ఉప్పొంగుతున్న నదులతో కేంద్రం హెచ్చరికలు
న్యూఢిల్లీ, ఆగస్ట్ 17: దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్ లెవెల్ స్థాయికి చేరాయి. దీంతో డ్యాంల వద్ద ప్లడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల వల్ల డ్యాం నీటిని విడుదల చేయడంతో మహారాష్ట్రలోని వసాయి, పాల్ఘార్, దహాను, వడ, విక్రంఘడ్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వైతర్నా, పింజాల్ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో తాన్సా, మోదక్ సాగర్, కావడాస్, ధామినీ డ్యాంలలోని వరదనీటిని కిందకు విడుదల చేశారు. ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల మహానది పొంగి ప్రవహిస్తోంది.అల్పపీడనం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదనీరు ప్రవహిస్తుండటంతో 10 జిల్లాల్లోని 2 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. భద్రక్ జిల్లాలో వరదనీటితో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
దీంతో వరదప్రాంతాల ప్రజలను పడవలతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బైతారణి నది వరదనీటి ప్రవాహంతో భద్రక్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీవర్షాలతో నర్మద నది పొంగి ప్రవహిస్తోంది. నర్మదాపురం జిల్లాలోని ప్రజలు వరదనీటి ప్రవాహంతో నానా అవస్థలు పడుతున్నారు. నర్మదా నదిలో వరద నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. నర్మదా నది వరదనీటి ప్రవాహంతో నదీ తీర ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్టాల్లోన్రి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు సైతం వరదనీటితో నిండాయి.కర్ణాటక, చత్తీస్ ఘడ్, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు ప్లడ్ అలర్ట్ జారీ చేశారు.