ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది

3వ సారి ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ
స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది
పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం

న్యూదిల్లీ, జూన్‌ 10 : తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత కృషి చేస్తామని, తమది కిసాన్‌ కళ్యాణ్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వమని, అందువల్లనే బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైల్‌ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితమని ప్రధాని పేర్కొన్నారు. కాగా 3వ సారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం చేశారు. దీంతో 9.3 కోట్లమంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వ్యవసాయరంగానికి, కర్షకుల సంక్షేమంపై తమ ప్రభుత్వం మరింత దృష్టి సారించనుందని వెల్లడిరచారు. ఇక మరోపైపు..ఈరోజు మోదీ క్యాబినెట్‌ తొలి సమావేశం జరగనుంది.

పార్లమెంట్‌ సమావేశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించనుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ జరగబోయే సమావేశాల ప్రారంభం రోజున రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ ప్రభుత్వ దార్శనికత, ప్రాధాన్యతలను పేర్కొంటారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. తాజా ఎన్నికల్లో కూటమి విజయదుందుభితో వరసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించిన విషయం విధితమే. జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత దేశంలో వరసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను మోదీ సొంతం చేసుకున్నారు. తాజా కేంద్ర సర్కార్‌ 71 మంది మంత్రులతో కొలువుదీరింది. అందులో 30 మంది క్యాబినెట్‌ మంత్రులుగా ఉన్నారు. ఈ క్రమంలో భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

దిల్లీలోని పార్లమెంట్‌ సౌత్‌ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆయన మూడోసారి తన విధుల్ని నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పీఎంవోలోని ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మోదీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ పీఎం కిసాన్‌ నిధి  17వ విడత నిధుల విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page