటు పలువురు మాజీ ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపి పర్యటనా షెడ్యూల్‌ను తయారు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ పర్యటన ఫలితాలెలా ఉండబోతాయన్న దానిపైనే దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి.