ఉభయ సభలు సోమవారానికి వాయిదా
న్యూ దిల్లీ, జూలై 29 : పార్లమెంటులో మరోమారు గందరగోళం కొనసాగింది. ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు సోమావారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మునుద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి అనుచిత పదజాలం వాడటంపై పార్లమెంట్ శుక్రవారం దద్దరిల్లింది. ఇటు బిజెపి ఎంపిలు, అటు కాంగ్రెస్ ఎంపిలు ఇరు సభల్లో వాదులాడుకున్నారు. దీంతో రాజ్యసభ, లోక్‌సభ సోమవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభలో నిత్యావసర ధరలు, ఇతర అంశాలతో పాటు తాజా అంశంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఎగువ సభలో చర్చలు ఈ వారం కూడా సజావుగా సాగలేదు. సభలో ఆందోళనలు చేపడుతున్నారన్న కారణంగా రాజ్యసభలో 23 మంది ప్రతిపక్ష ఎంపిలు సస్పెండ్ కాగా, దిగువ సభలో 4 ఎంపిలపై వేటు పడింది.
శుక్రవారం రాజ్యసభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్షాలు ఆందోళనలతో పాటు ముర్మును రాష్ట్రపత్ని అని సంభోధించిన అధిర్‌కు వ్యతిరేకంగా అధికార పక్ష ఎంపిలు ఆందోళన చేపట్టారు. దీంతో సభ మధ్యాహ్నానానికి వాయిదా పడింది.తిరిగి 12 గంటలకు సభ సమావేశం కాగా, కాంగ్రెస్ ఎంపిలు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. గుజరాత్‌లో కల్తీ మద్యం అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కేంద్ర మంత్రి స్మ•తి ఇరానీ ఇబ్బందికి గురిచేశారంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇరు సభలనూ సోమవారానికి వాయిదా వేశారు.