- డిమాండ్ చేస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ
- పోరాటం ఉధృతం చేయాలని ఆదివాసీలకు పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : పోడు రైతులపై ఫారెస్ట్, పోలీసు అధికారుల దాడులు నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. రైతులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎత్తివేయాలని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులపై పాశవిక దాడులు చేయిస్తుందని ఆరోపించారు. హరితనిధి పేరుతో చేసే వసూళ్లను వెంటనే నిలిపివేయాలన్నారు. అడవితో పెనవేసుకుని ఉన్న ఆదివాసుల జీవితాలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందని ఆరోపించారు.
ఇప్పటికే ఆసీఫాబాద్ జిల్లాలో టైగర్ జోన్ పేరుతో ఆదివాసీల గూడాలను ఖాళీ చేయిస్తూ వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. వరంగల్, ములుగు, అదిలాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్ వంటి ఏజెన్సీ జిల్లాలో ఎక్కడో ఓచోట ఫారెస్ట్ జులుం, దౌర్జన్యాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయని..దీంతో రాష్ట్రంలో ఆదివాసులకు రక్షణ కరువైందని అన్నారు. ఆదివాసి చట్టాలను అమలుచేయకుండా వాటిని కాలరాసి అమాయక ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే పథకాలు రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలపై ఆదివాసీలు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.