‌ప్రణాళిక ప్రకారమే అడుగులు..

మునుగోడు గెలుపు రానున్న శాసనసభ ఎన్నికలకు లిట్మస్‌ ‌టెస్ట్‌గా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఎన్నిక సెమీ ఫైనల్‌ అవుతుందని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఏర్పడిన మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఖాలీ తో ఉప ఎన్నిక అనివార్యమన్నది తెలిసిందే. ఈ పరిస్థితిని కల్పించే విషయంలో బిజెపి పక్కా ప్రణాళికను రచించిందన్నది స్పష్టం. తెలంగాణలో బలం పుంజుకునే విషయంలో బిజెపి ఒక్కోఅడుగు ఆచితూచి వేస్తూవస్తున్నది. శాసన సభలో ఒక్కడంటే ఒక్క శాసనసభ్యుడు రాజాసింగ్‌తో ప్రారంభించి ఇప్పుడు ముగ్గురు సభ్యులకు చేరుకుంది. మిగతా రెండు స్థానాలను అధికార పార్టీతో హోరాహోరి పోరాడి గెలుసుకోవడంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ, క్యాడర్‌లోనూ భవిష్యత్‌పై ఆశ చిగురింపజేసింది. విచిత్రమేమంటే ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీపడి గెలిచిన ఇద్దరు కూడా గతంలో టిఆర్‌ఎస్‌ ‌నాయకులే కావడం. ఆ పార్టీ విధానం, నాయకుడి తీరు నచ్చక వారు బిజెపిలో చేరి ఆ స్థానాల ను కైవసం చేసుకున్నారు.

అదే దారిలో మరికొందరు తమ పార్టీలోకి వొచ్చే అవకాశాలున్నట్లు బిజెపి చెబుతోంది కూడా. చాలామంది శాసనసభ్యులు తనతో టచ్‌లో ఉన్నట్లు హుజురాబాద్‌నుండి భారతీయ జనతాపార్టీ తరఫున పోటీపడి గెలుచుకున్న మాజీ టిఆర్‌ఎస్‌ ‌నేత ఈటల రాజేందర్‌ ‌తరుచూ ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. ఎన్నికల వరకు ఎంతమంది అధికార పార్టీవారిని బిజెపి అకర్షిస్తుందో తెలియదుగాని, మరో ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌ ‌నుండి కూడా వలసలను ప్రోత్సహించడంలో సఫలీకృతం అవుతున్నది. తాజాగా కాంగ్రెస్‌లో కల్లోలం సృష్టించిన సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పుట్టిస్తున్నది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటినుండి మొదలైన విద్వేష రాజీనామా వరకు దారితీసిన సంఘటన ఇప్పుడు కాంగ్రెస్‌ను కుదిపివేస్తున్నది. పార్టీలో సీనియర్లు అనేకమంది ఉన్నప్పటికీ ఇతర పార్టీనుండి అందునా వోటుకు నోటులో జైల్‌కు వెళ్ళి వొచ్చిన వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవినివ్వడమేంటని అలిగిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా కేవలం కాంగ్రెస్‌ ‌పార్టీకే పరమితం కాకుండా ఇతర పార్టీల్లోకాక రగిలించినట్లైంది. తాను రాజీనామా చేసినా తన స్థానాన్ని తానే దక్కించుకుంటానన్న ధీమా రాజగోపాల్‌కు ఉన్నప్పటికీ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎట్టిపరిస్థితిలో శంకరగిరి మాణ్యాలు పట్టించాలని కాంగ్రెస్‌ ‌పట్టుదలతో ఉంది. అందుకు ఇప్పటినుండే ప్రణాళికను సిద్దం చేసుకుంటోంది. రాజగోపాల్‌రెడ్డిని అనునయించడంలో విఫలం అయిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఆయనకు ధీటైన వ్యక్తి అన్వేషణలో పడింది. అయితే రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడి పోతున్న పరిస్థితిలో ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరుపై మరో నాయకుడు మండిపడుతున్నాడు.

రాజగోపాల్‌రెడ్డికి స్వయంగా అన్న అయిన కోమటి వెంకటరెడ్డి రేవంత్‌రెడ్డి మాటలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రాజగోపాల్‌రెడ్డిని నిందించే క్రమంలో మీరు అని సంబోధించడం పట్ల ఆయన తన అభ్యంతరాన్ని లేవదీశారు. సాధారణంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అం‌టు వ్యాఖ్యానించడానికి అలవాటుపడిన నేపథ్యంలో, ఈ సీరియస్‌ ‌విషయంలో కూడా మీరు అని తామిద్దరిని కలపి మాట్లాడటంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. తమ్యుడిని నిరోధించలేక పోయాడన్న నింద ఆయన్ను వెన్నాడుతుండగా, పార్టీ అధ్యక్షుడి మాటతీరు ఆయన్ను తీవ్ర అసహానానికి గురిచేసింది. ఇదిలా ఉంటే వాస్తవంగా రాజగోపాల్‌రెడ్డికి ముందు వెంకట్‌రెడ్డి పార్టీ మారుతాడన్న ప్రచారం జరిగింది. కాని, ఆయన ఇటీవల తాను పక్కా కాంగ్రెస్‌ ‌వాదినని, పార్టీ వీడేదిలేదని స్పష్టంచేశాడు. కాని, రేవంత్‌రెడ్డి మాటలకు ఆయన ప్రతిస్పందించిన తీరుపై పత్రికలు ఆయన పార్టీ మారే అవకావాలపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే వీరిద్దరి వల్ల కాంగ్రెస్‌కు పెద్ద అగాధం ఏర్పడే అవకాశాలున్నాయి. మునుగోడుతోపాటు చుట్టుపక్కల రెండు మూడు నియోజకవర్గాల్లో వీరి ప్రభావం బలంగా ఉండడంతో కాంగ్రెస్‌కు భవిష్యత్‌లో పెద్ద దెబ్బే. ఈ పరిస్థితిని కల్పించిన కమలం పార్టీ కూడా మునుగోడులో రానున్న ఉప ఎన్నికకు పకడ్బందీ ప్రణాళిక రచనలో ఉంది. ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, ‌కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ ‌నేతలు మురళీధర్‌రావు, కె. లక్ష్మణ్‌లు ఈ విషయమై సుదీర్ఘ సమాలోచన ప్రారంభించారు.

ఉప ఎన్నికల పూర్తి అయ్యేవరకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ఇన్‌ఛార్జిని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. గత రెండు ఉప ఎన్నికల మాదిరిగానే బూత్‌ ‌స్థాయి ఇన్‌ఛార్జీలను ఏర్పాటు చేసుకునే పనిలో ఉంది. కాగా రెండు ఉప ఎన్నికల్లో పరాజయ పరాభవాన్ని మోస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్టి పరిస్థితిలో మునుగోడును ఈసారి చెయ్యి జారవిడుచుకోవద్దన్న పట్టుదలగా ఉంది. అందుకు ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేయడంలో చాలా ఆచీతూచి వ్యవహరించాలను కుంటోంది. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మునుగోడులో ముందుగా పార్టీ శ్రేణులను సన్నద్దంచేసే పనిలో టిఆర్‌ఎస్‌ ‌పడింది. దుబ్బాక, హుజురాబాద్‌లో ధీటైన అభ్యర్థిని పోటీ నిలుపలేక పోవడం వల్లే అ రెండు స్థానాలను పోగొట్టుకోవడం జరిగిందని, ఈసారి మాత్రం రాజగోపాల్‌రెడ్డితో సమానంగా అన్ని విధాలుగా పోటీపడగల వ్యక్తినే నిలుపాలని ఆ పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అభ్యర్థి సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలను బేరీజు వేసుకోవడంతోపాటు, అక్కడ తాజాగా నిర్వహిస్తున్న సర్వే ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఇప్పటికే ఆ పార్టీ తలమునకలై ఉంది. గతంలోలాగా బిజెపిని ఇప్పుడు అంత సులభంగా తీసుకునే పరిస్థితిలేదన్నది ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page