పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం!

పిల్లలకు తగినంత సమయం కేటాయించాలి
పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం
ఓటమిని తట్టుకోవడం నేర్పాలి

పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో  సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. దీనితో పిల్లలలో మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని అధిగమిస్తే పరీక్షలలో విజయం సాధించడం చాలా తేలిక అని గుర్తించాలి. పిల్లలు తక్కువ సమయంలో ఎక్కువ అంశాలు నేర్చుకోవాలి, వాటినన్నింటిని గుర్తుపెట్టుకొని పరీక్షలలో రాసి మంచి మార్కులు సంపాదించుకోవాలి. పరీక్షల సమయంలో పిల్లలు తీవ్రమైన  ఒత్తిడికి లోనవుతారు. తల్లిదండ్రులు వారి పిల్లల బంగారు భవిష్యత్తు గురించి తీవ్రంగా చాలా ఆలోచిస్తూ, మనసులో కలిగే ఆందోళనలతో, పిల్లలు జీవితంలో మంచి స్థితిలోకి రావాలనే కాంక్షతో, పిల్లలే సర్వస్వం అని భావించే  తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రులలో కలిగే ఈ ఒత్తిడి ప్రభావం పిల్లలపై తీవ్రంగా చూపిస్తుందని గుర్తించాలి. పిల్లల్లో కలిగే పరీక్షల ఒత్తిడిని తగ్గించడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర.

పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే….
ప్రణాళిక : పిల్లలతో ప్రతి విషయాన్ని షేర్‌ చేసుకోవాలి. పరీక్షల సమయానికంటే ముందుగానే ఏవిధంగా పరీక్షలను ఎదుర్కోవాలో పిల్లలతో చర్చిస్తూ సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రణాళికను రూపొందించేటపుడు చదివే సమయంలో విరామ సమయం తప్పకుండా కెటాయించుకోవాలి, కష్టమైన సబ్జెక్ట్‌ లను గుర్తించి వాటికి ఎక్కువ సమయం కెటాయించేలా, వాటి పై పిల్లలు మరింత దృష్టిని కేంద్రీకరించే విధంగా ప్రణాళిక ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

సౌకర్యవంతమైన వాతావరణం: పిల్లలు చదువుకోవడానికి సౌకర్యవంతమైన తగు వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. టీవీ, ల్యాప్‌టాప్‌ , సెల్‌ ఫోన్‌ మొదలైన అంతరాయాలకు దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి. పిల్లలు సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాటు సరిగా లేకపోతే, పిల్లలకు మెడ నొప్పి, తలనొప్పి లేదా వెన్నుముక నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు కూర్చుని చదువుకొనే స్టడీ చైర్‌  సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయాలి, సోఫా లేదా మంచం లపై చదవడానికి ప్రోత్సహించవద్దు ఇలా చేస్తే కండరాల పై ఒత్తిడి కలిగి తొందరగా అలసి పోయే ప్రమాదం ఉంటుంది.

పోషకాహారం : పరీక్షల సమయంలో పిల్లలు తిండి తినడంలో సరైన ఆసక్తి చూపించకపోవ చ్చు. పిల్లలు నిర్ణీతసమయంలో ఆహారాన్ని తీసుకోవడంలో తల్లిదండ్రులుగా సరైన బాధ్యతను పోషించాలి. కదుపులో ఆకలిగా ఉన్నప్పుడు చదువు పై ఏకాగ్రత కుదరడం చాలా కష్టం.  మెదడు చురుగ్గా పనిచేయాలంటే పిల్లలు సరైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.

మంచి నిద్ర: పిల్లలు నిర్దేశించుకున్న లక్ష్యం పూర్తి చేయడానికి నిద్రను దరి చేరనీయకుండా  చేస్తూ తీవ్రంగా కష్టపడుతూ చదువుతూ ఉంటారు. మంచి నిద్ర వలన జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి. పరీక్షకు ముందు రోజు అర్థరాత్రి వరకు కష్ట పడుతూ చదవడం మంచిది కాదు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 6 నుండి 7 గంటలపాటు నిద్రపోయే విధంగా తగు సూచనలు ఇస్తూ గమనిస్తూ ఉండాలి. నిద్ర పోకుండా తీవ్రంగా కష్టపడటం కంటే మంచి నిద్ర తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

సహాయకరిగా ఉండాలి: పిల్లలకు తల్లిదండ్రులు ఎల్లపుడు సహాయకారిగా ఉండాలి. పిల్లలు ఎక్కువ సమయం చదవడానికి కేటాయిస్తున్నప్పుడు, ఇతర పనులలో వారికి సహాయకారిగా ఉండాలి.  పిల్లలు చదువుకునే గదిని శుభ్రంగా ఉంచడం చేయాలి.ఇతర పనుల పట్ల వాల్ల ఆలోచనలు మరలకుండా తగు జాగ్రత్తను తీసుకుంటే ఏకాగ్రతతో చదివే అవకాశం ఉంటుంది.

పిల్లలతో మాట్లాడండి: పరీక్షల సమయంలో పిల్లలతో గడపడానికి, వారితో మాట్లాడడానికి ఎక్కువ సమయం కెటాయించాలి. పిల్లల మానసిక స్థితి, ఆందోళనలను, భయాన్ని గమనిస్తూ తగిన విధంగా గైడ్‌ చేస్తూ ఉండాలి. పరీక్షల సమయంలో భయం కలగడం సర్వసాధారణం అని వివరిస్తూ పరీక్షలకు బ్రహ్మాండంగా ప్రిపేర్‌ అవుతున్నావనే ప్రోత్సాహాన్ని అందించాలి, ఆందోళన పడవల్సిన అవసరం లేదని వారికి భరోసాను ఇస్తూ ఉండాలి.

శారీరక ఆటలను  ప్రోత్సహించాలి: పరీక్షల సమయంలో పూర్తిగా ఆటలు ఆడరాదని నిబంధన విధించడం సరి కాదు.  శారీరక ఆటలు ఆడడం వలన మనస్సుకు విశ్రాంతి దొరుకుతుంది. ఒత్తిడి తగ్గుతుంది మరియు శక్తిసామర్థ్యాల  స్థాయిలు పెరుగుతాయి. పరీక్షల సమయంలో కూడా నిర్ణీత సమయంపాటు శారీరక ఆటలకు అనుమతించాలి.

ఒత్తిడిని పెంచవద్దు: గతంలో పిల్లల ఫేయిల్యూర్స్‌ ను పదే పదే గుర్తుచేస్తూ పిల్లలలో ఒత్తిడిని పెంచకూడదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం కూడదు. పిల్లలు పరీక్షకు హాజరు కావడానికి ముందు వారికి సానుకూల ఆలోచనలను (పాజిటివ్‌ థింకింగ్స్‌) కల్పించాలి. పిల్లలను ఎల్లప్పుడూ  ప్రోత్సహిస్తూ, పిల్లల సామర్థ్యానికి తగ్గట్లుగా, వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించాలి.

వైఫల్యాలను ఆమోదించాలని పిల్లలకు శిక్షణ ఇవ్వాలి:

పిల్లలలో వైఫల్యాలను ఎదుర్కోవడం, తట్టుకోవడం నేర్పిస్తూ ఉండాలి. ఓటమి అనేది విజయానికి ఒక మెట్టు లాగా, విజయాన్ని సాధించడానికి కావల్సిన సంకల్ప బలం అందిస్తుందని ప్రోత్సహించాలి.

పిల్లలను బహుమతులతో ప్రోత్సహించండి :

పరీక్షల ముగిసిన సమయం కూడా మరో పరీక్షకు ప్రారంభ సమయమని గుర్తించాలి. పరీక్షల సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి ఉంటారు. పరీక్షలు ముగిసిన వెంటనే విహారయాత్రకు గాని, లేదా పిల్లల కృషికి అభినందనీయంగా బహుమతిని అందించాలి. పరీక్షలలో పొందే మార్కులతో కాకుండా పిల్లలను పిల్లలుగానే గుర్తించాలి. పిల్లల పట్ల స్నేహపూర్వకంగా మెదలుతూ ఉండాలి.
-డా.అట్ల  శ్రీనివాస్‌ రెడ్డి, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ రిహాబిలిటేషన్‌, సైకాలజిస్ట్‌
ఫ్యామిలీ కౌన్సెలర్‌
సెల్‌: 9703935321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page