తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గం..బషీరాబాద్ మండలం..రెడ్డి ఘనపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ మహారాజ్ మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీనే అసలు చిరునామా అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పెన్షన్లు, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కాంగ్రెస్ హయాంలో నేరుగా అమలు అయినట్లు తెలిపారు.కానీ నేడు కేసీఆర్ పాలన పేదవాడి నుండి లాగి పెద్దవారికి దోచిపెట్టె కార్యక్రమంగా మారాయని ఆరోపించారు. దేశంలో బిజెపి రాష్ట్రంలో ,బీఆర్ఎస్ ప్రజలను పన్నులు, ధరల పెంపుతో పీక్కుతింటున్నాయని ,కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల బతుకులు మారలేదని,బీఆర్ఎస్ నేతలు కోట్లకు పడగలెత్తారని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ,బిజెపి పార్టీలను ప్రజలు బొంద పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మనం ఎన్నో ఏళ్లుగా కలలుగన్న తెలంగాణ ఆకాంక్షల నెరవేర్చిన సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని బిజెపి ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తోందని, గాంధీ కుటుంబం ఈ దేశ స్వాతంత్రం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు ఎన్నో త్యాగాలు చేసినట్లు తెలిపారు.రెండు ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలి.. అక్రమ బంధంతో మళ్లీ ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేస్తున్నాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.