వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: జల వనరులు, చెరువుల నీరు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులానే పూజించాలని జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ లు సంయుక్తంగా పేర్కొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ లు అధికారులకు వారి సిబ్బందికి మట్టి గణపతి లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినాయక చవితిని శ్రద్ధగా భక్తిశ్రద్ధలతో పూజించి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తూ ఉంటామని, దీనివల్ల జల వనరులు చెరువులు కాలుష్య బారిన పడి వృక్ష, జంతు జీవనంపై ప్రభావం పడుతుందన్నారు. సహజంగా మట్టితో చేసిన గణపతులను వినియోగిస్తే దుష్ప్రభావాలు పడకుండా ఉంటుందని, అందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని సూచించారు. తమతో పాటు తమ ఇరుగు పొరుగు కుటుంబంలోని సభ్యులందరూ కూడా మట్టి గణపతి విగ్రహాలు వినియోగించేలా అందరికీ ప్రేరేపించాలని అన్నారు. కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో రెండు వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మట్టి గణపతులనే నెలకోల్పు కోవాలి అనే సందేశం గల గోడపత్రికను అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ పర్యావరణ ఇంజనీర్ వెంకట నర్సు, జిల్లా అధికారులు వారి సిబ్బంది పాల్గొన్నారు.