పాతబస్తీలో రాహుల్ గాంధీకి జేజేలు
మహేశ్వరం, అమనగల్లు ప్రజాతంత్ర నవంబర్ 1: భారత్ జూడో యాత్రలో బాగంగా.. మంగళవారం రాహుల్ గాంధీ పాదయాత్ర పాతబస్తీలో ప్రజల నీరాజనాలు మధ్య కొనసాగింది. ప్రజలు జాతీయ జెండాలు, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ.. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఊటీపడేలా ఏర్పాటు చేసిన పలు పోతురాజుల విన్యాసాలు, బోనాలు, మర్పా, తదితర కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. నగరంలోకి ప్రవేశించిన పాదయాత్ర బహుదూర్ పూరలోని లెగసీ ప్యాలెస్ రాహుల్ గాంధీ విరామం తీసుకున్నారు. రాహుల్ గాంధీని చూడటానికి నగరం నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున లెగసీ ప్యాలెస్ కు చేరుకున్నారు. లెగసీ ప్యాలెస్ నుంచి ఉండాల్సిన పాదయాత్ర ను భద్రత దృష్ట్యా రద్దు చేసి, బహుదూర్ పూర నుంచి, పురాణపుల్ మీదుగా చార్ మినార్ వరకు రాహుల్ గాంధీ వాహనంలో వెళ్ళడం జరిగింది. చార్ మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ జెండా ను ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపించారు. అనంతరం మొదలైన పాదయాత్ర చార్ మినార్ నుంచి పత్తార్ గట్టి మదీనా మీదుగా నగరంలో కొనసాగింది. మదీనా దగ్గర పలువురు హైకోర్టు న్యాయ వాదులు నిలబడి, రాహుల్ గాంధీకి సంఘీభవం తెలిపారు. న్యాయవాదులు రాహుల్ గాంధీని కలుసుటకు ప్రయత్నం చేసిన, రాహుల్ గాంధీని కలవలేక పోయారు. భద్రత దృష్ట్యా రాహుల్ గాంధీ పాదయాత్ర చేయకపోవడం తో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.