పెద్దవాగుకు భారీ గండి

  • వరద ఉధృతికి కొట్టుకుపోయిన పశువులు
  • కొండలు, గుట్టలపై తలదాచుకున్న ప్రజలు
  • భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
  • చర్ల వద్ద తాలిపేరుకు వరద ఉధృతి
  • అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
దమ్మపేట, ప్రజాతంత్ర, జూలై 19 : భదాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సవి•పంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో నీళ్లన్నీ దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది. ప్రాజెక్టు కట్ట తెగి వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. పలు గ్రామాల ప్రజలు కొండలు, ఎత్తయిన భవనాల్లో రాత్రంతా తలదాచుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సహాయక చర్యలకు వీలు లేకుండా పోయింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద చేరడంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. గురువారం 20 అడుగులు వద్ద ఉన్న వరద.. శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి 24.5 అడుగులకు చేరింది.
గోదావరికి ఎగువ ప్రాంతంలో ఉన్న పేరూరులో ఉదయం 9 గంటలకు 40.86 అడుగులు నమోదైంది. ఇంద్రావతి, పేరూరు వైపు నుంచి వరద భద్రాచలం గుండా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో ప్రమాద స్థాయికి వరద చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 43 అడుగులు వరద వొస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. 48 అడుగులకు వస్తే రెండు, 53 అడుగులకు వొస్తే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. గోదావరి ప్రాంతంలో వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సెక్టోరియల్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గజ ఈతగాళ్లు, పడవలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపుచర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువన ఉన్న చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది. దీంతో శుక్రవారం 24 గేట్లు ఎత్తి 59 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువన గోదావరికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 60,297 క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో వొస్త్తుంది. ప్రాజెక్టులో క్రమేపీ వరద ఉద్ధృతి పెరుగుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ ఉపేందర్‌ ‌తెలిపారు. మరో పక్క చింతవాగు, పగిడి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
దక్షిణ, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, వరంగల్‌, ‌హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page