అనంతపురం: సెల్ఫోన్లో పబ్జీ గేమ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. నార్పల మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నరేందర్ రెడ్డి మృతికి పబ్జి ఆటే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జంగం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొవ్వూరు రమణారెడ్డి కుమారుడు కొవ్వూరి నరేంద్ర రెడ్డి (19), అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ డియట్ రెండవ సంవత్సరం చదువుతూ.. ఫెయిల్ అవ్వడంతో గత మూడు, నాలుగు నెలల నుండి ఇంటి వద్దనే ఉంటున్నాడు. బుధవారం పొలంలో వేరుశనగ పంటకు క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తుండగా తండ్రికి సహాయంగా స్పేర్లోకి నరేందర్ రెడ్డి నీరును అందించడానికి వెళ్ళాడు.
కానీ ఉన్నట్లుండి పొలంలోనే నరేందర్ రెడ్డి అక్కడే ఉన్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మ హత్య ప్రయత్నం చేశాడు. వెంటనే స్పందించిన తండ్రి, బంధువులు.. ఆసుపత్రికి తరలించినా నరేందర్ రెడ్డి ప్రాణాలు దక్కలేదు. సెల్ ఫోన్లో గేమ్లకు అలవాటు పడడం, దీనికీతోడు ఇంటర్ ఫెయిల్ కావడంతో మానసికంగా కంగి పోయాయాడని స్థానికులు తెలిపారు. మొత్తానికి ఆవేశంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఏకైక కొడుకు మతి చెందడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఇటువంటి సంఘటనలు చూసైనా విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు హెచ్చరిస్తున్నారు.