‘‘ఈ యుద్ధంతో ఉక్రెయిన్ పూర్తిగా విధ్వంసం కావడంతో పాటు రష్యాపై పలు దేశాల ఆంక్షల నడుమ ఆ దేశ ఆర్థిక స్థితి 30-ఏండ్లు వెనక్కి వెళ్లడం జరిగిందని అంచనా. ఉక్రెయిన్ జనావాసాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. పరిశ్రమలు బాంబులతో పేలి పోతున్నాయి. సామాన్య జనులు హాహాకారాలు చేస్తున్నారు. ఆవాసాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రధాన కేంద్రాలు భస్మీపటలం అవుతున్నాయి. జనాలు పిట్టల్లా రాలుతున్నారు.’’
(ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ భీకర పోరు 4 నెలలు పూర్తి అవుతున్న సందర్భంగా)
శరీరానికి ఏదో ఒక భాగంలో ముళ్లు గుచ్చుకున్నపుడు దేహమంతా బాధను అనుభవిస్తాం. అలాగే ప్రపంచంలో నేడు ఏ మూలన యుద్ధం జరిగినా ప్రపంచ దేశాల ఆర్థికాభివ్యవస్థలు కుందేలు కావడంతో పాటు నిత్యవసరాల ధరలు పెరగడం వెంటనే కనిపిస్తున్నది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ విధ్వంసం నాలుగు మాసాలుగా కొనసాగుతోంది. కోవిడ్-19 అలల దెబ్బల నుండి తేరుకుంటున్న వేళ ‘గోరు చుట్టుపై రోకలి పోటులా‘ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలకు ప్రత్యక్ష కారణం అవుతున్నది. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ పూర్తిగా విధ్వంసం కావడంతో పాటు రష్యాపై పలు దేశాల ఆంక్షల నడుమ ఆ దేశ ఆర్థిక స్థితి 30-ఏండ్లు వెనక్కి వెళ్లడం జరిగిందని అంచనా. ఉక్రెయిన్ జనావాసాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. పరిశ్రమలు బాంబులతో పేలి పోతున్నాయి. సామాన్య జనులు హాహాకారాలు చేస్తున్నారు. ఆవాసాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రధాన కేంద్రాలు భస్మీపటలం అవుతున్నాయి. జనాలు పిట్టల్లా రాలుతున్నారు.
పతనం అంచున ఉక్రెయిన్, పరేషాన్లో రష్యా:
సుదీర్ఘ యుద్ధం కొనసాగుతున్న అకాలంలో ఉక్రెయిన్, రష్యాలు పతనం అంచున నలబడ్డాయి. ఓటమితో ఒకరు దుఃఖంలో మునిగితే, గెలిచిన వారు ఆర్థిక పాతాళంలోకి జారి కన్నీళ్లు కార్చుతున్నారు. 2014 నుంచి ప్రారంభమైన ప్రచ్ఛన్న యుద్ధంతో రోజు రోజుకు ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. నేడు కొనసాగుతున్న యుద్ధం 24 ఫిబ్రవరి 2022న ప్రారంభమై ప్రత్యక్ష భీకర అత్యాధునిక డిజిటల్ యుద్ధంగా మారడం ప్రపంచ మానవాళికే శాపంగా మారుతున్నది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం రెండు దేశాలపై మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక తిరోగమన దుష్ప్రభాలకు కారణం అవుతున్నది.
ఆహార సంక్షోభం ముంగిట దేశాలు:
నేడు జరుగుతున్న భీకర యుద్ధంతో ప్రపంచ దేశాల అభివృద్ధి మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్భణం, మార్కెట్ సరఫరా శృంఖలాలు విచ్ఛిన్నం కావడం, చమురు ధరలు చుక్కల్ని తాకడం, నిత్యవసరాల ధరలు సామాన్యడికి చెమటలు పట్టించడం లాంటి ప్రతికూల ప్రభావాలు అనుభవంలోకి వస్తున్నాయి. ప్రపంచ దేశాల అభివృద్ధి 4.5 శాతం నుంచి 3 శాతానికి పడిపోవడం, పలు దేశాల ద్రవ్యోల్భణం దాదాపు రెట్టింపు కావడంతో అసమానతల అగాధం పెరుగుతూ ప్రమాదకరంగా మారుతోంది. 2008 తరువాత గోధుమల ధరలు నేడు అత్యధిక స్థాయికి పెరగడం గమనించబడింది. ప్రపంచ దేశాల్లో మొక్కజోన్న, గోధుమలు, బార్లీల ఎగుమతుల్లో ఉక్రెయిన్ 4వ అతి పెద్ద దేశంగా, సన్‌ఫ్లవర్ కుకింగ్ ఆయిల్ ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉండేది. ఉక్రెయిన్, రష్యాలు కలిసి ప్రపంచ గోధుమల అవసరాలను 27 శాతం, సన్‌ఫ్లవర్ ఆయిల్/నూనె గింజల సరఫరాలో 53 శాతంగా ఉండడం గమనించాం.
ఆకలిచావుల అంచున దేశాలు:
నేడు కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ మానవాళి ఇంత వరకు ఎన్నడూ చూడని ఆహార సంక్షోభం అంచున నిలిచింది. యుద్ధ నేపథ్యంలో గోధుమల ఎగుమతులు ఆగిపోవడంతో యెమెన్, అఫ్ఘానిస్థాన్, తూర్పు ఆఫ్రికా దేశాలు ఆకలి చావుల దుస్థితిని ప్రస్తుతం అనుభవిస్తున్నారు. యుద్ధంతో సతమతం అవుతున్న ఉక్రెయిన్ 2022 స్ప్రింగ్ సీజన్లో వ్యవసాయం చేయలేని నిస్సాహాయ స్థితిలో ఉండడంతో ఆ దేశంతో పాటు పలు దేశాలు ఆహార కొరతలోకి జారనున్నాయి. ఆఫ్రికాకు చెందిన ఈజిప్ట్ లాంటి 25కు పైగా దేశాలు దాదాపు 50 శాతం వరకు గోధుమ దిగుబడులకు ఉక్రెయిన్, రష్యాల మీదనే ఆధారపడి ఉండడం అనాదిగా జరుతున్న విషయం మనకు తెలుసు. ఐరాస నివేదిక ప్రకారం 24 ఏళ్ళ తరువాత ఫిబ్రవరి-2022లో ‘ప్రపంచ ఆహార ధరల సూచీ’ అతిగా పెరగడం గమనించబడింది. ఉక్రెయిన్ను ఆక్రమించే క్రమంలో రష్యా బలగాలు ఓడ రేవులను కూడా ఆక్రమించుకోవడంతో ఆహార ధాన్యాల సరఫరా ఆగిపోవడం లేదా తగ్గిపోవడం జరిగింది. యుద్ధం కారణంగా రెండు దేశాల్లో వ్యవసాయ, ఆహార ఆధార ఉత్పత్తుల ధరల పెరగడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, పంపిణీ శృంఖలాలు తెగిపోవడంతో సాగుబడి కుంటుపడింది.
చుక్కల్లో చమురు ధరలు:
జనవరి-2022లో రోజుకు 11.3 బ్యారెల్స్ ముడి చమురును ఉత్పత్తి చేసిన రష్యా తన చమురు ఉత్పత్తుల్లో యూయస్, సౌథీ అనంతరం రష్యా 3వ స్థానంలో, సహజ వాయువు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉండేది. క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో రష్యా 2వ స్థానంలో ఉండడం గత చరిత్రగా మిగిలింది. నేటి యుద్ధంతో ప్రపంచ జనాభాలో 30 శాతం పేదరిక ఉచ్చులో పడడమే కాకుండా రోజుకు 40 మిలియన్ల బడుగులు దారిద్య్రరేఖకు దిగువన చేరనున్నారు. యుద్ధ పరిణామాల్లో 8.3 మిలియన్ల వరకు ఉక్రెనియన్ శరణార్థుల సమస్య, ఆంక్షల అగాధాలు, నిత్యావసరాల ధరలతో విశ్వ మానవాళి తీవ్ర సంక్షోభంలో పడింది. యుద్ధంలో పాల్గొంటూ నిలువరిస్తున్న ఉక్రెయిన్‌లో ఆహార కొరత, గృహ సమస్య, రవాణా, విద్య, నగదు అందుబాటు లాంటి పలు సమస్యలు వెన్నాడుతున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాతాళానికి దిగజారుతున్నది. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల్లో రష్యా ముందు వరుసలో ఉండేది. శ్రీలంకలో యుద్ధ ప్రభావం అత్యధికంగా పడింది. గోధుమ ఉత్పత్తిలో ఇండియా 2వ స్థానంలో ఉండగా నేడు యుద్ధంలో ఎగుమతులు కుంటుపడడం చూస్తున్నాం.
వాతావరణ ప్రతికూల మార్పులు:
యుద్ధ ప్రభావం వాతావరణ మార్పులపై తీవ్రంగా పడడం విచారకరం. అమెరికా, యూరోప్, నాటో దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించినా ఇండియా మాత్రం రష్యాపై ఆంక్షలు విధించకుండా రష్యా నుంచి చమురు, ఆయుధాలు లాంటివి దిగుబడి చేసుకుంటున్నది. రష్యా దాడిని భారత్ వ్యతిరేకించకపోయినా సామాన్యుల మరణాలను వ్యతిరేకిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక అణు ఆయుధాలను కలిగిన తొలి దేశంగా రష్యా నిలుస్తున్నది. యుద్ధంలో అతిగా దెబ్బ తింటున్న ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా అపార నష్టాలను చవిచూస్తున్నది. రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నంలో భాగంగా తీవ్ర ఆంక్షలు విధించిన వేళ రష్యా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్నది. రష్యాలో ప్రజావ్యతిరేకత కూడా మరో సమస్యగా అవతరిస్తున్నది. యుద్ధ సమయంలో మిలిటరీ అత్యధిక శిలాజ ఇంధనాలను వినియోగించడంతో భూతాపంపై అధిక ప్రభావం పడనున్నది. ఈ యుద్ధంతో కనీసం 25 దేశాలు ప్రతికూల వాతావరణ మార్పులకు లోను కానున్నాయి. ఉక్రెనియన్ జెలెన్స్క, రష్యా పుతిన్‌ల మొండి పట్టుతో రెండు దేశాలే కాకుండా ప్రపంచ దేశాలన్ని ఆర్థిక సంక్షోభంలో పడుతూనే నిత్యవసరాల ధరలకు రెక్కలు రావడంతో పేదలు నిరుపేదలుగా ఆకలి చావుల నడుమ కొట్టుమిట్టాడడం విచారకరం. ఈ ప్రపంచ సంక్షోభాన్ని గుర్తించి నియంత పుతిన్ ఇకనైనా యుద్ధానికి చరమగీతం పాడుతారని ఆశిద్దాం. ఆధిపత్యం కోసం ప్రాకులాడితే అసలుకే ఎసరు వస్తుందని రష్యా నేటికైనా బుద్ది తెచ్చుకొని యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుందాం.